ETV Bharat / state

మ్యారేజ్‌ బ్యూరో నుంచి పిల్లల కిడ్నాప్‌ వరకు - పసికందుల అపహరణ కేసులో వెలుగులోకి కీలక విషయాలు

కృష్ణా జిల్లాలో పసికందుల అపహరణ వెనుక కీలక విషయాలు - ముఠా సభ్యులంతా చిత్తుకాగితాలు ఏరుకోవడం, కూలీపనులు చేసుకుంటూ జీవనం - చివరికి పిల్లలను ఎత్తుకెళ్లి విక్రయించే స్థాయికి ఎదిగిన వైనం

Child Trafficking Racket in Andhra Pradesh
Child Trafficking Racket in Andhra Pradesh (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 24, 2026 at 1:51 PM IST

2 Min Read
Choose ETV Bharat

Child Trafficking Racket in Andhra Pradesh : మ్యారేజ్‌ బ్యూరోలో ఓ పెళ్లిసంబంధం విషయంలో పరిచయమైన కొంతమంది, ఏకంగా పిల్లలను కిడ్నాప్‌ చేసే ముఠాగా ఏర్పడ్డారు. కృష్ణా జిల్లాలో వెలుగు చూసిన పసికందుల అపహరణ కేసులో పలు కీలక విషయాలు బయటకొచ్చాయి. ముఠా సభ్యులు విజయవాడ సింగ్‌నగర్‌ పరిసర ప్రాంతాల్లో కూలీపనులు చేసుకుంటు, చిత్తుకాగితాలు ఏరుకోవడం మొదలు పిల్లలను ఎత్తుకెళ్లి విక్రయించే స్థాయికి ఎదిగారు. ఈ విధంగా సులభంగా డబ్బు సంపాదించేందుకు అడ్డదారికి అలవాటుపడ్డారు.

ఓ దంపతులకు పిల్లలు లేరనీ, మీకు తెలిసిన వారికి పిల్లలుండి, వారు పోషించే శక్తిలేని వారైతే అలాంటి వారి పిల్లను దత్తత తీసుకుంటారని ఓ మ్యారేజ్‌బ్యూరో నుంచి వీరికి సమాచారం వచ్చింది. అనంతరం వీరికి తెలిసిన యాచకుల పసికందును ఆ దంపతులకు ఇచ్చి, వారి నుంచి డబ్బులు తీసుకొని దందాలకు అలవడ్డారు. ఇలా పేదలు, సంచారజాతులు, యాచకులు, అలాగే పిల్లలుండి పోషించే శక్తిలేని వారికి కొంత డబ్బులు ఇచ్చి వారి పిల్లలను పలుప్రాంతాల్లో విక్రయించారు. వచ్చిన సొమ్మును వాటాలుగా పంచుకునే వారు. ఇలా ముఠాగా ఏర్పడి దందాలు చేయడమే వీరి ప్రధాన వృత్తిగా మార్చుకున్నారు.

10 నెలల బాలుడిని ఎత్తుకెళ్లారు : అదేవిధంగా ఫలానా దంపతులకు పిల్లలు లేరని, వారు దత్తత కోసం చూస్తున్నారని ఓ మ్యారేజ్‌ బ్యూరో, అలాగే మరికొందరు మధ్యవర్తుల ద్వారా ఈ ముఠా సభ్యులకు బేరాలు వస్తున్నాయి. ఇలా వచ్చిన బేరాలతోనే ఒడిశా నుంచి కూలీపనులకు వచ్చిన మహిళ దుర్గగుడికి రాగా మాయమాటలు చెప్పి ఆమె పొత్తిళ్లలో 16 నెలల బాలుడిని, ఆటోనగర్‌లో భిక్షాటన చేసే సుమమ్మ అనే మహిళ ఒడిలోని 10 నెలల బాలుడిని ఎత్తుకెళ్లారు.

నిరు నిరుపేదలకు డబ్బు ఆశచూపి : అనంతరం తమ పిల్లలే అని మచిలీపట్నం, విజయవాడ వన్‌టౌన్​లో దంపతులకు విక్రయించారు. అదేవిధంగా కొందరు నిరుపేదలకు డబ్బు ఆశచూపి పిల్లలను తీసుకెళ్లి ఇతర ప్రాంతాల్లోనూ విక్రయించారు. మరో ముగ్గురు పసికందుల ఆచూకీని పోలీసులు గుర్తించినట్టు సమాచారం. ఈ ముఠా సభ్యులకు బేరాలు తెస్తున్న మధ్యవర్తులు పోలీసులకు దొరికినట్టు తెలిసింది. ఈ కేసులో ఒడిశా మహిళ కుమారుడిని పోలీసులు రక్షించారు. అలాగే పిల్లాడిని వెతుక్కుంటూ బెంగళూరు వెళ్లిన తల్లికి పోలీసులు సమాచారమిచ్చారు.

ఇతర గ్యాంగులతోనూ లింకులు : ఈ ముఠాలో ప్రధాన సూత్రధారి అయిన మహిళ సూర్యాపేటలోనూ కన్నవారి వద్ద ఓ పసికందును కొని వేరే దంపతులకు విక్రయించడంతో కేసు నమోదైంది. ఈమెతోపాటు మిగిలిన కీలక సభ్యులపైనా పలు ప్రాంతాల్లో అక్రమంగా పిల్లల విక్రయాలు, అపహరణ కేసులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ముఠాలో ఇప్పటికే పోలీసులు ముగ్గురు మహిళలను అరెస్టు చేశారు. ప్రధాన నిందితురాలు, మరికొందరు మహిళలు, నలుగురు పురుషులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు సమాచారం. ఈ ముఠాతో సంబంధమున్న మరికొందరు కీలక సభ్యులు బయట తిరుగుతున్నారు. అలాగే ఉత్తరాది, సరోజినీ ఇతర గ్యాంగులతోనూ వీరికి లింకులు ఉన్నట్లు సమాచారం.

పిల్లల విక్రయాల కేసు - తప్పించుకు తిరుగుతున్న కీలక నిందితురాలు ప్రియాంక

'బలగం' సరోజిని మాయ, పసికందుల బేరసారం - అమ్మ పిలుపు కోసం తపించిన దంపతులకు శోకం