ETV Bharat / state

ఒంటరి మహిళలకు అండగా ఆర్డీటీ - ఆటో డ్రైవర్లుగా రాణిస్తున్న నారీమణులు

ఒంటరి మహిళలకు ఉచిత ఆటో డ్రైవింగ్ శిక్షణ - 35 రోజులు వసతి, యోగా, కరాటే శిక్షణ - పిల్లలకు పౌష్టికాహారం, తల్లులకు ఉపాధి - ఆర్డీటీ ఎకాలజీ సెంటర్‌లో ట్రైనింగ్​

Women Auto Drivers in anantapur
Women Auto Drivers in anantapur (ETV)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : July 4, 2026 at 4:10 PM IST

4 Min Read
Choose ETV Bharat

Women Auto Drivers Through RDT in Anantapur : విధి వంచితులైన ఆ మహిళలంతా ఊపిరి తీసుకోవాలని భావించారు. మగదిక్కును కోల్పోయిన వారికి అండగా నిలవాల్సిన బంధువులు, ఇరుగు పొరుగు వారు సూటిపోటి మాటలతో వేధించేవారు. భర్త లేని జీవనం కష్టమని భావించిన వారంతా ఇక జీవితం చాలనుకున్న పరిస్థితుల్లో అనంతపురం ఆర్డీటీ (RDT - Rural Development Trust) వారికి చేయూతనిచ్చి అక్కున చేర్చుకుంది. నిరుపేద ఒంటరి మహిళలకు తానున్నానంటూ పిల్లలకు పౌష్ఠికాహారం అందిస్తూ, వారి తల్లులకు ఆత్మస్తైర్యంతో పాటు, స్వయం ఉపాధికి శిక్షణ ఇస్తున్నారు. 35 రోజులపాటు వసతి కల్పించి ఆటో డ్రైవింగ్ నేర్పడంతోపాటు, ఆరోగ్యాన్ని కాపాడుకునేలా యోగా, కరాటేలో శిక్షణ ఇస్తూ సమాజంలో ధైర్యంగా నిలబడేలా తీర్చిదిద్దుతున్నారు. అనంతపురం ఆర్డీటీ ఎకాలజీ సెంటర్​లో ఆటోడ్రైవర్లుగా శిక్షణ పొందుతున్న ఆ 22 మంది మహిళలది కన్నీరు తెప్పించే కథలే.

తాగుడుకు బానిసై తీవ్ర అనారోగ్యంతో భర్తను కోల్పోయిన ఆభాగ్యురాలు ఒకరు, ఉపాధి వేటలో భర్త ప్రాణాలు కోల్పోగా ఒంటరిగా మిగిలిన మహిళ మరొకరు. తలిదండ్రులను కాదని, ప్రేమ పెళ్లిచేసుకొని ప్రమాదంలో భర్తను కోల్పోయి, అయినవారి ఆదరణకు దూరమైన మహిళ ఇంకొకరు. ఇలా ఇక్కడ కనిపిస్తున్న వారంతా భర్తను కోల్పోయి పిల్లను పోషించుకోవడానికి జీవన పోరాటం చేస్తున్నవారే. చిన్న వయసులోనే భర్తను కోల్పోయి, అయినవారు ఆదుకోక సమాజంలో ఎన్నో వేధింపులకు గురైన వీరంతా ఎన్నో కష్టాలు పడ్డారు.

