గండిపేట ల్యాండ్ స్కామ్ - వైఎస్సార్సీపీ నేత బ్రహ్మనాయుడికి తెలిసే జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణ
గండిపేటలో మరిన్ని సర్కారు భూములు కొట్టేసేందుకు భారీ పథకం - కీలక నిందితుడు రాధాకృష్ణ అరెస్ట్ అతడింట్లో మరో నకిలీ జీవో స్వాధీనం

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 1, 2026 at 10:40 AM IST
|Updated : June 1, 2026 at 2:34 PM IST
Gandipet Land Fraud Case : అది ఓ ప్రభుత్వ భూమి. దాన్ని కొనడం, విక్రయించడం చట్టవిరుద్ధం. ఇవన్నీ ఆయనకు తెలియని విషయాలేం కాదు. ఎకరా వంద కోట్ల దాకా పలికే ఆ సర్కార్ స్థలంపై కన్నేసిన వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఎలాగైనా వశం చేసుకోవాలని అనుచరులు, సూడో అధికారులతో కలిసి పన్నాగం వేశారు. తొలుత 9.28 ఎకరాల భూమిని ప్రభుత్వం క్రమబద్ధీకరించినట్లు నకిలీ జీవోలు సృష్టించి కాజేయాలని కుట్ర పన్నారు.
ఆ కుటిల ప్రయత్నం విజయవంతమైతే మరిన్ని వేల కోట్ల రూపాయల విలువచేసే భూములు కాజేద్దామని పాచిక వేశారు. ఆ ప్రయత్నాలు విఫలమవ్వడంతో చివరకు అడ్డంగా దొరికిపోయారు. తెలంగాణలోని హైదరాబాద్ శివారు గండిపేటలో రూ.1000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాజేయాలని చేసిన కుట్ర వెనుక సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ఆయన బంధువు రమేశ్ గండిపేటలోని సర్వే నంబర్ 18లో మరిన్ని సర్కార్ భూములు కాజేసేందుకు పథకం పన్నారని పోలీసుల దర్యాప్తులో బయటపడింది.
నకిలీ డాక్యుమెంట్లతో భూమిని కాజేసేందుకు యత్నించిన వారిలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ఆయన సోదరుడు రమేశ్ కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. కీలక నిందితుడు నకిలీ జీవోల సృష్టికర్త వెల్ది రాధాకృష్ణ పోలీసులకు పట్టుబడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే రాధాకృష్ణ, అతడి డ్రైవర్ ప్రవీణ్‌ను రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను శేరిలింగంపల్లి డీసీపీ చింతమనేని శ్రీనివాస్ వెల్లడించారు.
రూ.8 కోట్ల నగదు ఇచ్చిన బొల్లా : గండిపేట సర్వే నంబర్ 18లో దాదాపు వంద ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని డీసీపీ చింతమనేని శ్రీనివాస్ తెలిపారు. ఇందులో 9.28 ఎకరాలను క్రమబద్ధీకరించినట్లు నకిలీ జీవోలు సృష్టించిన వ్యవహారంపై నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైందని చెప్పారు. దర్యాప్తులో భాగంగా నిందితులు మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ఆయన బంధువు బొల్లా రమేశ్ పాత్రకు సంబంధించి మరిన్ని ఆధారాలు సేకరించామని వివరించారు. ప్రధాన నిందితుడు హైదరాబాద్‌కు చెందిన పాత నేరస్థుడు, సూడో అధికారి వెల్ది రాధాకృష్ణ సూచనతో బ్రహ్మనాయుడు మొత్తం రూ.8 కోట్లు నగదు రూపంలో ఇచ్చినట్లు గుర్తించామని వెల్లడించారు.
