పచ్చని కొండల నడుమ రాకాసి మలుపులు - అమ్మో ఘాట్ రోడ్లు!
దడ పుట్టిస్తున్న పాత వాహనాలు - భారీ సరకు ప్రాణాలతో చెలగాటం - రోజూ వెంటాడుతున్న ప్రమాదాలు - మృత్యుకుహరాలుగా రాయలసీమలోని ప్రధాన ఘాట్ రోడ్లు

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 30, 2026 at 3:53 PM IST
Rayalaseema Ghat Roads Turn Death Traps : పాముల్లా మెలికెలు, ఎత్తూ పల్లాలతో దారులు, మలుపులు మృత్యు పిలుపులు, లోయలంచున నెత్తుటి మరకలు, కొండల నడుమ, బండల మాటున ప్రయాణం పట్టుతప్పితే ప్రాణాలే పణం పాలకుల కళ్లకి గంతలు, ప్రమాద చితి మంటలు! నిర్లక్ష్యానికి ఇంకెన్ని బలులు? కదిలేదెప్పుడు అధికార శిలారథాలు ఇవి మన ఘాట్ రోడ్లు దాటితే గండం గట్టెక్కినట్లే.
పచ్చని కొండల నడుమ రాకాసి మలుపులు నెత్తురు తాగుతున్నాయి. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల ఉదాసీనత వెరసి రాయలసీమలోని ప్రధాన ఘాట్ రోడ్లు మృత్యుకుహరాలుగా మారాయి. పది టన్నులు మోయాల్సిన చోట 100, 120 టన్నుల భారాన్ని వేసుకుని దూసుకొస్తున్న భారీ లారీలు సామాన్యుల పాలిట యమపాశాలవుతున్నాయి.
కడప-రాయచోటి మధ్య ఉన్న గువ్వల చెరువు (కోవూరు చెరువు) ఘాట్, మదనపల్లె నుంచి ఉత్తరాదికి వెళ్లే పాకలపాడు మార్గం, అనంతపురం-తిరుపతిని కలిపే భాకరాపేట ఘాట్ రోడ్లు నిత్యం ప్రమాదాలకు నిలయంగా మారాయి. కాగితాలకే పరిమితమైన సొరంగ మార్గాలు, నామమాత్రపు తనిఖీలతో బ్రేకులు ఫెయిలై వాహనాలు లోయల్లోకి, ఎదురుగా వచ్చే అమాయక శకటాల మీదికి దూసుకెళ్తున్నాయి. ఏమాత్రం అదుపు తప్పినా ప్రాణాలు గాల్లో కలవాల్సిందే. ఇంకెన్ని ప్రాణాలు బలైతే ప్రభుత్వాల్లో చలనం వస్తుంది? ఘాట్ రోడ్లపై ఈ నెత్తుటి మరకలు ఇంకెన్నాళ్లు? అని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు.
అత్యంత ప్రమాదకరం: కర్నూలు-రాణిపేట జాతీయ రహదారిలోని రాయచోటి-కడప మధ్య ఉన్న గువ్వల చెరువు వద్ద ఘాట్ రోడ్డు సుమారు 10 కిలోమీటర్ల మేర విస్తరించింది. చెన్నై, బెంగళూరు, కోయంబత్తూరు లాంటి ప్రధాన నగరాలకు లోడు వాహనాలన్నీ ఈ మార్గం గుండానే వెళ్తుంటాయి. కడప నుంచి వస్తున్నప్పుడు ఎదురయ్యే ‘నాలుగో మలుపు’ అత్యంత ప్రమాదకరంగా మారింది. ఇక్కడ భారీ వాహనాలు మలుపు తిరగలేక నేరుగా లోయలోకి పడిపోతున్నాయి.
ఈ ఒక్క మలుపు వద్దే ఏటా జరుగుతున్న ప్రమాదాల్లో 20 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ‘సొరంగ మార్గం’ ప్రతిపాదనను వైఎస్సార్సీపీ సర్కార్ పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం సొరంగ మార్గ నిర్మాణ ఆవశ్యకతను వివరిస్తూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా, వార్షిక ప్రణాళికలో రూ.920 కోట్లు కేటాయించారు. ఏడాది గడుస్తున్నా పనులు మాత్రం ఇంకా టెండర్ దశకు చేరుకోలేదు.
భాకరాపేట వద్ద డేంజర్ బెల్స్: తిరుపతి-అనంతపురం జాతీయ రహదారిలో రంగంపేట నుంచి భాకరాపేట వరకు 15 కిలోమీటర్ల మార్గం ఉండగా, ఇందులో 8 కిలోమీటర్లు పూర్తి ఘాట్ సెక్షన్. ఈ మార్గంలో రోజూ నాలుగు వేల నుంచి ఐదు వేల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇక్కడ ప్రధానంగా నాలుగు ప్రాంతాలు అత్యంత ప్రమాదకరంగా మారాయి. వేగ నియంత్రణ లేకపోవడం, కొత్త డ్రైవర్లకు అవగాహన లేకపోవడంతో ఆరు నెలల వ్యవధిలోనే ఇక్కడ 15 ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఇటీవల ఓ లారీ లోయలో పడిపోయిన ఘటనలో మహారాష్ట్రకు చెందిన డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. ఇక్కడ తనిఖీ కేంద్రాలు లేకపోవడం గమనార్హం.
భారీ శకటాలు: మదనపల్లె నుంచి రోజూ సుమారు 150 నుంచి 180 టమాట లారీలు పాకలపాడు మీదుగా ఉత్తరాదికి వెళ్తుంటాయి. వీటికి తోడు తమిళనాడు, కర్ణాటకకు వెళ్లే భారీ వాహనాలు, ముఖ్యంగా సిమెంట్ కంపెనీల లారీలు 120 నుంచి 140 టన్నుల బరువుతో రాత్రికి రాత్రే ఈ ఘాట్ రోడ్లపైకి వస్తున్నాయి. ఇంతటి భారీ బరువుతో వెళ్లే లారీలకు బ్రేక్ ఫెయిల్ అయితే డ్రైవర్లు అదుపు చేయలేని పరిస్థితి. నేరుగా వెళ్లి ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొట్టడమో లేదా లోయలో పడిపోవడమో జరుగుతోంది.

