ETV Bharat / state

సంక్రాంతి స్పెషల్ - ఇదో 'తారుమారు' సంత - బంధువులను చూసి 'జోరా' నమస్కారాలు

సంక్రాంతికి ముందు తారుమారు సంత నిర్వహించడం ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆనవాయితీ - ఏటా సుమారు 35 వేల మంది గిరిజనులు రాక - సంతలో వస్త్రాలు, పిండి పదార్థాలు, మట్టి పాత్రల దుకాణాలు

Tharumaru Tribal Market in Alluri Sitharama Raju District
Tharumaru Tribal Market in Alluri Sitharama Raju District (EENADU)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 4, 2026 at 8:46 PM IST

3 Min Read
Choose ETV Bharat

Tharumaru Tribal Market in Alluri Sitharama Raju District : అల్లూరి సీతారామరాజు జిల్లాలో సంక్రాంతికి ముందు తారుమారు సంత నిర్వహించడం ఎన్నో ఏళ్ల నుంచి ఆనవాయితీగా వస్తోంది. జి.మాడుగులలో జరిగే ఈ సంత వ్యాపార కార్యకలాపాలకే పరిమితం కాదు. గిరిజనుల జీవన సంస్కృతి, సంప్రదాయాలు, ఆత్మీయ బంధాలకు నిలువెత్తు ప్రతీక. వస్తు మార్పిడి విధానం నుంచి నగదు లావాదేవీల వరకు, అటవీ ఉత్పత్తుల విక్రయాల నుంచి సంక్రాంతి పండగ శోభ వరకు అన్నింటినీ ఒకేచోట మిళితం చేసే ప్రాంతం.

ఈ సంత మన్యానికి గర్వకారణంగా నిలుస్తోంది. ఉమ్మడి విశాఖ, గోదావరి జిల్లాలతోపాటు ఒడిశా నుంచీ వ్యాపారులు హాజరవుతారు. ఏటా సుమారు 35 వేల మంది గిరిజనులు ఈ సంతకు వస్తారు. ఈ ఏడాది జనవరి 6, 13 తేదీల్లో జి.మాడుగుల శివారులోని వెంకటరాజు ఘాట్‌ పరిసర పొలాల్లో సంత నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సర్పంచి రాంబాబు తెలిపారు.

పూర్వం గిరిజనులు అడవుల్లో సేకరించిన తేనె, దుంపలు, పండ్లు, ఇతర ఫలసాయాలను ఈ సంతకు తీసుకొచ్చి విక్రయించేవారు. వచ్చిన సొమ్ముతో సంక్రాంతికి అవసరమైన సరకులు, నూతన దుస్తులు కొనుగోలు చేసేవారు. నగదుకు బదులు వస్తు మార్పిడి విధానమే ప్రధానంగా ఉండేది. అటవీ ఉత్పత్తులిచ్చి ధాన్యాలు, దుస్తులు, కుమ్మరి కుండలు మార్పిడి చేసుకునే వారు. అందుకే దీన్ని తారుమారు సంతగా పిలుస్తారు.

Tharumaru Tribal Market in Alluri Sitharama Raju District
ఆప్యాయంగా జోరా నమస్కారాలు (పాత చిత్రం) (EENADU)

వివాహాల వేదిక : పెళ్లిచూపులు, పెళ్లి సంబంధాలు కుదుర్చుకునే వేదికగానూ ఈ సంత గుర్తింపు పొందింది. గతంలో సంతలోనే పెళ్లిచూపులు జరిగేవి. దూర గ్రామాల్లో ఉన్న బంధువులు సంతలో కలుసుకుని యువతీ, యువకులను చూసి సంబంధాలు కుదుర్చుకునే వారు. కుటుంబాల మధ్య చర్చలు, పెళ్లి నిర్ణయాలు ఇక్కడే జరిగేవని చెబుతారు.

పిల్లల నుంచి పెద్దల వరకు కుటుంబసమేతంగా ఇక్కడకు రావడం గిరిజన సమాజంలోని ఐక్యతను చాటుతోంది. ఇది ఆత్మీయ కలయికలకు చిరునామాగా నిలుస్తోంది. దూరపు బంధువులను కలుసుకుని వంగి ‘జోరా’ అంటూ నమస్కారాలు చేసుకుంటారు. సంత ప్రాంగణమంతా నూతన వస్త్రాలు, పిండి పదార్థాలు, మట్టి పాత్రల దుకాణాలతో కళకళలాడుతూ సంక్రాంతి శోభ ఉట్టిపడుతుంది.