క్రమబద్ధీకరణ నకిలీ జీవోల తయారీకి ఖర్చవుతుందని చెప్పిన రాధాకృష్ణకు రూ.4 కోట్లు, రాధాకృష్ణ బృందంలోని న్యాయవాది, మరికొందరికి రూ.4 కోట్ల చొప్పున ఇచ్చారని డీసీపీ చింతమనేని శ్రీనివాస్ పేర్కొన్నారు. నగదు అందగానే రాధాకృష్ణ రెవెన్యూ శాఖ క్రమబద్ధీకరించినట్లుగా నకిలీ జీవో సృష్టించాడని చెప్పారు. ఈ జీవోల ఆధారంగా మొదట 9.28 ఎకరాలను విక్రయించాలనుకున్నారని తెలిపారు. ఇది విజయవంతమైతే సమీపంలోని మరిన్ని భూముల్ని ఇదే తరహాలో కొట్టేయాలనుకున్నారని వివరించారు.
ఇందులో భాగంగానే సర్వే నంబర్ 18లోనే 1.20 ఎకరాల భూమిని ఏపీకి చెందిన కమాను నాగేశ్వరరావు పేరుతో క్రమబద్ధీకరించినట్లుగా సృష్టించిన నకిలీ జీవోను రాధాకృష్ణ ఇంట్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారని డీసీపీ వెల్లడించారు. నాగేశ్వరరావుకు తెలంగాణతో ఎలాంటి సంబంధంలేకున్నా అతడి పేరుతో పత్రాలు సృష్టించినట్లు వెలుగులోకి వచ్చిందన్నారు. సదరు ప్రాంతంలో మొత్తం దాదాపు వంద ఎకరాలుందని దాన్ని కూడా కాజేసేందుకు పథకం వేసినట్లు నిందితుడు రాధాకృష్ణ పోలీసులకు వాంగ్మూలమిచ్చాడు. బ్రహ్మనాయుడు సూచనతోనే ఇదంతా జరిగిందని విశ్వసనీయ సమాచారం.
ఫోన్లు స్విచాఫ్ చేసి : నగదు లావాదేవీల ఆధారంగా బ్రహ్మనాయుడు పాత్ర ఉన్నట్లు నిర్ధారించుకున్నామని డీసీపీ చింతమనేని శ్రీనివాస్ తెలిపారు. అది సర్కార్ స్థలమని తెలిసినా దాన్ని ఏదోలా వశం చేసుకోవాలనే కుట్రతోనే బ్రహ్మనాయుడు నిధులు సమకూర్చారని పేర్కొన్నారు. శుక్రవారం విలేకర్ల సమావేశంలో ఆయన పేరు చెప్పిన తర్వాత ఫోన్లు స్విచాఫ్ చేసి పరారయ్యారని తెలిపారు. ఆయణ్ని అదుపులోకి తీసుకోవడానికి ప్రత్యేక బృందాలు పల్నాడులో ఉన్నాయని చెప్పారు.
ఈ మేరకు పల్నాడు ఎస్పీతో సంప్రదింపులు జరుపుతూ స్థానిక పోలీసుల సాయం తీసుకుంటున్నామని డీసీపీ చింతమనేని శ్రీనివాస్ వివరించారు. ఈ కేసులో ఇప్పటివరకూ మొత్తం 10 మందిని నిందితులుగా చేర్చామని చెప్పారు. వీరిలో సాయికిరణ్, రాధాకృష్ణ, రాజేశ్, వేణుగోపాల్, ప్రవీణ్‌ను అరెస్ట్ చేశామని తెలిపారు. రమేశ్, కొవ్వూరు సునీల్, బ్రహ్మనాయుడు, మరో ఇద్దరు పరారీలో ఉన్నారని డీసీపీ వెల్లడించారు.
నకిలీ పత్రాలతో రూ. 1500 కోట్ల భూమి కబ్జాకు వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా యత్నం: డీసీపీ
జగన్ జమానా ఇసుకాసురులకు జరిమానాలు - రూ.8 వేల కోట్లు చెల్లించాలని నోటీసులు!

