ETV Bharat / state

దివ్యాంగులకు శుభవార్త - ఐదు రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం

దివ్యాంగులకు సైతం ఇకపై ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం - వివిధ సంస్థల పెట్టుబడుల ప్రతిపాదనలకూ ఆమోదం తెలిపిన కేబినెట్‌ - ఆయా పరిశ్రమల భూ కేటాయింపులకు గ్రీన్​సిగ్నల్

Free bus for disabled Persons in AP
Free bus for disabled Persons in AP (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 25, 2026 at 8:38 AM IST

|

Updated : February 25, 2026 at 9:03 AM IST

3 Min Read
Choose ETV Bharat

Free bus for disabled Persons in AP: దివ్యాంగులకూ ఇకపై ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్రంలో వివిధ సంస్థల పెట్టుబడుల ప్రతిపాదనకూ ఆమోదం తెలిపిన కేబినెట్‌,ఆయా పరిశ్రమల భూ కేటాయింపులకు పచ‌్చజెండా ఊపింది.

దివ్యాంగులకు ఉచితబస్సు ప్రయాణం: సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం దాదాపు 57 అంశాలకు ఆమోదముద్ర వేసింది. స్త్రీశక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సుప్రయాణ సౌకర్యం తరహాలోనే 40 శాతం, అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారికి 5 రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాలని నిర‌్ణయించింది. స్త్రీశక్తి పథకం వర్తించని బస్సుల్లో, ఇప్పటికే అమల్లో ఉన్న 50 శాతం రాయితీ కొనసాగనుంది.

దివ్యాంగులకు శుభవార్త - ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించాలని మంత్రివర్గం నిర్ణయం (ETV Bharat)

2014 -19 మధ్య నీరు-చెట్టు పనులకు సంబంధించి అటవీశాఖ అధికారులు, జలవనరులశాఖ ఇంజినీర్లు, జన్మభూమి కమిటీ సభ్యులు, ఇతర సంస్థలపై వైఎస్సార్సీపీ హయాంలో పెట్టిన క్రిమినల్‌ కేసులను కక్షసాధింపుగా పరిగణించి కేబినెట్‌ వాటిని ఉపసంహరించింది. ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖల పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. కొత్తగా సైన్స్, టెక్నాలజీ అండ్‌ ఇన్నోవేషన్‌ విభాగాన్ని ఏర్పాటు చేసింది.

చట్ట సవరణ బిల్లుకు అంగీకారం: ప్రస్తుతం ఉన్న పర్యావరణం, అటవీ, శాస్త్ర, సాంకేతికశాఖ పేరును పర్యావరణం అటవీశాఖ గా మార్పు చేసింది. మోటార్‌ వాహనాల రిజిస్ట్రేషన్‌ సమయంలో చెల్లించే లైఫ్‌ ట్యాక్స్‌పై 10 శాతం అదనపు పన్నుని రోడ్డు సేఫ్టీ సెస్‌ పేరుతో విధించేందుకు వీలుగా అసెంబ్లీలో చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టేందుకు అంగీకరించింది. కొల్లేరు వన్యప్రాణి అభయారణ్య సరిహద్దుల క్రమబద్ధీకరణకు కేంద్ర సాధికార కమిటీ అనుమతి కోరాలనే ప్రతిపాదనను ఆమోదించింది.

అంతేకాకుండా సెకీతో కుదిరిన విద్యుత్‌ విక్రయ ఒప్పందం ఆధారంగా 300 మెగావాట్ల విద్యుత్‌ తీసుకునేందుకు డిస్కమ్‌లకు మంత్రివర్గం అనుమతి ఇచ్చింది. టీటీడీలో లడ్డూ తయారీ పోటులో 18 సూపర్‌వైజర్ పోస్టుల ఏర్పాటుకి అనుమతిచ్చింది. చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలంలో కొత్త మహిళా డిగ్రీకళాశాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.