సంక్రాంతికి సై : మరోవైపు సంక్రాంతి అంటనే గుర్తొచ్చేవి కోడి పందేలు. పండగకి సొంతూళ్లకు వచ్చేవారు ఈ పందేల కోసం బరుల దగ్గర బారులు తీరుతారు. పందెం రాయుళ్లైతే పొరుగురాష్ట్రాల నుంచీవచ్చి వాలిపోతారు. అంత క్రేజ్ ఉన్న కోడి పందేల్లో కొట్లాడే కోళ్లంటే ఎలా ఉండాలి.? కయ్యానికి కాలుదువ్వాలి! వదలగానే విరుచుకుపడాలి! ప్రత్యర్థి కోడిని పడగొట్టాలి. ప్రస్తుతం పందెం పుంజులు ఢీకొట్టేందుకు రెడీ అంటున్నాయి. ట్రైనర్స్‌ దగ్గర శిక్షణ తీసుకుంటున్నాయి.

సంక్రాంతి పండుగ సమీపిస్తున్న వేళ కోడిపందేలకు కోళ్లు సిద్ధమవుతున్నాయి. ప్రత్యర్థి పుంజుల్ని మట్టి కరిపించేలా యజమానులు కోళ్లను పెంచుతున్నారు. నెమలి, డేగ, అబ్రాసు, సీతువ, కాకి, పర్ల, రసంగి, కెక్కిరాయి ఇలా పలు జాతుల పుంజులు బరిలో పోటీపడేందుకు సై అంటున్నాయి. కోట్లు చేతులు మారే పందేల్లో తలపడాలంటే ఆ కోళ్లకు కావాల్సిన శక్తి, సామర్థ్యాలను యజమానులు సమకూరుస్తున్నారు. ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. బలవర్ధక ఆహారం అందిస్తున్నారు.

డ్రైఫ్రూట్‌ లడ్డూ, ఖీమా, ఆకుకూరలు : కోడి పందేలకు శిక్షణనిచ్చేవారు ఒక్కొక్కరూ 10 నుంచి 15 కోళ్లను పర్యవేక్షిస్తుంటారు. వీరికి నెలకు రూ.15 నుంచి 20 వేలు వేతనంగా చెల్లిస్తారు. పోటీల్లో పాల్గొనేది సంక్రాంతికైనా దసరా నుంచే కోళ్లకు శిక్షణ ప్రారంభిస్తారు. కొన్నిచోట్ల క్రాష్‌ కోర్సులూ ఉంటాయి. పందేనికి 60 రోజుల ముందు నుంచి రోజూ ఉదయాన్నే డ్రైఫ్రూట్‌ లడ్డూ, ఖీమా, కొన్ని రకాల ఆకుకూరలు ఉడకబెట్టి కోళ్లను మేపుతారు. 40 రోజుల ముందు నుంచి గుడ్డు తెల్లసొన పెడతారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ పందెం కోళ్లను ఆరు బయట ఉంచుతారు. నడకతోపాటు కొన్ని రకాల కసరత్తులు చేయిస్తారు.

కోళ్లకు ఆయాసం రాకుండా, కొవ్వు పెరగకుండా, నరాలు ఫ్రీ అయ్యేందుకు నాలుగైదు రోజులకోసారి బి విటమిన్, మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లు, ఇంజక్షన్లూ ఇస్తుంటారు. చలికాలం కోళ్లకు కొక్కెర వ్యాధి, కొరేగా, ఫంగల్ ఇన్ ఫెక్షన్లు రాకుండా అవసరమైతే యాంటీబయాటిక్స్ వాడతారు. ఇక్కడ పెంచే కోళ్లను నిర్వాహకులు స్వయంగా బరిలో నిలపుతారు. ఎవరైనా కావాలంటే విక్రయిస్తారు. ఒక్కో పుంజు రకాన్ని, దాని సామర్థ్యాన్ని బట్టి లక్షల రూపాయాలకు విక్రయిస్తుంటారు.

ఆదివాసీ సంతలో... విదేశీయులు సందడి

'ముంజ్' హస్తకళకు దేశవిదేశాల్లో​ డిమాండ్​- 500మంది మహిళలకు ఉపాధి- నెలకు రూ.20వేల ఆదాయం!