'పుష్పరాజ్'నే మించిపోతున్నారు - అన్న తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!
వ్యాన్‌లో అమర్చిన అరల్లో దాచి మహారాష్ట్ర నుంచి మద్యం తరలింపు - ఖాళీ వ్యాన్లోనే సుమారు రూ.7 లక్షల విలువైన అక్రమ మద్యం స్వాధీనం - జగిత్యాల జిల్లా గంభీర్‌పూర్‌కి తరలిస్తున్నట్లు గుర్తింపు

Published : August 27, 2026 at 7:36 PM IST
Illegal Liquor Transportation : అనుమతి లేని అక్రమ మద్యం రవాణా అచ్చం పుష్ప సినిమాను తలపించేలా చేసింది. తక్కువ మొత్తంలో ఇతర రాష్ట్రాల్లో మద్యాన్ని కొనుగోలు చేసి, ఎక్కువ మొత్తంలో తెలంగాణలో విక్రయించేందుకు మద్యం స్మగ్లర్స్ రవాణా చేసిన తీరును చూసి ఎక్సైజ్ అధికారులు నోరెళ్లబెట్టారు. అక్రమ మద్యం తరలిస్తున్న వ్యాను షెటర్ తీయగానే లోపల అంతా ఖాళీగానే దర్శనం ఇస్తుంది. కానీ ఈ ఖాళీ వ్యాన్లోనే సుమారు రూ.7 లక్షల విలువైన అక్రమ మద్యాన్ని తరలిస్తూ ఎక్సైజ్ అధికారులకు దొరికిపోయిన సంఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే,
వ్యాన్ తనిఖీ చేసి అధికారులు షాక్ : జగిత్యాల జిల్లాలోని మెట్‌పల్లి ఎక్సైజ్ అధికారులకు వచ్చిన సమాచారం మేరకు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ తిరుపతి ఆధ్వర్యంలో మెట్‌పల్లి ఎక్సైజ్ వినోద్ రాఠోడ్ తన సిబ్బందితో కలిసి కథలాపూర్ మండలం తండ్రియాల వద్ద కాపు కాచి వ్యానును పట్టుకున్నారు. అధికారులు వ్యాన్ తనిఖీ చేసినా ఒక్క మద్యం బాటిల్ కూడా కనిపించలేదు. అధికారులకు వచ్చిన సమాచారం మేరకు వ్యాను లోపల క్షుణ్నంగా పరిశీలించి, పైన కింద భాగంలో ప్రత్యేకంగా విడివిడిగా బాక్సులను ఏర్పాటు చేసుకొని మద్యం బాటిళ్లను ఉంచినట్లు గుర్తించారు. వెంటనే బాక్సులను విప్పి బాక్సుల లోపల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
అక్రమంగా మద్యం తరలింపు : మహారాష్ట్రలోని దాద్రా, హవేలీ, డయ్యూడామన్ ప్రాంతాల నుంచి తక్కువ మొత్తంలో ఉన్న మద్యాన్ని కొనుగోలు చేసి జగిత్యాల జిల్లా గంభీర్‌పూర్‌లోనికి తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వాహనానికి ఏర్పాటు చేసిన నట్లను విప్పి లోపల పొందుపరిచిన అక్రమ మద్యాన్ని బయటకు తీసి కేసు నమోదు చేశారు. అక్రమ మద్యంతో పాటు వ్యాను, వారి వద్ద ఉన్న సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. అక్రమ మద్యంలో ప్రమాదకరమైన రసాయనాలు కలిసే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు అక్రమ మద్యాన్ని కొనుగోలు చేయవద్దని సూచించారు.
వ్యానులో 70 బాక్సుల ఐబీ లిక్కర్ దొరికింది. అందులో 25 బాక్సులు ఫుల్ బాటిళ్లు, 20 బాక్సులు 750ఎంఎల్, 45 బాక్సులు 180ఎంఎల్ సీజ్ చేయడం జరిగింది. వీటి విలువ రూ.6,38,400 ఉంటుంది. అక్కడ 2,85,600కే ఇది దొరుకుతుంది. అంటే దాదాపుగా రూ.3 నుంచి రూ.4,00,000 లాభం ఉంటుంది. అందుకోసం సుమారు 1,000 కిలోమీటర్ల నుంచి తెప్పించుకుంటున్నాడు. - తిరుపతి, ఎక్సైజ్ సూపరింటెండెంట్
లిక్కర్ దుకాణాల లైసెన్స్‌కు నోటిఫికేషన్ - దరఖాస్తు ధర రూ.లక్ష పెంపు
మందుబాబులకు షాకింగ్ న్యూస్ - మద్యం ధరలు పెంపు? - ఆ లిక్కర్‌కు మాత్రం మినహాయింపు