గిగాఫ్యాక్టరీ ఏర్పాటుకు 300 ఎకరాలు: ఈనెల 18న, రాష్ట్రపెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు-ఎస్​ఐపీబీ ఆమోదించిన పెట్టుబడుల ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. విశాఖలో వెయ్యి మెగావాట్‌ల ఏఐ డేటా సెంటర్‌కి అదానీ ఇన్‌ఫ్రా ఇండియా లిమిటెడ్‌ను ఆథరైజ్డ్‌ నోటిఫైడ్‌ భాగస్వామిగా పరిగణించాలని గూగుల్‌ అనుబంధ సంస్థ రైడెన్‌ ఇన్ఫోటెక్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ చేసిన విజ్ఞప్తికి ఆమోదం తెలిపింది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి వద్ద 16 గిగావాట్స్‌ పర్‌ హవర్‌ సామర్థ్యంతో వారీ ఎనర్జీ ఏర్పాటు చేసే లిథియం ఐయాన్‌ సెల్‌ గిగాఫ్యాక్టరీ ఏర్పాటుకు 300 ఎకరాలు, ప్రత్యేక ప్రోత్సాహకాలివ్వాలని నిర్ణయించింది.

ఓర్వకల్లు మండలం గుత్తపాడు క్లస్టర్‌లో సింథటిక్‌ ఆర్గానిక్‌ కెమికల్స్, ఏపీఐల తయారీ యూనిట్‌ ఏర్పాటు చేసే సిగాచి ఇండస్ట్రీస్‌ సంస్థకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇచ్చేందుకూ అంగీకారం తెలిపింది. విశాఖ జిల్లా తర్లువాడలో అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్‌ ఇన్‌ ప్యాకేజ్‌ టెక్నాలజీస్‌ సంస్థ ప్రతిపాదించిన అవుట్‌సోర్స్‌డ్‌ సెమికండక్టర్‌ అసెంబ్లీ అండ్‌ టెస్ట్‌ ఫెసిలిటీ ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది. రిలయన్స్‌ కన్స్యూమర్స్‌ లిమిటెడ్, సిఫీ ఇన్ఫినిట్‌ స్పేసెస్‌ లిమిటెడ్, రేమండ్‌ గ్రూప్‌ ప్రెసిషన్‌ టెక్నాలజీ లిమిటెడ్, జేకే మైని గ్లోబల్‌ ఏరోస్పేస్‌ లిమిటెడ్‌ సంస్థలకు కేటాయించిన భూములకు సంబంధించి డబ్బు చెల్లింపు, ప్రాజెక్టుల గడువు పెంపు ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

భూ కేటాయింపులకు ఆమోదం: హిందుస్థాన్‌ కోకాకోలా బెవరేజెస్, అజాద్‌ ఇండియా మొబిలిటీ, జిన్‌ఫ్రా ప్రెసిషన్స్, జూపిటర్‌ రెన్యువబుల్‌ సంస్థకు గతంలో చేసిన భూ కేటాయింపులు రద్దు చేసింది. అనంతపురం జిల్లా కనేకల్, డి.హీరేహల్, రాయదుర్గం మండలాల్లో 160 మెగావాట్ల పవన విద్యుత్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకి క్లీన్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ హైబ్రీడ్‌ సంస్థకు అనుమతిని ఇచ్చింది.

కర్నూలు జిల్లాలో ఎన్టీపీసీ రెన్యువబుల్‌ ఎనర్జీ లిమిటెడ్‌ 900 మెగావాట్‌ల సోలార్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ ఏర్పాటుకు అనుమతి లభించింది. ఏపీ మారిటైమ్‌ బోర్డు నుంచి నేరుగా 153.77 ఎకరాలను రామాయపట్నం కార్గో రైల్‌ టెర్మినల్‌కి బదిలీ చేసేందుకు అనుమతి ఇచ్చింది. సీఆర్​డీఏ పరిధిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం తీసుకున్న నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం - దాదాపు 2 లక్షల మందికి మేలు

దివ్యాంగులకు సీఎం 7 వరాలు - ఇకపై ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

Last Updated : February 25, 2026 at 9:03 AM IST