ETV Bharat / state

పది ప్లాస్టిక్​ కుర్చీలు కొన్నందుకు రూ.2 లక్షల బిల్లు! - విచ్చల విడిగా జీహెచ్​ఎంసీ నిధులు స్వాహా

ఏడాదిన్నర కాలంలోనే సుమారు 2 వేల పనులకు రూ. 122 కోట్ల బిల్లులు - జీహెచ్​ఎంసీ పరిధిలో రూ. లక్షలోపు అత్యవసర పనులకు నామినేషన్​ పద్ధతి - రూ.10 లక్షలకూ ఇదే పద్ధతిలో అక్రమాలు

BILLS SCAM IN GHMC
BILLS SCAM IN GHMC (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : March 4, 2026 at 10:39 AM IST

3 Min Read
Choose ETV Bharat

Bills Scam In GHMC : రోజుకు రూ.2 వేలు చెల్లిస్తే వీధుల్లో తిరుగుతూ ప్రచారం చేసేందుకు ఆటో అద్దెకు లభిస్తుంది. దీనికోసం అధికారులు రూ.లక్ష బిల్లు పెట్టారు. దీనితో పాటు చెట్లకు సున్నం వేసినందుకు రూ.30 లక్షలు, దినపత్రికలకు రూ.8 లక్షలు, పది ప్లాస్టిక్​ కుర్చీలు కొనుగోలు చేసేందుకు రూ. 2 లక్షలు అంటూ బిల్లులు సిద్ధం చేశారు. కేవలం ఏడాదిన్నర కాలంలోనే సుమారు 2 వేల పనులకు రూ. 122 కోట్ల బిల్లులను రూపొందించారు. దీనికోసం నిధులు మంజూరు చేయాలని మున్సిపాలిటీ అధికారులు జీహెచ్​ఎంసీకి లేఖ రాసి పంపారు.

ఇష్టారీతిన ఖర్చు : నగర శివారులోని 27 పట్టణ స్థానిక సంస్థలు బల్దియాలో విలీనమయ్యాయి. నేడు వాటి బ్యాంకు ఖాతాలు జీహెచ్​ఎంసీ ఆధీనంలోనికి వచ్చాయి. జీహెచ్​ఎంసీ కమిషనర్​ అనుమతితోనే ఈ ఖర్చులను చేయాల్సిఉంటుంది. దీనికోసం సుమారు 2 వేల పనులకు సంబంధించిన వివరాలను బడంగ్​పేట కార్పొరేషన్​ అధికారులు జీహెచ్​ఎంసీకి పంపారు. జీహెచ్​ఎంసీ పరిధిలో అయితే రూ. లక్షలోపు అత్యవసర పనులను నామినేషన్​ పద్ధతిలో చేపడతారు. బడంగ్​పేట అధికారులు మాత్రం రూ. లక్ష నుంచి రూ.10 లక్షల పనులను కూడా టెండర్లు లేకుండానే చేపట్టారు. కాగితాలపై బిల్లులు రాసి, నేరుగా నిధులు చెల్లించే పద్ధతిలో పనులు చేపట్టడం మగనార్హం.

నిధుల స్వాహా? : వివిధ ఏజెన్సీల పేరుతో బడంగ్​పేట కార్పొరేషన్​ అధికారులు సంవత్సర కాలంలో తాగునీటికి రూ. 20 లక్షలకు పైగా ఖర్చు చేసినట్లు బిల్లులు పెట్టారు. గత సంవత్సరం దసరా సమయంలో సరూర్​నగర్​ స్టేడియంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు బడంగ్​పేట నుంచి 300 మంది మహిళలు హాజరయ్యారు. కాగా వీరిని తరలించేందుకు ఏకంగా రూ.5 లక్షలతో అద్దె బస్సులు తీసుకున్నామని బిల్లులు సమర్పించారు.