భర్తను కోల్పోయినా వెనక్కి తగ్గలేదు - ఆటో డ్రైవర్లుగా రాణిస్తున్ననారీమణులు (ETV)

22 మంది మహిళలకు శిక్షణ : వీరంతా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అత్యంత దయనీయమైన జీవితం గడుపుతున్న విషయం గుర్తించిన ఆర్డీటీ సంస్థ నిరుపేద ఒంటరి మహిళల జీవితాలను తీర్చిదిద్దుతోంది. ఆర్డీటీ సంస్థ తమ క్షేత్రస్థాయి సిబ్బంది సహకారంతో భర్తను కోల్పోయి, పిల్లల పోషణ భారమైన ఒంటరి మహిళలను గుర్తించి వారికి ఉపాధి దారి చూపుతూ సొంతంగా జీవించే శక్తి సామర్థ్యాలను ఇస్తోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల నుంచి గుర్తించిన 22 మంది మహిళలకు ఆర్డీటీ ఎకాలజీ సెంటర్​లో ప్రత్యేకంగా ఆత్మస్థైర్యం, ఉపాధి శిక్షణ ఇస్తున్నారు. తమకు ఆర్డీటీ ఎకాలజీ సెంటర్ కొత్త జీవితాన్ని ప్రసాదిస్తోందని నిరుపేద ఒంటరి మహిళలు చెబుతున్నారు.

"మా ఊర్లో, ఇంట్లో, అత్తమామలు అందరూ నన్ను చిన్నచూపు చూశారు. ఒక నెల రోజులు ఇంటి నుంచి బయటికి రాలేదు. కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లం ఉంటే పడుకోమని కొడుకు సాయం చేసేవాడు. సింగిల్ మదర్స్​ని చిన్న చూపు చూస్తారు. దానికి ధైర్యంగా ఆటో డ్రైవింగ్​కు వచ్చాను. ఆర్డీటీ వల్లే నేను బతుకుతున్నాను." -అంజలి, ఒంటరి మహిళ

అనంతపురం జిల్లాలోని ఆర్డీటీ, ఎకాలజీ సంస్థలు నిరుపేదలు, రైతులకు అండగా నిలుస్తున్నాయన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడూ పేదలను అక్కన చేర్చుకునే ఆర్డీటీ, ఎకాలజీ సంస్థ దశాబ్దాల కాలంగా వేలాది మంది నిర్బాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపి ఉపాధికి బాటలు వేసింది. ఆర్డీటీ సంస్థ ఒంటరి మహిళను గుర్తించి అనుబంధ సంస్థ అయిన ఎకాలజీ సెంటర్​కు అప్పగిస్తుంది. ఎకాలజీ సెంటర్ ఈ తరహా మహిళలకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తూ వారిలో ధైర్యాన్ని నింపి, పిల్లలను సొంతంగా పోషించుకునేలా ఉపాధి శిక్షణ ఇస్తోంది.

ఉచితంగా ఎలక్ట్రిక్ ఆటోల పంపిణీ : ఇప్పటికే ఈ తరహాలో రాష్ట్ర ప్రభుత్వం డీఆర్డీఏ ద్వారా ఒంటరి మహిళలకు ఆర్డీటీ ఎకాలజీ సెంటర్ లో ఆటోడ్రైవర్​గా శిక్షణ ఇప్పించింది. మరో రెండు బ్యాచ్ లకు ఆర్డీటీ సొంత వ్యయంతో శిక్షణ ఇచ్చి ఎలక్ట్రిక్ ఆటోలను ఉచితంగా పంపిణీ చేసింది. ప్రస్తుతం శిక్షణకు ఎంపిక చేసిన మహిళలు ఎకాలజీ సెంటర్ లోనే ఉంటూ శిక్షణ తీసుకుంటున్నారు. ఆర్డీటీ సంస్థ పోషకాహార పథకంలో ఈ మహిళల పిల్లలను చూసుకుంటోంది. శిక్షణ కోసం వచ్చిన మహిళలు పిల్లల పోషణపై ఆలోచించే అవసరం లేకుండా ఆర్డీటీ సంస్థ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ శిక్షణతో తమకు ధైర్యం వచ్చిందని నిరుపేద ఒంటరి మహిళలు చెబుతున్నారు.

