ఓఎన్జీసీ డ్రిల్ సైట్‌లో గ్యాస్ లీక్ - ఎగసిపడుతున్న మంటలు
గ్యాస్ లీక్‌తో వంద అడుగులకుపైగా ఎగసిపడుతున్న మంటలు - ఘటనాస్థలిని పరిశీలించిన తహసీల్దార్ శ్రీనివాసరావు - ఇరుసుమండ ప్రజలను అప్రమత్తం చేసిన రెవెన్యూ అధికారులు

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 5, 2026 at 2:58 PM IST
|Updated : January 5, 2026 at 6:19 PM IST
ONGC Blowout at Malikapuram of Konaseema District: డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసు మండలం ఓఎన్జీసి వర్క్ ఓవర్ రిగ్ సైట్‌లో గ్యాస్ లీకైంది. సుమారు సుమారు 100 అడుగులకు పైగా మంటలు ఎగసిపడుతున్నాయి మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో ఇక్కడ గ్యాస్ లీక్ అయింది. స్థానికులు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారు ఓఎన్జీసీ అధికారులకు తెలియజేశారు. ఓఎన్జీసి అధికారులు అక్కడకు చేరుకుని గ్యాస్ లీకేజిని అరికడతారని తహసీల్దారు శ్రీనివాసరావు వెల్లడించారు.
రెవెన్యూ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ సంఘటనతో కోనసీమ ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఘటనాస్ధలంలో పరిస్థితులను కలెక్టర్ హరీష్ మాథూర్, ఎమ్మెల్యే దేవవరప్రసాద్, కలెక్టర్ మహేష్, ఎస్పీ రాహుల్ మీనా, అధికారులు ఇక్కడ ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. చుట్టుపక్కల 5 కి.మీ పరిధిలోని ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు. మంటల ధాటికి సుమారు 500 కొబ్బరి చెట్లు కాలిపోయాయి.
ఓఎన్జీసీలో బ్లో అవుట్‌కు సంబంధించి మంటలు ఎగసిపడుతున్నాయి. సాయంత్రం 6 గంటల వరకు ఎలాంటి నియంత్రణ చేపట్టలేదు. రేపు మంటలను ఆపే చర్యలు చేపడతారని చెబుతున్నారు. ప్రధానంగా అగ్నికీలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. చుట్టుపక్కల వందలాది కొబ్బరి చెట్లు బుగ్గి పాలయ్యాయి. ఆ సమయంలో రిగ్గు వద్ద ఉన్న ఓఎన్జీసి సిబ్బంది పరుగులు తీశారు. వరి చేలు దెబ్బతింటున్నాయి. ఇరుసుమండ గ్రామాన్ని అధికారులు ఖాళీ చేయించారు. సంఘటన జరిగిన సమయంలో సమీపంలో ఉన్న వ్యవసాయ కూలీలు హడలిపోయి పరుగులు తీశారు. స్థానికంగా ఉన్న వంట కాలువ నుంచి నీరు తీసుకుని ఫైర్ ఇంజన్ల ద్వారా ఫైర్ ఫైటింగ్ సిబ్బంది మంటలను అదుపులో తెస్తారని అంటున్నారు. ఏమైనా ఈ సంఘటన కోనసీమ వాసులను తీవ్ర కలవరాన్ని గురి చేసింది.
మరో 24 గంటలు! : మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది, ఓఎన్‌జీసీ ఫైర్ ఫైటింగ్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారని కలెక్టర్ మహేశ్‌కుమార్ తెలిపారు. మంటలు అదుపులోకి వస్తాయో లేదో తెలియాలంటే 24 గంటలు ఆగాల్సి ఉందన్నారు. ఇప్పటివరకు ఎలాంటి నష్టం జరగలేదని చెప్పారు. అధికారులు, ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓఎన్‌జీసీకి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు.
మోరీ-5 ఆయిల్ వెల్‌కు, గెయిల్ పైప్‌లైన్‌కు సంబంధం లేదని చెప్పారు. మోరీ-5 అనేది ప్రత్యేకమైన బావి. మోరీ-5లో ఎంత సహజ వాయువు ఉందో అంచనా వేస్తున్నారు. మోరీ-5లో 20 నుంచి 40 క్యూబిక్ మీటర్ల నిల్వలు ఉండవచ్చని అంచనా. పరిసర గ్రామాల పాఠశాలల్లోని విద్యార్థులను ఖాళీ చేయించామన్నారు.
గ్యాస్ లీక్‌పై సీఎం చంద్రబాబు ఆరా: ఓఎన్జీసీ మోరీ -5 వెల్‌లో మంటలు చెలరేగిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. మంత్రులు అచ్చెన్నాయుడు, సుభాష్, అధికారులతో సీఎం మాట్లాడారు. గ్యాస్ లీక్‌పై స్థానిక అధికారులతో మాట్లాడినట్లు సీఎంకు మంత్రులు తెలిపారు. మంత్రులకు చెప్పారు. సహాయ చర్యలు ముమ్మరం చేయాలని చెప్పామని మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. గ్రామస్థులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని సీఎం ఆదేశించారు.
ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం చెప్పారు. మంటలను అదుపు చేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా అధికారులు, ఓఎన్జీసీ ప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలని మంత్రులకు, అధికారులకు సీఎం సూచించారు. పరిస్థితిపై ఎప్పటికప్పుడు తనకు సమాచారం అందించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.
ప్రజలకు మాస్కులు పంపిణీ: రాజోలు నియోజకవర్గంలోని మలికిపురం మండలంలో ఓఎన్‌జీసీ డ్రిల్ సైట్ నుంచి లీకైన గ్యాస్ ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా తీశారు. కోనసీమ జిల్లా కలెక్టర్, ఎస్పీతో మంత్రి ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
స్థానికులకు సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలించాలని మంత్రి స్పష్టం చేశారు. తక్షణమే ఓఎన్‌జీసీ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి సాంకేతిక నిపుణులచే మంటలను అదుపులోకి తెచ్చేలా చూడాలని అన్నారు. స్థానికులు గ్యాస్ పీల్చకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులు పంపిణీ చేయాలని అధికారులకు సూచించారు.
చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించే అవకాశం లేదు: మంటలు ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకుంటారని హెచ్‌పీసీఎల్ మాజీ డైరెక్టర్ ఎన్‌వీ చౌదరి తెలిపారు. గ్యాస్ ఎక్కణ్నుంచి వస్తుందో చూసి ఆపేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఇలాంటి ప్రమాదాలకు చాలా కారణాలు ఉంటాయని అన్నారు. గ్యాస్ ఎంత ఉంది ప్రెజర్ ఎంత ఉందనే దానిపై అంచనాకు వస్తారు. గ్యాస్ వెల్ ఎలా స్పందిస్తుందో అంచనా వేయడం కష్టమని పేర్కొన్నారు. ఘటనాస్థలం చూశాక ఏం చేయాలో ఓఎన్‌జీసీ నిపుణులు అంచనాకు వస్తారని చెప్పారు. గ్యాస్, మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించే అవకాశం లేదని చెప్పారు.
ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 800 టన్నుల స్టైరీన్ గ్యాస్ లీక్! - పరిశోధన సంస్థల నివేదిక