దసరా రోజున 16 వాహనాల పూజకు రూ.లక్ష, తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని నిర్వహించినందుకు రూ.2 లక్షలు, స్థానికంగా బతుకమ్మ సంబరాల నిర్వహణకు రూ. 4 లక్షలు, తెలంగాణ వజ్రోత్సవాలు నిర్వహించినందుకు రూ.60 లక్షలు, స్వచ్ఛ సర్వేక్షన్​ సర్వే ఏర్పాట్లకు రూ. 1.55 కోట్లు బిల్లులు పెట్టారు. వాహనాలకు జీపీఎస్​, స్పోర్ట్స్​మీట్​, మరుగుదొడ్లలో నల్లాలు, ఆఫీసులకు కంప్యూటర్లు, ప్రింటర్లు, కార్పొరేటర్లకు కప్పిన శాలువాలకు రూ. లక్ష, రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల జిరాక్సుకు రూ.లక్ష, 100 రోజుల పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిచేందుకు వాటిలో పాల్గొనే జేసీబీ, ట్రాక్టర్​కు రూ.5 లక్షలంటూ బిల్లులు పెట్టారు.

జనాభా 1.34 కోట్లు : పాత జీహెచ్​ఎంసీలో సముమారు కోటి మంది వరకూ జనాభా ఉండేవారు. అయితే ప్రస్తుత జీహెచ్​ఎంసీ పరిధి 1.34 కోట్ల మంది జనాభా ఉన్నారు. గతంలో జీహెచ్​ఎంసీ పరిధిలో 150 డివిజన్లు ఉండగా పునర్విభజనలో భాగంగా వీటి సంఖ్య 253కు పెరిగింది. పాత నగరంలో జనాభా అధికంగా ఉన్నందువల్ల డివిజన్ల సంఖ్య సుమారుగా రెట్టింపయినట్లుగా అధికారులు వివరిస్తున్నారు. గ్రేటర్​ పరిధిలో విలీనమైన 27 పట్టణ స్థానిక పరిధిలోని జనాభా అంతంత మాత్రమే. పాత గ్రేటర్ పరిధితో పోలిస్తే ఆయా స్థానిక సంస్థలు రెట్టింపు విస్తీర్ణంలో ఉన్నాయి. జనాభా మాత్రం 30 లక్షలు పెరిగారు. వాటి పరిధిలో 47 డివిజన్లు ఏర్పడ్డాయి.

గత సంవత్సరం డిసెంబరు 3న జీహెచ్​ఎంసీ 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 డివిజన్లతో అతిపెద్ద నగరపాలకు సంస్థగా ఆవిర్భవించింది. ప్రస్తుత జీహెచ్​ఎంసీని 70 లక్షల జనాభాతో కూడిన 6 జోన్లకు పరిమితం చేసి సగటున 35 లక్షల జనాభా ఉండేవిధంగా మల్కాజిగిరి, సైబరాబాద్ కార్పొరేషన్లను 3 జోన్లుగా ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం.

  • జీహెచ్​ఎంసీ కార్పొరేషన్​ : శంషాబాద్​, రాజేంద్రనగర్​, ఖైరతాబాద్​, సికింద్రాబాద్, గోల్కొండ, చార్మినార్​
  • మల్కాజిగిరి కార్పొరేషన్​ (ఎంఎంసీ) : మల్కాజిగిరి, ఉప్పల్​, ఎల్బీనగర్​
  • సైబరాబాద్​ కార్పొరేషన్ (సీఎంసీ) : కూకట్​పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్​

సివిల్ కాంట్రాక్టుల పేరుతో రూ.10కోట్లు మింగేశారు! - ఆధారాలతో సహా ఫిర్యాదు

జీహెచ్​ఎంసీ స్థానంలో కోర్​ అర్బన్ చట్టం​ - 99 రోజుల కార్యక్రమంలో ముందుగా మున్సిప‌ల్ ప‌రిధిలోని ప‌నులు