"చిన్న వయసులోనే పెళ్లి చేశారు. ఆయన పనికి వెళ్లి కింద పడి చనిపోయాడు. పుట్టింట్లో, అత్తమామల దగ్గర సమస్యలు వచ్చి మా ఊరికి వచ్చేశాను. పిల్లల్ని ఎట్లా పోషించుకోవాలో తెలిసేది కాదు. ఈ సమయంలో ట్రైనింగ్ ఇస్తాం ధైర్యంగా వెళ్తావా అంటే ఓకే చెప్పాను. పిల్లల్ని మంచిగా చదివించుకోవాలి, సమాజంలో గౌరవంగా బతకాలని వచ్చాను." -లక్ష్మీబాయి, ఒంటరి మహిళ

ఒంటరి మహిళలు భర్తను కోల్పోయి అన్ని విధాలా మానసిక ఒత్తిడితో ఉంటారు. కొన్ని కుటుంబాల్లో ఆదరణ కూడా తక్కువగా ఉంటుంది. ఇలాంటి వారినే ఆర్డీటీ సంస్థ ఎంపికచేసి శిక్షణ ఇస్తోంది. శిక్షణ పొందిన ఒంటరి మహిళలకు ఉచితంగా ఆటో ఇస్తున్నారు. మహిళలు తమ గ్రామాల్లోనే ఉంటూ ఆటో డ్రైవర్లుగా జీవనం చేస్తూ, పిల్లలను ఉన్నతంగా చదివించుకునే అవకాశం ఉంది. గతంలో మూడు విడతలుగా ఈ తరహాలోనే ఒంటరి మహిళలకు ఆర్డీటీ ఎకాలజీ సెంటర్ శిక్షణ ఇవ్వగా వారంతా ఆటో డ్రైవర్లుగా నెలకు 25 నుంచి రూ.30 వేలు సంపాదిస్తున్నారు. ముఖ్యంగా ఒంటరి మహిళలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎకాలజీ సెంటర్​లో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. తల్లి ఆరోగ్యంగా ఉంటేనే పిల్లల పోషణ, చదువు సాగుతుందని గుర్తించిన ఎకాలజీ సెంటర్ ఆ తరహాలో ఒంటరి మహిళలను అన్నివిధాలా తీర్చిదిద్దుతోంది. తమ శిక్షణతో మహిళలు ఎవరిపై ఆధారపడకుండా సమాజంలో ధైర్యంగా బతకగలుగుతున్నట్లు ఆర్డీటీ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.

"ముగ్గురు పిల్లల తర్వాత మా ఆయన చనిపోయాడు. అందరూ ఎందుకు బతుకుతున్నావు అని చులకనగా మాట్లాడారు. పిల్లలు పస్తులున్న రోజులున్నాయి. ఆర్డీటీ విశాల మేడం ద్వారా ఆటో ట్రైనింగ్ గురించి తెలిసింది. ఆటో ఇచ్చిన తర్వాత ప్రతి నెలా 60 వేల రూపాయలు ఈజీగా సంపాదిస్తున్నాను. నా కొడుకుల్ని లక్షన్నర కట్టి హాస్టల్​లో చదివించుకుంటున్నాను. ఇప్పుడు నేను 23 మందికి ట్రైనర్​గా వచ్చాను." -సురేఖ, ఒంటరి మహిళ (ప్రస్తుతం ట్రైనర్‌)

ఒంటరి మహిళలకు శిక్షణ, ఉపాధి కల్పనకు ఆర్డీటీ ఎకాలజీ సెంటర్ ప్రత్యేక ప్రణాళికతో తెలుగు రాష్ట్రాల్లో మరికొందరిని గుర్తించి విడతల వారీగా శిక్షణ ఇవ్వనున్నారు.

45 దేశాలు, 75 టోర్నీలు, 35 పతకాలు - చెస్​లో సత్తా చాటుతున్న ప్రియాంక

లగ్జరీ లైఫ్‌ వదులుకుని పేద విద్యార్థులకు ఉచితంగా ఐటీ నైపుణ్యాలు నేర్పిస్తూ