ETV Bharat / state

విద్యతో పాటు విలువలు, విశ్వాసం అదే 'పెహచాన్‌' : ఆకాశ్‌ టాండన్‌

'పెహచాన్​ ద స్ట్రీట్​ స్కూల్'​ పేరుతో మురికివాడల్లోని పిల్లలకు ఉచితంగా విద్య - 10 కేంద్రాల్లో 1,200 మంది వాలంటీర్లతో 1700 మంది విద్యార్థులకు బోధన - సామాజిక సేవలో రామోజీ ఎక్స్​లెన్స్ అవార్డ్

Award Winner Akash Tandon Interview
Award Winner Akash Tandon Interview (ETV)
author img

By ETV Bharat Telangana Team

Published : November 17, 2025 at 5:06 PM IST

4 Min Read
Choose ETV Bharat

Award Winner Akash Tandon Interview : దిల్లీలోని నోయిడా ప్రాంతానికి చెందిన ఆకాశ్​ టాండన్​ మార్కెటింగ్​ ప్రొఫెషనల్​, సోషల్​ యాక్టివిస్ట్​. 'పెహచాన్​ ద స్ట్రీట్​ స్కూల్'​ పేరుతో మురికివాడల్లోని పిల్లలకు చదవు చెబుతారు. ప్రస్తుతం 10 కేంద్రాల్లో 1,200 మంది వాలంటీర్లు, 1700 మంది విద్యార్థులున్నారు. పదేళ్లుగా క్రౌడ్​ ఫండింగ్​తో ఉచితంగా విద్యను అందిస్తున్నారు. కార్పొరేట్​ పాఠశాలల స్థాయిలో పేద విద్యార్థులకు జీవన నైపుణ్యాల్లోనూ శిక్షణ ఇస్తున్నారు. ఈయన చేసిన సేవలకుగానూ కస్టోడియన్​ ఆఫ్​ హ్యూమానిటీ అవార్డు, మోస్ట్​ ప్రామిసింగ్​ ఎన్జీవో ఇన్​ ట్రాన్స్​ఫార్మింగ్​ లైవ్స్​ త్రూ స్ట్రీట్, టీచర్​ వారియర్స్​ అవార్డులు వరించాయి.

విద్యతో పాటు విలువలు, విశ్వాసం అదే 'పెహచాన్‌' : ఆకాశ్‌ టాండన్‌ (ETV)

పెహచాన్‌ను ప్రారంభించాలనే ప్రేరణ ఎలా, ఎప్పుడు కలిగింది?

చదువుకునే రోజుల్లో దిల్లీలోని ఓ మురికివాడకు వెళ్లా. అక్కడ పది వేల జనాభా ఉంది. డబ్ల్యూహెచ్‌వో కార్యాలయం, సీఎం కార్యాలయం, రాష్ట్రపతి భవన్, పోలీస్‌ కమిషనరేట్, ఇండియాగేట్‌ వంటివి ఆ బస్తీ చుట్టూ ఉన్నాయి. అయినా ఆ బస్తీలో విద్యుత్తు, పాఠశాల, తాగునీటి వసతి, ఆసుపత్రి లేవు. స్థానిక చిన్నారులు మురికి కాలువలో ఈత కొడుతున్నారు. మత్తు పదార్థాలు తీసుకోవడం, యాచన, కూలి పనులతో గడిపేస్తున్నారు. వారి జీవితాలను ఎలాగైనా మార్చాలని అప్పుడే నిర్ణయించుకున్నా. "పెహచాన్​ ది స్ట్రీట్​ స్కూల్​"కు శ్రీకారం చుట్టాను. ఎలాంటి లాభాపేక్షలేని సంస్థ ఇది. క్రౌడ్​ ఫండిగ్ చేసి పేద పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పిస్తున్నాం. ఈ సేవ కోసం హెహచాన్​ యాప్​ కూడా తీసుకొచ్చాం.

మీ వీధి బడి దిల్లీ అంతటా ఎలా విస్తరించింది?

ఓ గుడి ముందున్న చెట్టు నీడలో పెహచాన్​ పురుడు పోసుకుంది. బస్తీలోని తల్లిదండ్రులను ఒప్పించి పిల్లలకు చదువు చెప్పడం ప్రారంభించా. మొదట్లో పది మంది పిల్లలే వచ్చారు. వారికి పెన్నులు, నోట్ పుస్తకాలు, చాక్లెట్లు వంటి బహుమతులు ఇచ్చి పాఠాలు చెప్పడం ప్రారంభించా. కథలు చెప్పడం వల్ల పిల్లలు ఆసక్తి చూపేవారు. వారాంతాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బోధన జరిగేది. ఆరు నెలలకు విద్యార్థుల సంఖ్య 150కి చేరింది. పదేళ్ల తర్వాత ప్రస్తుతం 1,700 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 1,200 మంది వాలంటీర్లు నాతో పని చేస్తున్నారు.

పెహచాన్​కి ముందు ఓ సాధారణ ఉద్యోగి మీరు. ఎప్పుడు మీ జీవితం మలుపు తిరిగింది? ఇప్పుడు ఎలా సాగుతోంది?

