ETV Bharat / state

డబ్బులు కట్టండి విదేశాల్లో మంచి జాబ్​ గ్యారెంటీ - ఆఫర్​ ఇస్తే అనుమానించాల్సిందే!

హైదరాబాద్​లో నకిలీ కన్సల్టెన్సీల మాయాజాలం - గతేడాది రూ.200 కోట్లు మోసగాళ్ల పాలు - ఉద్యోగార్థులే లక్ష్యంగా నకిలీ కన్సల్టెన్సీల నయా మోసాలు

Fake Consultancies Scams in Hyderabad
Fake Consultancies Scams in Hyderabad (Eenadu)
author img

By ETV Bharat Telangana Team

Published : January 6, 2026 at 11:47 AM IST

|

Updated : January 6, 2026 at 12:48 PM IST

3 Min Read
Choose ETV Bharat

Fake Consultancies Scams in Hyderabad : ఉద్యోగం కోసం ఏళ్లు తరబడి ఎదురుచూసిన యువత, సోషల్​ మీడియాలో కనిపించే ఉద్యోగ ప్రకటనలకు ఆకర్షితులవుతున్నారు. ఆన్​లైన్​/ ఆఫ్​లైన్​లో వచ్చే ప్రకటనలు చూసి ఖరీదైన ప్రాంతాల్లో కార్యాలయాలు, తక్కువ సమయంలో విదేశాల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తామంటూ నకిలీ కన్సల్టెన్సీలు మోసాలకు పాల్పడుతున్నాయి. ఉద్యోగార్థులే లక్ష్యంగా నకిలీ కన్సల్టెన్సీలు నయా మోసాలకు తెరలేపాయి. వీరికి ఉద్యోగాల ఆశ చూపి, శిక్షణ పేరుతో వారి నుంచి రూ.లక్షల్లో డబ్బును వసూలు చేస్తున్నారు.

యువతకు అవగాహన సదస్సులు : సాఫ్ట్​వేర్​ ఉద్యోగాల్లో ఈ తరహా దారుణాలు చాలా పెరిగిపోయాయి. విదేశాలకు పంపిస్తామంటూ హామీలిచ్చి, ఆ తర్వాత నకిలీ కన్సల్టెన్సీలు చేతులెత్తేస్తున్నాయి. మరికొన్ని కన్సల్టెన్సీలు వర్క్​ పర్మిట్​ వీసాపై విదేశాలకు వెళ్లిన కొందరు సైబర్​, డ్రగ్స్​ ముఠాల చేతుల్లో బానిసలుగా మారుతున్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా మోసపోయి పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో మోసాలపై కఠిన చర్యలకు పోలీసు యంత్రాంగం సిద్ధమైంది. విద్యాసంస్థలు, శిక్షణా కేంద్రాలున్న ప్రాంతాల్లో సదస్సులు నిర్వహించి, యువతకు అవగాహన కల్పించనున్నారు. ఇలాంటి కేసుల్లో కొద్దిరోజులు కన్సల్టెన్సీల ఆఫీస్​ మూసివేస్తున్నారు. ఆ తర్వాత పేరు మార్చుకొని మరోచోట పాగా వేసి, మళ్లీ అదే తరహా మోసాలకు పాల్పడుతున్నారు.

