ETV Bharat / state

గిరిజన కళ థింసాకు కొత్త శోభ - వేలాది మంది పర్యాటకులతో ఆడిస్తున్న గిరిపుత్రులు

భిన్నమైన జీవన శైలి, సంప్రదాయ వాయిద్య పరికరాల శబ్దాలతో, అడ్డుకట్టు చీరతో లయబద్ధంగా సాగే ఈ గిరిజన కళారూపానికి దేశంలో ఎంతో విశిష్టత - దేశ ప్రధానుల నుంచి అవార్డులు

Andhra Pradesh Girijana Thimsa Dance
Andhra Pradesh Girijana Thimsa Dance (EENADU)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 9, 2026 at 10:58 AM IST

2 Min Read
Choose ETV Bharat

Andhra Pradesh Girijana Thimsa Dance : మన్యాన్ని గుర్తుచేసుకుంటే ముందుగా మన కళ్ల ముందుకు వచ్చేది థింసా నృత్యం. తరతరాల నుంచి వస్తున్న గిరిజన సంప్రదాయ నృత్యమిది. ఈ కళ గిరిపుత్రుల జీవనశైలికి ప్రతిరూపం. ఆనందం వచ్చినా, ఆవేదన కలిగినా, గ్రామదేవతల పండగైనా, ఉత్సవాలైనా, ఇంట్లో శుభకార్యమైనా, విషాదం పలకరించినా, థింసాతోనే గిరిజనులు వారి భావోద్వేగాలను వ్యక్తం చేస్తుంటారు. ఆధునికత కొత్త పుంతలు తొక్కుతున్నా, జీవనశైలిలో ఎన్నో మార్పులొచ్చినా ఇప్పటికీ మన్యంలో ఈ నృత్యరీతి సజీవంగానే కొనసాగుతూనే ఉంది. ఈ థింసా మొదలెట్టాక వయసుతో సంబంధం లేకుండా, చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని వయసుల ప్రజలు చేయిచేయి కలుపుతూ, కలిసి మెలిసి అడుగులు కదుపుతూ ఆనంద తన్మయత్వంలో అందరూ మునిగిపోతారు.

సంప్రదాయ వాయిద్య పరికరాల శబ్దాలతో : గిరిపుత్రుల భిన్నమైన జీవన శైలి, సంప్రదాయ వాయిద్య పరికరాల శబ్దాలతో, అడ్డుకట్టు చీరతో లయబద్ధంగా సాగే ఈ గిరిజన కళారూపానికి దేశంలో ఎంతో విశిష్టత ఉంది. చీకటిపడితే చాలు గిరిజనులంతా ఒకచోటే చేరి చలిమంటలు వేసుకుంటూ సరదాగా థింసా నృత్యాలు చేసేవారు. సాధారణంగా తరతరాలుగా వస్తున్న సాంస్కృతిక కళలను యువతరం అందిపుచ్చుకోవడంలో తక్కువే అయినా థింసా మాత్రం ఇందుకు మినహాయింపు. కళాశాల విద్యార్థులు కూడా ఈ నృత్యాన్ని అలవోకగా ప్రదర్శించగలరు.

వేలాది మంది పర్యాటకులు : ఇప్పుడు మళ్లీ పర్యాటకం కారణంగా మన్యంలో ఈ సంప్రదాయ నృత్యానికి మంచి ఆదరణ లభిస్తోంది. మన్యంలో అరకులోయ, లంబసింగి, చెరువులవెనం, మాడగడ, తాజంగి వంటి పర్యాటక ప్రాంతాలకు దూరప్రాంతాల నుంచి ఏటా చలికాలంలో వేలాది మంది పర్యాటకులు వస్తున్నారు. వారి దృష్టిని ఆకర్షించే విధంగా గిరిపుత్రులు థింసా నృత్యాన్ని ఒక ఉపాధి మార్గంగా ఎంచుకుంటున్నారు. గిరిజన మహిళలతో కలసి ఈ నృత్యాలు చేసేందుకు పర్యాటకులు ఉవ్విళ్లూరుతున్నారు. వారితో కలసి లయబద్ధంగా అడుగులేస్తూ ఆటపాటలతో సందర్శకులు సందడి చేస్తున్నారు. ఇందుకుగాను పర్యాటకుల నుంచి థింసా నృత్యం చేసే గిరిజన కళాకారులు స్వల్ప మొత్తంలో డబ్బులు కూడా వసూలు చేస్తున్నారు.

గిరిజన నృత్యానికి గుర్తింపు : సెలవులు, పండగలు, వారాంతాలు, ప్రత్యేక దినాల్లో దూర ప్రాంతాల నుంచి మన్యానికి వచ్చి వెళ్లే పర్యాటకుల సంఖ్య ఇటీవల కాలంలో బాగా పెరిగింది. దీనివల్ల ఇటు పర్యాటకులకు ఆనందంతోపాటు సంప్రదాయ గిరిజన నృత్యానికి కూడా గుర్తింపూ లభిస్తోంది. మన్యంలో ప్రముఖుల పర్యటనలు, బహిరంగ సభల్లోనూ థింసా నృత్యాన్ని అప్పుడప్పుడు ప్రత్యేక ఆకర్షణగా గిరిజనులతో ఆడిస్తున్నారు.

దేశ ప్రధానుల నుంచి అవార్డులు : మన్యంలోని గిరిజన మహిళలు దేశ ప్రధానుల నుంచి కూడా థింసాలో అవార్డులు అందుకున్న సందర్భాలూ చాలానే ఉన్నాయి. వీరికంటూ ప్రత్యేక గుర్తింపును సంపాధించుకుంటున్నారు. అంతేకాకుండా సినీరంగంలో కూడా ప్రవేశించి చరిత్ర తిరగరాస్తున్నారు. ఈ కళారూపానికి కాలక్రమంలో ఆదరణ కరవైంది. గిరిజనుల జీవనశైలిలో వచ్చిన అనూహ్యమైన మార్పులు, మారుతున్న కాలానికి అనుగుణంగా పాశ్చాత్య పోకడలు వంటివి మన్యానికీ విస్తరించాయి. పెరిగిన సామాజిక మాధ్యమాలు, అత్యాధునిక డీజే సౌండ్స్‌ వంటి వాటి వల్ల క్రమంగా సంప్రదాయ నృత్యం కనుమరుగవుతోంది.

భారతదేశంలో ఫుడ్ అంటే గుర్తుకు వచ్చేది మన రాష్ట్రమే: సీఎం చంద్రబాబు

అంబరాన్నంటిన యానాం ప్రజా ఉత్సవాలు - ప్రదర్శనలు, ఫ్యాషన్ షోలతో ఆకట్టుకున్న ప్రదర్శనలు