విశ్రాంత ఉద్యోగులే టార్గెట్ - మనీలాండరింగ్ జరిగిందని మోసగించే ప్రయత్నం
రూ. 25 లక్షల మనీలాండరింగ్ జరిగిందని డిజిటల్ అరెస్టు పేరుతో విశ్రాంత ఉద్యోగులకు బెదిరింపులు - బాధితుడి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన విషయం

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 20, 2026 at 8:44 AM IST
Cyber Fraud To Retired Employee in Krishna District: ప్రస్తుతం ఎంత టెక్నాలజీ అందుబాటులోకి వచ్చి ఉపయోగపడుతుందో, అంతకంటే ఎక్కువే దుర్వినియోగమవుతోంది. సులభంగా డబ్బు సంపాదించాలన్న అత్యాశతో ఎంతోమంది ఎదుటివారి బలహీనతలను, అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటున్నారు.
తాజాగా కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు టౌన్ పోలీసులు ఇద్దరు వృద్ధులను డిజిటల్ అరెస్ట్ నుంచి కాపాడారు. గతంలో అకౌంటెంట్‌గా, టీచర్‌గా పనిచేసి రిటైర్ అయిన కోటా శివశంకర్ (70) ఆయన భార్య ఇద్దరు ఉయ్యూరులోని ఏజీ అండ్ ఎస్జీ కాలేజ్ సమీపంలో నివాసం ఉంటున్నారు. వీరికి ఈనెల 18వ తేదీ ఉదయం 11 గంటల సమయంలో ముంబై క్రైమ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నా, మీ ఆధార్ కార్డు ద్వారా రూ. 25 లక్షల మనీలాండరింగ్ జరిగిందని ఓ ఫోన్ కాల్ వచ్చింది.
అప్రమత్తమైన వృద్ధుడు: అనంతరం దీనికి సంబంధించి మీపై సుప్రీంకోర్టు నుంచి అరెస్ట్ వారెంట్ జారీ అయిందని చెప్పి సైబర్ మోసగాడు అన్నాడు. అంతేకాకుండా సుప్రీంకోర్టు జడ్జిగా ఒకరిని వీడియో కాల్ మాట్లాడించి బ్యాంక్ అకౌంట్ల వివరాలు, స్థిర చరాస్తులు వివరాలన్నీ ఇవ్వాలని ఈ విషయాలు ఎవరికీ చెప్పకూడదని చెబితే వెంటనే లోకల్ పోలీస్ వారు వచ్చి అరెస్ట్ చేసి ముంబై పంపిస్తారని భయభ్రాంతులకు గురి చేశారు.
అయితే కృష్ణాజిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు విస్తృతంగా జరిగిన సైబర్ నేరాల అవగాహన కార్యక్రమాల్లో భాగంగా గతంలో ఉయ్యూరులో చేపట్టిన కార్యక్రమాల వల్ల కొద్దిపాటి అవగాహన కలిగి ఉన్న ఈ వృద్ధులు వెంటనే స్థానిక స్టేషన్ ఆఫీసర్ వీవీ. రామారావుకు సమాచారం అందించారు. దాంతో ఆయన ఉన్నతాధికారులకు సమాచారం తెలియపరిచి వెంటనే అక్కడ చేరుకుని కొద్దిసేపు జరుగుతున్నది అంతా గమనించి ముంబై క్రైమ్ బ్రాంచ్ ఎస్పీగా చెప్పబడిన నకిలీ వ్యక్తి స్క్రీన్ మీదకు రాగానే అతనితో మాట్లాడటానికి ప్రయత్నించగా రియల్ పోలీసులను చూసిన ఫేక్ పోలీస్ వెంటనే లైన్ కట్ చేసి ఆఫ్‌లైన్ కి వెళ్లిపోయారు.
డిజిటల్ అరెస్టు అనే పదమే లేదు: ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది, డిజిటల్ అరెస్ట్ అనే పదం కానీ పద్ధతి గాని ఎక్కడా లేదని ముంబై క్రైమ్ బ్రాంచ్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, కస్టమ్స్, సీబీఐల నుంచి మాట్లాడుతున్నాం మీ ఆధార్ కార్డు సిమ్ కార్డులు మనీ ల్యాండరింగ్ లో ఇరుక్కున్నాయి, లేదంటే డ్రగ్స్ రవాణాలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి, అని ఎవరైనా బెదిరిస్తే వెంటనే స్థానిక పోలీస్ వారికి గాని లేదా 1930 గాని రిపోర్ట్ చేయాలని ఈ సందర్భంగా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలియజేశారు.
"డిజిటల్ అరెస్ట్ అనే పదం కానీ పద్ధతి గాని ఎక్కడా లేదు. ముంబై క్రైమ్ బ్రాంచ్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, కస్టమ్స్, సీబీఐ ల నుంచి మాట్లాడుతున్నాం, మీ ఆధార్ కార్డు, సిమ్ కార్డులు మనీ లాండరింగ్‌లో ఇరుకున్నాయని ఫోన్ చేసి బెదిరిస్తే ఎవరూ నమ్మవద్దు. సహాయం కోసం 1930 కి లేదా స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయండి."-విద్యాసాగర్ నాయుడు,ఎస్పీ
"మీపై సుప్రీంకోర్టు నుంచి అరెస్ట్ వారెంట్ జారీ అయిందని చెప్పి మాకు ఫోన్ కాల్ వచ్చింది. అంతేకాకుండా సుప్రీంకోర్టు జడ్జిగా ఒకరిని వీడియో కాల్ మాట్లాడించి బ్యాంక్ అకౌంట్ల వివరాలు, స్థిర చరాస్తులు వివరాలన్నీ ఇవ్వాలని అన్నారు. ఈ విషయాలు ఎవరికీ చెప్పకూడదని చెబితే వెంటనే లోకల్ పోలీస్ వారు వచ్చి అరెస్ట్ చేసి ముంబై పంపిస్తారని మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేశారు. అయితే నకిలీ వ్యక్తి స్క్రీన్ మీదకు రాగానే అతనితో మాట్లాడటానికి ఎస్పీ ప్రయత్నించగా రియల్ పోలీసులను చూసిన ఫేక్ పోలీస్ వెంటనే లైన్ కట్ చేసి ఆఫ్‌లైన్ కి వెళ్లి పోయారు. మమ్మల్ని దీన్ని నుంచి రక్షించిన పోలీసులకు కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను"-శివశంకర్,బాధితుడు
విశ్రాంత ఉద్యోగులే టార్గెట్ - ఈడీ, సీబీఐ పేరుతో రూ.కోట్లు కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్లు
'నేరస్థుడి నుంచి మీకు రూ.30 లక్షలొచ్చాయి' - సైబర్ వలలో విశ్రాంత ఉపాధ్యాయుడు

