ఆ బంధం వద్దన్నందుకు మహిళను చంపేసిన గ్యాస్ డెలివరీ బాయ్ - ఆపై తానూ
వివాహేతర సంబంధాన్ని నిరాకరించిందని మహిళను హత్య చేసిన గ్యాస్ డెలివరీ బాయ్ - నమ్మించి మోసం చేసి గొంతు కోసి హత్య - ఫ్యాన్‌కు ఉరి వేసుకుని సోమశేఖర్ మృతి

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 6, 2026 at 1:36 PM IST
Gas Delivery Boy Kills Woman : ఏడడుగుల బంధం ప్రస్తుతం దినదిన గండంగా మారుతోంది. పెద్దల సమక్షంలో వేద మంత్రాల సాక్షిగా వివాహాలు చేసుకున్న కొందరు అతివలు అయితే, వివాహేతర సంబంధాలు పెట్టుకొని జీవితాలను, ప్రాణాలను పోగొట్టుకుంటున్న వారు మరికొందరు. భర్తను తొలగించడానికి కొందరైతే వెనకాడడం లేదు. డబ్బులు ఇచ్చి మరీ సుపారీ హత్యలు చేయిస్తున్నారు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలవుతున్నారు. అయితే ఈ స్టోరీ దీనికి భిన్నం.
తిరుపతిలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధాన్ని నిరాకరించిందని ఏకంగా మహిళను హత్య చేశాడు ఓ వ్యక్తి. అంతేకాకుండా తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తిరుపతిలోని కొర్లగుంట మారుతీనగర్‌లో ఈ ఘటన జరిగింది.
భార్యతో విడిపోయి : తిరుపతి తూర్పు సీఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం, రేణిగుంట మండలం గుత్తివారిపల్లికి చెందిన సోమశేఖర్ అనే వ్యక్తి తిరుపతిలో గ్యాస్ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. అయితే గతంలో అతనికి వివాహం జరిగింది. భార్యతో విడిపోయి కొర్లగుంటలోని మారుతీనగర్‌లో ఒంటరిగా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే తెలంగాణలో ఖమ్మం జిల్లాకు చెందిన లక్ష్మి కొంతకాలం క్రితం తిరుపతిలోని జీవకోనకు వచ్చారు. అయితే ఆమె భర్త, కుమారుడితో కలిసి అక్కడ నివాసముంటోంది. ఆమె ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఓ సమోసా దుకాణంలో పని చేస్తోంది.
నమ్మించి మోసం చేసి : గ్యాస్ డెలివరీ నిమిత్తం ఆ దుకాణం దగ్గరకు వెళ్లే సోమశేఖర్‌తో లక్ష్మికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. అయితే లక్ష్మీకి అది నచ్చక, ఇటీవల ఈ బంధాన్ని ఆమె నిరాకరించింది. దీంతో ఒక్కసారి చివరిగా మాట్లాడదామని ఆమెను నమ్మించి సోమవారం సోమశేఖర్ ఉండే గదికి లక్ష్మీని పిలిపించుకున్నాడు. అక్కడికి వచ్చిన తర్వాత లక్ష్మీపై విచక్షణారహితంగా చాకుతో దాడి చేశాడు. అనంతరం లక్ష్మి గొంతు కోసి హతమార్చాడు. ఆ తర్వాత ఫ్యాన్‌కు ఉరి వేసుకుని సోమశేఖర్ ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
"రేణిగుంటకు చెందిన సోమశేఖర్ తిరుపతిలో గ్యాస్ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. గతంలో అతనికి వివాహం అయ్యింది. భార్యతో విడిపోయి కొర్లగుంటలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలోనే లక్ష్మి అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దానిని లక్ష్మీ నిరాకరించింది. చివరిగా మాట్లాడదామని ఆమెను నమ్మించి సోమవారం సోమశేఖర్ ఉండే గదికి లక్ష్మీని పిలిపించుకున్నాడు. అక్కడికి వచ్చిన లక్ష్మీపై చాకుతో దాడి చేసి హతమార్చాడు." - శ్రీనివాసులు, సీఐ, తిరుపతి తూర్పు
AP IAS Officer Wife Suspicious Death At Vijayawada : అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఐఏఎస్ అధికారి భార్య చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి హఠాత్తుగా మృతి చెందారు. దీనిపై ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు మెడికో లీగల్ కేసు సమాచారం ఇవ్వడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఐఏఎస్ అధికారి జి.కె. కిషోర్ కుమార్ ఏపీ మిషన్ ఫర్ క్లీన్ కృష్ణా, గోదావరి కెనాల్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం విజయవాడ మొగల్రాజపురంలో భార్య సత్య దీపిక (42), ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
'మా ఆరోగ్యం మా చేతుల్లోనే' - అరుదైన వంగడాలతో ప్రకృతి వ్యవసాయం

