ETV Bharat / state

రాజధాని అమరావతి ఓఆర్​ఆర్​ ప్రాజెక్టుకు భూసేకరణ- 4 జిల్లాల్లో గెజిట్‌

ఏలూరు, పల్నాడు జిల్లాల్లో అభ్యంతరాల స్వీకరణ- వచ్చేవారం నుంచి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ అభ్యంతరాల స్వీకరణ మొదలు- తర్వాత పెగ్‌ మార్కింగ్‌- ఎన్టీఆర్‌ జిల్లాలో భూముల వివరాలు కేంద్రానికి పంపనున్న అధికారులు

Gazette Issued in Four Districts For ORR Land Acquisition
Representative image of ORR Land Acquisition (Eenadu)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : December 25, 2025 at 7:22 AM IST

3 Min Read
Choose ETV Bharat

Gazette Issued in Four Districts For ORR Land Acquisition : అమరావతి ఔటర్‌ రింగ్‌రోడ్‌ (ఓఆర్‌ఆర్‌) ప్రాజెక్టు కోసం భూసేకరణకు రంగం సిద్ధమైంది. కేంద్రం ఇప్పటివరకు నాలుగు జిల్లాలకు (గుంటూరు, పల్నాడు, కృష్ణా, ఏలూరు) గెజిట్‌ ప్రచురించింది. ఎన్టీఆర్‌ జిల్లా వివరాలను ఇక్కడి అధికారులు వచ్చే వారం కేంద్రానికి పంపిన తర్వాత దానికీ గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇస్తుంది. ఇప్పటికే గెజిట్‌ ప్రచురణ జరిగిన జిల్లాల్లోని సంయుక్త కలెక్టర్లు రైతుల నుంచి అభ్యంతరాల స్వీకరణ చేపట్టారు. ఓఆర్‌ఆర్‌ ప్రాజెక్టు డీపీఆర్‌ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించేలోపు భూసేకరణను కొలిక్కి తెచ్చేలా రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

97 గ్రామాల్లో భూసేకరణ : ఎన్టీఆర్, ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల మీదుగా 189.90 కి.మీ. మేర ఓఆర్‌ఆర్‌ నిర్మించనున్నారు. దీనితోపాటు ఓఆర్‌ఆర్‌లో తెనాలి సమీపంలోని నందివెలుగు నుంచి చెన్నై-కోల్‌కతా హైవేలో కాజ వరకు 17.5 కి.మీ. మేర ఆరు వరుసలతో లింక్‌ (స్పర్‌) రోడ్‌ నిర్మిస్తారు. ఓఆర్‌ఆర్‌లో నారాకోడూరు నుంచి గుంటూరు శివారులోని బుడంపాడు వరకు 5.5 కి.మీ. మేర నాలుగు వరుసలతో మరో లింక్‌రోడ్‌ నిర్మిస్తారు. వీటితో కలిపి మొత్తం 212.60 కి.మీ. ప్రాజెక్టు అవుతోంది. ఓఆర్‌ఆర్‌ కోసం 140 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేస్తున్నారు. ఇందులో ఆరు వరుసల ఓఆర్‌ఆర్, ఇరువైపులా చెరో రెండు వరుసలతో సర్వీస్‌ రోడ్లు నిర్మిస్తున్నారు. మొత్తంగా ఈ ప్రాజెక్టు కోసం ఐదు జిల్లాల్లోని 23 మండలాల పరిధిలో 97 గ్రామాల్లో భూసేకరణ చేయాల్సి ఉంది.

ఆ జిల్లాల్లో అభ్యంతరాల స్వీకరణ : ఇప్పటివరకు కేంద్రం పల్నాడు, ఏలూరు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భూసేకరణకు గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్రచురించింది. ఎన్టీఆర్‌ జిల్లాల భూముల వివరాలను ఇక్కడి రెవెన్యూ అధికారులు రెండు రోజుల క్రితం జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)కి అందజేశారు. వాళ్లు వచ్చేవారం ఆ వివరాలను ఎన్‌హెచ్‌ఏఐ ఉన్నతాధికారులకు పంపాక ఎన్టీఆర్‌ జిల్లా భూసేకరణ గెజిట్‌ నోటిఫికేషన్‌నూ కేంద్రం ప్రచురించనుంది. ఇప్పటికే కేంద్రం గెజిట్‌ ప్రచురించిన జిల్లాల్లోని పల్నాడు జిల్లా సంయుక్త కలెక్టర్‌ పత్రికా ప్రకటన జారీచేసి, ఆయా సర్వే నంబర్లలో భూ యజమానుల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు.