  • అలాంటి ఘటనే హిమాయత్​నగర్​లోని జరిగింది. ఓ కన్సల్టెన్సీ నిర్వాహకులు వారంలోనే వీసాలు, పక్కా ప్లేస్​మెంట్​ ఇప్పిస్తామంటూ ఏజెంట్ల ద్వారా ప్రచారం చేయించారు. ఇలా వారు ఎటువంటి విద్యార్హతలు, అనుభవం లేకుండానే విదేశాల్లో కొలువులనగానే ఎంతోమంది పేర్లు రిజిస్ట్రేషన్​ చేసుకున్నారు. నకిలీ వీసాల పేరుతో అంటగట్టి 25 మంది నుంచి రూ.కోటి వరకు కాజేశారు.
  • చార్మినార్‌ ప్రాంతానికి చెందిన యువకుడు మెహిదీపట్నంలోని గ్లోబల్‌ హారిజన్స్‌ కన్సల్టెన్సీని సంప్రదించాడు. తను విదేశంలో చదివేందుకు ఉన్న అవకాశాల గురించి తెలుసుకున్నాడు. రూ.22.30 లక్షలు చెల్లిస్తే హంగేరి వీసాతో బుడాపెస్ట్‌ మెట్రోపాలిటన్‌ యూనివర్సిటీలో అడ్మిషన్‌ ఇప్పిస్తానని భరోసా ఇచ్చాడు. దాంతో తన తండ్రి విడతల వారీగా అడిగినంత చెల్లించాడు. కన్సల్టెన్సీ యజమాని నగదుకు రసీదు, యూనివర్సిటీ ఆఫర్‌ లెటర్‌ అందించాడు. కొన్నిరోజుల తర్వాత కన్సల్టెన్సీ ఆఫీస్​ మూసివేయడంతో బాధితుడు ఆరా తీయగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇదే తరహాలో మరో 20 మందిని మోసగించి రూ.కోటికిపైగా వసూలు చేసినట్లు బయటపడటంతో కేసును సీసీఎస్‌కు బదిలీ చేశారు.
  • ఇటీవల ఘటనలో తుర్కయాంజల్​కు చెందిన యువకుడు ఇన్​స్టాగ్రామ్​లో ఆస్ట్రేలియా, చైనా, జర్మనీ, న్యూజిలాండ్​ మాల్టా దేశాలకు వెళ్లేందుకు వర్క్​పర్మిట్​ ఇప్పిస్తామంటూ హిమాయత్​నగర్​లోని గ్రేట్​ స్కాలర్స్​ ఎడ్యుకేషన్​ ఎబ్రాడ్​ కన్సల్టెన్సీ ప్రకటనకు ఆకర్షితుడయ్యాడు. దీంతో వారికి రూ.8 లక్షల చెల్లించాడు. చివరికి నకిలీ పత్రాలు ఇవ్వడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

ఎలా మోసపోతున్నారంటే? : అమీర్‌పేట్, మాదాపూర్, ఎస్సార్‌నగర్, అబిడ్స్, నారాయణగూడ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కూకట్‌పల్లి వంటి పరిసర ప్రాంతాల్లో కార్యాలయాలు ప్రారంభిస్తారు. మొదట కమీషన్​ ఇస్తామని కొందరు ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంటారు. ఇన్​స్టాగ్రామ్​, స్నాప్​చాట్​, టెలిగ్రామ్​, ఫేస్​బుక్​ల్లో విదేశాల్లో ఉద్యోగాల పేరిట ప్రకటనలిస్తారు. ఆ తర్వాత నిజమని భావించి వెళ్లిన అభ్యర్థులను ఇంటర్వ్యూ చేస్తారు. రిజిస్ట్రేషన్​ ఫీజులు వసూలు చేస్తారు. గల్ఫ్​ దేశాలకు పంపే వారికి విజిటింగ్​, టూరిస్ట్ ​వీసాలు అంటగడతారు. అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్​ తదితర దేశాలకు వెళ్లాలనుకునే వారికి నకిలీ వర్క్​పర్మిట్​లు, జాబ్​ ఆఫర్​ లెటర్లు చేతికిస్తారు. గత సంవత్సరం నకిలీల బారిన పడిన 750 మంది బాధితులు సుమారు రూ.200 కోట్లు పోగొట్టుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

''సోషల్​ మీడియాలో, యూట్యూబ్​ల్లో పోస్ట్​ చేసే ప్రకటనలను ధ్రువీకరించుకోవాలి. ఆయా కన్సల్టెన్సీలపై ఏమైనా పోలీసు కేసులున్నాయనేది పరిశీలించాలి. ఇమ్మిగ్రేషన్​ వెబ్​సైట్​ ద్వారా కన్సలెన్సీలు అందించిన జాబ్ ​లెటర్​, స్పాన్సర్​షిప్​ సర్టిఫికెట్లను ధ్రువీకరించుకోవాలి. ఇంతకముందు అక్కడ నుంచి ఉద్యోగం పొందిన వారికి ఫోన్​ చేసి నిర్ధారించుకున్నాకే నిర్ణయం తీసుకోవడం మంచిది.'' - ఎం.శ్రీనివాసులు, అదనపు సీపీ, నగర సీసీఎస్​

ఇన్వెస్ట్​మెంట్ డబుల్ చేస్తామంటే నమ్మకండి - హైదరాబాద్ సైబర్ సెల్ అలర్ట్

ఆఫర్​ చూసి ఆగకుండా కొనేస్తున్నారా? - ఆ డిస్కౌంట్స్​ అన్నీ నిజమైనవి కాకపోవచ్చు!

Last Updated : January 6, 2026 at 12:48 PM IST