ETV Bharat / state

నిరుద్యోగులకు గుడ్​న్యూస్ - ట్రైనింగ్ ఇచ్చి మరీ ఉద్యోగావకాశాలు - రేపే లాస్ట్​ డేట్

సిద్దిపేటలో నిరుద్యోగులకు రుసుము లేకుండా శిక్షణ - టాస్క్‌ ప్రాంతీయ కేంద్రం ద్వారా నిరుద్యోగ యువతకు కొత్త దారి - ఎవరు అర్హులు? - ఎలా దరఖాస్తు చేయవచ్చంటే?

Free Training for Unemployed People
Free Training for Unemployed People (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : February 26, 2026 at 2:35 PM IST

3 Min Read
Choose ETV Bharat

Free Training for Unemployed People : డిగ్రీ, ఇంజినీరింగ్‌ పట్టాలు పొందిన తర్వాత కూడా సరైన ఉద్యోగం దొరకక అనేక మంది యువత వివిధ కంపెనీల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఖాళీలు ఉన్నప్పటికీ, తగిన నైపుణ్యాల కొరత కారణంగా నియామకాలు చేయలేకపోతున్నామని కంపెనీల నిర్వాహకులు చెబుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా సిద్దిపేటలోని ఐటీ టవర్‌లో పని చేస్తున్న టాస్క్‌ ప్రాంతీయ కేంద్రం కీలక పాత్ర పోషిస్తోంది. ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్, డీట్‌ (డిజిటల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్స్ఛేంజ్‌ ఆఫ్‌ తెలంగాణ) సమన్వయంతో ఎలాంటి రుసుము లేకుండా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించింది.

ఎవరు అర్హులు - ఎలా దరఖాస్తు చేయవచ్చంటే? : 2023 నుంచి 2026 వరకు డిగ్రీ, ఇంజినీరింగ్‌ లేదా ఇతర పట్టభద్ర కోర్సులు పూర్తి చేసిన వారు ఈ శిక్షణకు అర్హులు. అంతేకాదు ఈ ఏడాది తుది సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. మొత్తం 200 మంది శిక్షణార్థులను ఎంపిక చేసి బ్యాచ్‌ల వారీగా ట్రైనింగ్​ అందించనున్నారు. ముందస్తు నమోదు గడువు ఈ నెల 27 (రేపు)గా నిర్ణయించారు. అభ్యర్థులు విద్యార్హతను తెలిపే ధ్రువపత్రాలతో సిద్దిపేట శివారులోని నాగులబండ వద్ద ఉన్న ఐటీ టవర్‌లోని టాస్క్‌ కార్యాలయానికి పని వేళల్లో నేరుగా హాజరు కావాల్సి ఉంటుంది.

శిక్షణ అంశాలు - భవిష్యత్తుకు బలమైన పునాది : ఈ శిక్షణలో మార్కెట్‌లో ప్రస్తుతం డిమాండ్‌ ఉన్న అనేక అంశాలపై బోధన అందించనున్నారు. ముఖ్యంగా :

  • సాఫ్ట్ స్కిల్స్‌
  • ట్యాలీ
  • డిజిటల్ మార్కెటింగ్‌
  • సీఆర్‌ఎం (Customer Relationship Management)
  • బీపీఎం (Business Process Management)
  • బీఎఫ్‌ఎస్‌ఐ (Banking, Financial Services and Insurance)

టెక్నికల్‌, నాన్‌టెక్నికల్‌ రంగాల్లో ఉద్యోగ అవకాశాలను దృష్టిలో పెట్టుకుని కోర్సులను రూపొందించారు. నైపుణ్యం, ప్రతిభ, అర్హతల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి, తక్కువ సమయంలోనే ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు.

శిక్షణ వ్యవధి - హాజరు తప్పనిసరి : వచ్చే నెల 2వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. మొత్తం మూడు వారాల పాటు ప్రతి రోజు నాలుగు గంటల చొప్పున ట్రైనింగ్​ అందించనున్నారు. హాజరు తప్పనిసరి. శిక్షణకు హాజరయ్యే ప్రతి అభ్యర్థి హాజరు అంగీకార పత్రంపై సంతకం చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్‌ నుంచి నిపుణ శిక్షకులు వచ్చి బోధించనున్నారు. ప్రాక్టికల్‌ పద్ధతిలో, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా బోధన కొనసాగుతుంది.

నాలుగో వారంలో జాబ్ మేళా : శిక్షణ పూర్తైన తర్వాత నాలుగో వారంలో అక్కడే జాబ్‌ మేళా నిర్వహించనున్నారు. వివిధ కంపెనీలను సమన్వయం చేసి అభ్యర్థులకు నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. టెక్నికల్‌, నాన్‌టెక్నికల్‌ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. ఇది శిక్షణార్థులకు గొప్ప అవకాశం.

సద్వినియోగం చేసుకోవాలి : సిద్దిపేట టాస్క్‌ ప్రాంతీయ కేంద్ర మేనేజర్‌ నరేందర్‌ గౌడ్‌ మాట్లాడుతూ, జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శిక్షణతో పాటు ఉద్యోగం కల్పించే విధానం ఎంతో మందికి మేలు చేయనుందని తెలిపారు. మరిన్ని వివరాలకు 86880 89904 నంబర్‌ను సంప్రదించవచ్చని తెలిపారు.

ఉచిత శిక్షణ కార్యక్రమం యువతకు వరంలాంటిది : ప్రస్తుతం ఉద్యోగ మార్కెట్‌లో కేవలం డిగ్రీ సరిపోదని, నైపుణ్యం కూడా అవసరమని నిపుణులు అంటున్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణ తీసుకున్న వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. ఈ నేపథ్యంలో సిద్దిపేట టాస్క్‌ ప్రాంతీయ కేంద్రం చేపట్టిన ఈ ఉచిత శిక్షణ కార్యక్రమం యువతకు వరంలాంటిదని, సరైన మార్గదర్శకం, నైపుణ్యాభివృద్ధి, నేరుగా ఉద్యోగ అవకాశాలు కల్పించే ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది నిరుద్యోగులు తమ కెరీర్‌కు బలమైన పునాది వేసుకునే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - ప్రభుత్వ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ

ఆంగ్ల భాషపై పట్టు సాధించాలా? - ఫ్రీగా కోచింగ్ సదుపాయం - అర్హులు వీరే