ఏలూరు జిల్లాలో అభ్యంతరాల స్వీకరణ జరుగుతోంది. కృష్ణా, గుంటూరు జిల్లాల సంయుక్త కలెక్టర్లు వచ్చే వారం పత్రికా ప్రకటన జారీచేసి.. తర్వాత 21 రోజులపాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు. కొన్నిచోట్ల 140 మీటర్ల కంటే ఎక్కువ వెడల్పుతో గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేశారు. ఎలైన్‌మెంట్‌ ప్రకారం కొన్ని సర్వే నంబర్లలో పూర్తి భూమి, మరికొన్నింట్లో కొంత భూమినే సేకరించాలి. అయినా ఆ సర్వే నంబర్లన్నింటినీ గెజిట్‌లో పేర్కొంటున్నారు.

క్షేత్రస్థాయి సర్వే తర్వాత అసలైన విస్తీర్ణం : సంయుక్త కలెక్టర్లు రైతులు, ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలు పరిశీలించి, వారికి లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చాక క్షేత్రస్థాయిలో పెగ్‌ మార్కింగ్‌కు ఆదేశిస్తారు. ఇందులోభాగంగా కొలతలు వేసి, సర్వే చేస్తారు. కేంద్రం ఆమోదించిన ఎలైన్‌మెంట్‌ ప్రకారం జీపీఎస్‌ కోఆర్డినేట్స్‌ ద్వారా 140 మీటర్ల వెడల్పులోని సరిగ్గా మధ్య పాయింట్‌ నుంచి ఇరువైపులా 70 మీటర్లతో పెగ్‌ మార్కింగ్‌ వేసుకుంటూ వెళ్తారు. అప్పుడు ఏ సర్వే నంబరులో ఎంత భూమి సేకరించాలి? అది మెట్టా? మాగాణా? అందులో చెట్లు, భవననిర్మాణాల లాంటివి ఏమైనా ఉన్నాయా? వంటివన్నీ తెలుస్తాయి.

ఆ వివరాలు, సర్వే నంబర్లతో సహా రెవెన్యూ, సర్వే అధికారులు ల్యాండ్‌ ప్లాన్‌ షెడ్యూల్‌ రూపొందించి, సంయుక్త కలెక్టర్‌కు అందజేస్తారు. ఆ తర్వాత జేసీలు భూమిరాశి పోర్టల్‌లో వాటిని అప్‌లోడ్‌ చేస్తారు. వీటిని పరిశీలించి ఖరారు చేస్తూ కేంద్రం 3డి నోటిఫికేషన్‌ జారీచేస్తుంది. కేంద్ర మంత్రివర్గం ఓఆర్‌ఆర్‌ ప్రాజెక్టుకు ఆమోదం తెలుపుతూ, అధికారిక ఉత్తర్వు జారీచేసిన తర్వాత 3డి నోటిఫికేషన్‌ జారీ అవుతుంది. అనంతరం ఆయా భూములకు డాక్యుమెంట్లు, ఆధారాలను చూపించి, యజమానులు, రైతులు నిరూపించుకోవాలి. తర్వాత సర్వే నంబర్లు, వాటిలో భూ విస్తీర్ణం ఆధారంగా ఎంత చెల్లిస్తారనేది పేర్కొంటూ అవార్డు పాస్‌ చేస్తారు.

అమరావతి లైన్‌ కోసం మరో 300 ఎకరాలు - భూసేకరణకు గ్రీన్​సిగ్నల్​

క్వాంటమ్‌ వ్యాలీగా అమరావతి - లక్ష మంది నిపుణుల తయారీ లక్ష్యం: చంద్రబాబు