ETV Bharat / state

నేటి నుంచి దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం - ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం

ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంపై దివ్యాంగులు హర్షం - చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన దివ్యాంగులు - కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటామన్న దివ్యాంగ సంక్షేమ కార్పొరేషన్ రాష్ట్ర ఛైర్మన్ నారాయణస్వామి

Free Bus Scheme for disabled begins Today in AP
Free Bus Scheme for disabled begins Today in AP (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : March 1, 2026 at 4:43 PM IST

2 Min Read
Choose ETV Bharat

Free Bus Scheme for disabled begins Today in AP : ఏపీలో నేటి నుంచి దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ పథకం మొదలైంది. రాష్ట్రంలో దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత సదుపాయం కల్పిస్తూ ప్రభుత్వం నిన్న(శనివారం) ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మహిళలకు స్త్రీశక్తి పథకం కింద ఉచిత ప్రయాణం కల్పిస్తుండగా, వీటిలో దివ్యాంగులకు కూడా ఉచిత ప్రయాణం వర్తింపజేసింది. 40 శాతం, అంతకంటే ఎక్కువ శాతం వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఉచిత ప్రయాణం వర్తిస్తుందని పేర్కొంది.

నేటి నుంచి దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం - ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం (ETV Bharat)

ఇంద్రధనస్సు పేరిట పథకాలు : గత ఏడాది డిసెంబరు 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు వారికి ఇంద్రధనస్సు పేరిట ఆరు పథకాలు ప్రకటించారు. అందులో ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కూడా ఒకటి. ఫిబ్రవరి 24న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఉత్తర్వు జారీచేశారు.

ప్రస్తుతం దివ్యాంగులకు మెట్రో ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, నాన్‌ స్టాప్, అంతర్‌రాష్ట్ర (ఇంటర్‌స్టేట్‌), సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ (తిరుమల ఘాట్‌లో తిరిగేవి), అల్ట్రా డీలక్స్‌ బస్సు సర్వీసుల్లోని టికెట్‌ ఛార్జీలో 50 శాతం రాయితీ ఇస్తున్నారు. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోని సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం ఉంది. తాజా ఉత్తర్వు నేపథ్యంలో పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో కూడా దివ్యాంగుల ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పిస్తారు.

రాష్ట్రంలో 11 లక్షల మంది దివ్యాంగులు : మిగిలిన నాన్‌స్టాప్, సప్తగిరి ఎక్స్‌ప్రెస్, అల్ట్రా డీలక్స్, అంతర్‌రాష్ట్ర బస్సు సర్వీసుల్లో ఇప్పుడున్నట్లే 50 శాతం రాయితీ కొనసాగుతుంది. రాష్ట్రంలో 11 లక్షల మంది దివ్యాంగులు ఉన్నట్లు సంబంధిత శాఖ అధికారులు ఆర్టీసీకి వివరాలు అందజేశారు. ప్రస్తుతం ఆర్టీసీలో 2 లక్షల మంది దివ్యాంగులు మాత్రమే పాస్‌ వినియోగించుకుంటున్నారు.

సంతోషం వ్యక్తం చేస్తున్న దివ్యాంగులు : నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో దివ్యాంగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురంలోని NTR సర్కిల్ వద్ద దివ్యాంగ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ రాష్ట్ర అధ్యక్షుడు నారాయణస్వామి ఆధ్వర్యంలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. దివ్యాంగులకు ఇచ్చిన ఏడు వరాల్లో ఒక హామీని చంద్రబాబు అమలు చేశారని ఆనందం వ్యక్తం చేశారు.

గత ఐదేళ్లలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న దివ్యాంగులకు నేడు కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమాలు అమలు చేస్తూ అభివృద్ధికి దోహదపడుతోందన్నారు. కూటమి ప్రభుత్వానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దివ్యాంగులంతా రుణపడి ఉంటామన్నారు. ఉచిత బస్సు హామీ నెరవేర్చినందుకు కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

వాటిలో ఒక దివ్యాంగ ప్రతినిధిని నామినేట్ : కూటమి ప్రభుత్వం తరఫున దివ్యాంగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు 7 వరాలు ప్రకటించారు. ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నట్టు సీఎం వెల్లడించారు. వాటితో పాటుగా స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు, పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ ప్రైజెస్‌లో కనీసం ఒక దివ్యాంగ ప్రతినిధిని నామినేట్ చేస్తామని తెలిపారు.

ఆర్థిక సబ్సిడీ పథకాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అందించినట్టుగానే దివ్యాంగులకు మళ్లీ ప్రారంభిస్తామని అన్నారు. శాప్‌ (SAAP) ద్వారా అన్ని క్రీడా కార్యక్రమాలు, టాలెంట్ డెవలప్‌మెంట్‌ స్కీములు దివ్యాంగులకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపడతామన్నారు.

దివ్యాంగులకు శుభవార్త - ఐదు రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం

ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం - దాదాపు 2 లక్షల మందికి మేలు