హైదరాబాద్‌లో కొత్త రకం దొంగల హల్చల్ - అటెన్షన్ డైవర్షన్ ముఠాలతో జాగ్రత్త
నగరంలో దొంగతనాలకు పాల్పడుతూ హల్చల్ చేస్తున్న ముఠాలు - రద్దీ ప్రాంతాల్లో అమాయకులను మోసగించిన ఘటనలపై కేసులు నమోదు - అటెన్షన్ డైవర్షన్ తరహాల్లో మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాలు

Published : January 8, 2026 at 11:30 AM IST
Theft and Scams in Hyderabad : నగరంలో ఈ మధ్యకాలంలో దృష్టి మరల్చి దొంగతనాలు, మోసాలకు పాల్పడుతున్న ముఠాలు హల్చల్ చేస్తున్నాయి. మాదాపూర్, మొయినాబాద్, మియాపూర్, ఎస్సార్‌నగర్, కూకట్పల్లి, నాంపల్లి, టోలిచౌకి, గోషామహల్, చాంద్రాయణగుట్ట, పారామౌంట్ కాలనీల్లో ఇటీవల అంతర్రాష్ట్ర దొంగలు ఏటీఎం కేంద్రాలు, రద్దీ ప్రాంతాల్లో అమాయకులను మోసగించిన ఘటనలపై కేసులు నమోదయ్యాయి. సీసీ ఫుటేజీ ఆధారంగా యూపీ, హరియాణాకు చెందిన పది మంది నిందితులను అరెస్ట్ చేశాను. మరికొందరు అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. ఇటీవల నగరానికి చెందిన దొంగలు, అంతర్రాష్ట్ర ముఠాలు భిన్న తరహాల్లో అటెన్షన్ డైవర్షన్‌కు పాల్పడుతున్నట్టు గుర్తించారు.
కళ్లు మూసి తెరిసేలోపు ఫోన్ పోయే :
- రద్దీగా ఉండే ప్రాంతాలు, సిటీ బస్సులు, మెట్రో, ట్రాఫిక్ కూడళ్లు, ఎంఎంటీఎస్ రైళ్లు, నిర్మానుష ప్రదేశాలు, ఏటీఎం కేంద్రాలు, బ్యాంకుల్లో దృష్టి మరల్చి చేసే చోట్లనే వారు అడ్డలుగా ఎంచుకుంటారు.
- డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు ఏటీఎం సెంటర్లకు వచ్చే మహిళలు, వృద్ధులు, నిరక్షరాస్యులను లక్ష్యంగా చేసుకుంటారు.
- బంగారం, సెల్‌ఫోన్ దుకాణాల్లో కొనుగోలుదారులుగా చేరతారు. దుకాణ నిర్వాహకులు ఏమరపాటుగా ఉన్న సమయంలో వస్తువులు కొట్టేస్తారు.
- మహిళలు ఆభరణాలతో వెళ్తునప్పుడు, వృద్ధులకు మస్కా కొడతారు. ఆ ప్రాంతంలో దొంగలున్నారని నగలు కర్చీఫ్, కాగితంలో భద్రపరచుకోవాలని సూచిస్తూ తమ వద్ద ఉన్న పొట్లం వారి చేతికిస్తారు. నగలున్న ప్యాకెట్‌ను తీసుకుపోతారు.
- విదేశీ నగదు, బంగారం, క్రిప్టో తక్కువ ధరకిస్తామని రప్పించి డబ్బు చేతికి రాగానే కాగితాలు, రాళ్లు ఉంచిన కవర్లు చేతికిచ్చి మాయమవుతారు.
''బ్యాంకులు, ఏటీఎం సెంటర్ వద్ద తెలియని వారితో కాస్త జాగ్రత్తగా ఉండండి. సాయం చేస్తామనగానే డెబిట్ కార్డులు ఇవ్వొద్దు. నగదు ఉపసంహరణకు కుటుంబసభ్యులు, స్నేహితుల సాయం తీసుకోండి. ట్రాఫిక్ కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో మీ వస్త్రాలపై మరకలున్నాయని, వాహనం టైర్లలో గాలి పోయిందని దృష్టి మరల్చేందుకు దొంగలు యత్నిస్తుంటారు. అనుమానాస్పద వ్యక్తులను గుర్తించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారమివ్వండి.'' - చంద్రమోహన్, డీసీపీ, సౌత్‌వెస్ట్ జోన్
రద్దీ ప్రాంతంలో ఎక్కువగా : నగరంలో ఎక్కువగా రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ తరహా దొంగతనాలు జరుగుతుంటాయి. ఇలాంటి అనుభవాలు ఇక్కడ నిత్యకృత్యం. స్నాచింగ్ ముఠాలు పదుల సంఖ్యలో వస్తువులను తస్కరిస్తుండటంతో బాధితులు లబోదిబోమంటున్నారు. అత్యధికంగా బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, సినిమా హాళ్లు లాంటి రద్దీ ప్రాంతాల్లోనే దొంగతనాలను పాల్పడుతుంటారు. కొన్ని సందర్భాల్లో దొంగలు ప్రయాణికుల్లా బస్సుల్లో ఎక్కుతూ నగదు, బంగారం కొట్టేసి వెంటనే దిగిపోతున్నారు. అయితే వీరంతా దందాలో చిన్న చేపలు మాత్రమే. వీరి వెనకుండి నడిపిస్తున్న ముఠాలు చాలానే ఉన్నాయి. మరికొన్ని సందర్భాల్లో దొంగలకు ముందే డబ్బులిచ్చి మరీ చోరీలు చేయిస్తున్నారు.
బస్టాప్‌లు, మెట్రో స్టేషన్ల వద్ద పాగా వేసే ముఠాలపై నిఘా ఉంచాం. సిటీ బస్సుల్లో ప్రయాణికుల మధ్య చేరి వస్తువులు కొట్టేస్తున్న దొంగల ఆటలు కట్టిస్తున్నాం. 4-5 మంది మహిళలు, పురుషులు ముఠాగా ఏర్పాడి బస్సుల్లో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించాం. క్రైం టీమ్‌ల ద్వారా దొంగలు, అనుమానితులను గుర్తించి అరెస్ట్ చేస్తున్నాం. - శిల్పవల్లి, డీసీపీ, మధ్యమండలం
మహిళల అప్రమత్తత ముఖ్యం : మహిళలు ఆభరణాలు ధరించి ఒంటరిగా బయటకు వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎప్పుడైనా ఇటువంటి పరిస్థితి ఎదురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఇటీవల ఇటువంటి నేరాలు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. ఇదే సమయంలో నేరస్థులు ఎంత జాగ్రత్తపడినా, ఏదో ఒక రోజు దొరికిపోతారని, కఠిన శిక్షలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
ప్రత్యేక స్టైల్‌ను అనుసరించి చైన్ స్నాచింగ్ - పోలీసులకు చిక్కిన దొంగల ముఠా
మీ మొబైల్ దొంగతనం జరిగిందా? - ఈ ట్రిక్స్ ఫాలో కాకుంటే ఖాతా ఖాళీ!

