ETV Bharat / state

అభాగ్యులకు ఆసరా - ఆధార్ కార్డు ఉంటే చాలు ఉచితంగా వసతి

పలు ఎన్జీవోల సాయంతో విజయవాడలో 10 చోట్ల ఏర్పాటు - ఆధార్ కార్డు ఉంటే చాలు ఉచితంగా వసతి, తిండి సౌకర్యం - బతుకుదెరువు కోసం పట్నం వచ్చే వారికి ఆపన్నహస్తం

Free Shelters With Aadhar Card In Vijayawada
అభాగ్యులకు అండగా ఉచిత ఆశ్రయాలు (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 27, 2026 at 7:35 PM IST

2 Min Read
Choose ETV Bharat

Free Shelters With Aadhar Card In Vijayawada : ఉపాధి కోసం సొంతూరు వదిలినగరానికి వచ్చేవారెందరో. చేతికి పని దొరికినా తలదాచుకునేందుకు చోటు దొరకడం కష్టమే. అద్దె గది తీసుకునే స్థోమత లేక రోడ్లు, బస్టాండ్లలో రాత్రులు గడిపేవారు ఎందరో ఉన్నారు. అలాంటి వారికి విజయవాడలోని ఉచిత ఆశ్రయాలు భరోసాగా నిలుస్తున్నాయి. మున్సిపల్ సంస్థలు, ఎన్జీవోల సాయంతో అభాగ్యులకు ఆసరా కల్పిస్తున్నాయి. ఆధార్ కార్డు ఉంటే చాలు ఉచితంగా వసతి కల్పిస్తున్నారు. ఈ ఆశ్రయాలు ఎలా పని చేస్తున్నాయి ఎవరికి ఉపయోగపడుతున్నాయి.

ఆధార్​తో ఫ్రీ వసతి : బతుకుదెరువు కోసం పల్లె నుంచి పట్నానికి రోజూ ఎంతోమంది వస్తుంటారు. కూలీలు, కార్మికులు, చిరువ్యాపారులు రోజంతా కష్టపడి సంపాదించిన దాంట్లో ఖర్చులకు పోను మిగిలింది ఇంటికి పంపిస్తుంటారు. రోజువారీ సంపాదనతో నెట్టుకొచ్చే కష్టజీవులకు అద్దె గది ఆర్థికభారమే. అందుకే విజయవాడ నగరపాలక సంస్థ, మెప్మా, వివిధ ఎన్జీవోలు కలిసి జాతీయ పట్టణ జీవనోపాధి పథకం కింద ఉచిత ఆశ్రయాలు ఏర్పాటు చేశాయి. సీతన్నపేట, హనుమాన్ పేట, రాణీగారితోట, వైఎస్సార్​ కాలనీ, ఆంధ్రప్రభ కాలనీ, వడ్డెర కాలనీ, మ్యాంగో మార్కెట్, రూట్స్ హెల్త్ ఫౌండేషన్ వంటి పది ప్రాంతాల్లో ఈ ఆశ్రయాలున్నాయి. కేవలం ఆధార్ కార్డు చూపిస్తే చాలు పైసా తీసుకోకుండా 15 రోజుల పాటు ఉచిత వసతి కల్పిస్తారు.

అభాగ్యులకు అండగా ఉచిత ఆశ్రయాలు (ETV Bharat)

వసతి గృహాలకు దాతల సహాయం : వీఎమ్​సీ, ఎన్జీవో ప్రతినిధులు నిరంతరం డ్రైవ్‌లు నిర్వహిస్తూ ఈ ఉచిత ఆశ్రయాలపై ప్రచారం చేస్తున్నారు. కుటుంబం లేని అనాథలకు ఇక్కడ దీర్ఘకాలిక ఆశ్రయం కల్పిస్తున్నారు. సమయానికి తిండి పెడుతూ తమను చేరదీస్తున్నారని కొందరు అభాగ్యులు చెబుతున్నారు. లేకుంటే ఎండకు ఎండి వానకు తడుస్తూ ఉండేవాళ్లమని కన్నీరుమున్నీరవుతున్నారు. మరోవైపు దాతలు రోడ్లపై భోజనం పంచటం వల్ల కొందరు ఈ షెల్టర్లకు రావడం లేదని నిర్వాహకులు చెబుతున్నారు. ఆహారం, దుస్తులు, వస్తువులను నేరుగా వసతిగృహాలకు అందిస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుందని కోరుతున్నారు.

"బయటి ప్రాంతాల నుంచి వచ్చే ప్రతి వలస కార్మికుడికి మేము 15 నుంచి 20 రోజుల పాటు ఉచిత వసతి వంటి సౌకర్యాలను కల్పిస్తున్నాం. అయితే, ఇక్కడ దీర్ఘకాలం పాటు నివసించడానికి అవకాశం లేదు. సాధారణంగా వీధుల్లో నిద్రించాల్సి వచ్చే వారి కోసమే ఈ ఆశ్రయం ప్రధానంగా ఉద్దేశించబడింది. దురదృష్టవశాత్తు, అవగాహన లోపం కారణంగా ఇక్కడికి రావడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇలాంటి ఆశ్రయాలకు ఆహార విరాళాలు అందించాలని నేను దాతలను, ప్రభుత్వాన్ని కోరుతున్నాను". -రేవంత్ కుమార్, మేనేజర్

రోజంతా నగరాన్ని నిర్మించే చేతులకు రాత్రికి కాసింత నీడ దొరకాలి. కష్టపడి సంపాదించే వారికి కాస్త ప్రశాంతత దక్కాలి. అలాంటి గొప్ప ఆలోచనతో ఏర్పాటైన ఉచిత ఆశ్రయాలు ఎంతోమంది అభాగ్యులకు, కష్టజీవులకు భరోసానిస్తున్నాయి.

11 ఏళ్లుగా వందలాది రామచిలుకలకు ఆశ్రయం - కోనసీమలో అరుదైన దృశ్యం

గాయపడిన శునకాలకు ఓ షెల్టర్​ - 18 ఏళ్లుగా మూగజీవాలకు ఆశ్రయం ఇస్తున్న మహిళ