చదువుకునే వయసు నుంచే సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేవాడిని. బస్తీకి వెళ్లడం, అక్కడి పరిస్థితులను మార్చాలనే ఆలోచనతో ఉద్యోగాన్ని విడిచి సామాజిక సేవలోకి వెళ్లాను. నేను నడుపుతున్న బడుల్లో పిల్లలకు చదువే కాదు అనేక విషయాలను బోధిస్తున్నాం. సమాజానికి ఏదైనా చేయాలనుకునే వ్యక్తులకు పెహచాన్ ఎప్పటికీ స్వాగతం పలుకుతుంది. మా విద్యార్థులతో కలిసి ముచ్చటించవచ్చు. వారికి పాఠ్యాంశాలు బోధించవచ్చు. మాలాంటి సంస్థలను ప్రారంభించాలనుకునే వారికి మేము పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం.

పెహచాన్ ఎలాంటి విద్యను అందిస్తోంది?

జీవితాన్ని మార్చేది చదువు ఒక్కటే. చదువుకు దూరమైన పిల్లలను ఒకే చోట చేర్చి, ముగ్గురు లేదా నలుగురు విద్యార్థులను గ్రూపుగా చేసి ఒక వలంటీర్​ను కేటాయించి బోధిస్తున్నాం. పెహచాన్​ సెంటర్లు సాధారణ పాఠశాలల మాదిరి కాదు. బలవంతపు చదువులు ఉండవు. బ్రిడ్జి స్కూళ్ల మాదిరిగా పాఠ్యాంశాలు ఉంటాయి. మా వద్ద మూడు రకాల విద్యార్థులుంటారు. కొందరు ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు వెళ్లిన తర్వాత కూడా మా సెంటర్లకు వచ్చి అదనపు స్కిల్స్ నేర్చుకుంటారు. మరికొందరు మధ్యలోనే చదువు మానేసిన వారు ఉన్నారు. పూర్తిగా పాఠశాల ముఖమే చూడని వారు మూడో రకం. వారికి అన్ని మెలకువలు నేర్పించి తిరిగి సాధారణ స్కూళ్లలో చేర్పిస్తుంటాం. 12వ తరగతి వరకు చదివిస్తున్నాం. కావాల్సిన విద్యతో పాటు విలువలు, విశ్వాసం ఇక్కడ నేర్పుతాం.

విద్యార్థులు తమకు తాము స్ఫూర్తి పొంది జీవితంలో ఎదిగేలా సహాయపడాలని తరచూ మీరు చెబుతుంటారు. అలాంటి దార్శనికత ఉన్న విద్యార్థి ఎవరైనా పెహచాన్​ కేంద్రంలో ఉన్నారా?

మా తొలి కేంద్రంలో మూడో తరగతి విద్యార్థిగా చేరిన దీపక్ అలాంటి వాడే. తన జీనితాన్ని చక్కగా తీర్చిదిద్దుకున్నాడు. 2017లో నేను ల్యాప్​టాప్​లో పనిచేసుకుంటుండగా ఓ అబ్బాయి నా వద్దకు వచ్చి ఇదేంటని ప్రశ్నించాడు. కంప్యూటర్ అని చెప్పడంతో, తనకొకటి కావాలని అడిగాడు. 12వ తరగతి పాసైతే కొనిస్తానని చెప్పాను. గతేడాది ఆ కుర్రాడు సీబీఎస్​ఈ 12వ తరగతిలో 86 శాతంతో ఉత్తీర్ణత సాధించాడు. ముందునాకే ఆ విషయాన్ని చెప్పాడు. ఉన్నత చదువు కోసం అతను దిల్లీ వర్సిటీలో చేరాల్సి వచ్చింది. అందుకు అతని తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. చాలా కష్టపడి వాళ్లను ఒప్పించాం. ప్రస్తుతం ఆయన డిగ్రీ రెండో ఏడాది చదువుతున్నాడు. అంతే కాదు దీపక్ వాలంటీరుగా కూడా పనిచేస్తున్నాడు.

"రామోజీ ఎక్స్​లెన్స్ అవార్డుకు ఎంపికవ్వడం చాలా గర్వంగా ఉంది. ఆందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. యువత ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మొత్తం ప్రపంచాన్ని మార్చేయడం ఒక్కరి వల్ల కాదు. తొలుత మీకు నచ్చిన అంశాన్ని ఎంచుకోవాలి. చదువు సమాజాన్ని మార్చగలదని నేను బలంగా నమ్ముతాను. ప్రస్తుతం ఎంతోమంది పేదలు విద్యకు దూరంగా ఉంటున్నారు. మీరు కనీసం ఒక్కరికైనా 'ఈచ్​ వన్​, టీచ్​ వన్​' పద్ధతిలో చేదోడువాదోడుగా నిలవాలి." - ఆకాశ్‌ టాండన్‌, రామోజీ ఎక్స్​లెన్స్ అవార్డు గ్రహీత

'గిరిజన దుస్తులు ధరించి వారి భాషలను నేర్చుకున్నా' - రామోజీ ఎక్స్​లెన్స్​ అవార్డు గ్రహీత ప్రసన్నశ్రీ