నకిలీ లేఖలతో మోసాలు - తిరుమల వచ్చి ఇబ్బందులు పడుతున్న భక్తులు
శ్రీవారి దర్శనం, శ్రీవారిసేవా టికెట్లు, లడ్డూప్రసాదం, వసతి గదులు ఇప్పిస్తామంటూ భక్తుల నుంచి భారీగా నగదు వసూలు చేస్తున్న దళారులు - ఈ తరహా మోసాలకు పాల్పడుతున్న వారిపై ప్రత్యేకంగా నిఘా పెట్టిన టీటీడీ

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 28, 2025 at 7:41 AM IST
|Updated : December 28, 2025 at 8:39 AM IST
Frauds With Fake Recommendation Letters in Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం, శ్రీవారిసేవా టికెట్లు, లడ్డూప్రసాదం, వసతి గదులు ఇప్పిస్తామంటూ కొంతమంది దళారులు భక్తుల నుంచి భారీగా నగదు వసూలు చేస్తున్నారు. కొందరు తాము ప్రజాప్రతినిధులు, టీటీడీ ఉన్నతాధికారులకు తెలిసిన వారమంటూ నకిలీ సిఫార్సు లేఖలు ఇచ్చి మోసగిస్తున్నారు. ఆ లేఖలతో శ్రీవారి దర్శనానికి వస్తున్న భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో టీటీడీ అదనపు ఈవో కార్యాలయంలో అటువంటి వాటిని గుర్తించేందుకు వీలుగా చర్యలు చేపట్టింది. ఈ తరహా మోసాలకు పాల్పడుతున్న వారిపై ప్రత్యేకంగా నిఘా పెడుతున్నారు.
శ్రీవారి దర్శనం, వసతి పేరుతో నకిలీ వెబ్‌సైట్లు తయారు చేసి సైబర్ నేరగాళ్లు భక్తుల నుంచి నగదు దోచుకుంటున్నారు. ఇలాంటి ఘటనలపై పలు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటి కట్టడికి టీటీడీ ఐటీ విభాగం, పోలీసులు, సైబర్ క్రైమ్ విభాగం పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నాయి. ఎప్పటికప్పుడు నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపుతున్నారు.
కేసుల నమోదు ఇలా: 2025లో నవంబరు వరకు తిరుమల వన్‌టౌన్ పరిధిలో 11 కేసులు నమోదు చేసి 20 మందిని, టూటౌన్ పరిధిలో 28 కేసులు నమోదు చేసి 41 మందిని అరెస్టు చేశారు. వారిలో పలువురికి కోర్టు శిక్షలు విధించింది.
ఇటీవలి ఘటనలు పరిశీలిస్తే: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పేరుతో నకిలీ సిఫార్సు లేఖలు తయారుచేసి భక్తులను మోసగిస్తున్న నాయుడుపేటకు చెందిన బల్లి ప్రవీణ్ కుమార్, చెంచు బాలాజీలను తిరుమల టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. శ్రీవారి దర్శనం ఇప్పిస్తామని భక్తులను మోసగిస్తున్న టీటీడీ ఉద్యోగి మాలే శంకరయ్యను అదుపులోకి తీసుకున్నారు.
అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే ఆశ్రయించాలి: భక్తులు దళారులు, సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా టీటీడీ అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in ను ఆశ్రయించి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవచ్చని తిరుమల టూటౌన్ సీఐ శ్రీరాముడు తెలిపారు. లేకుంటే ఆఫ్‌లైన్‌లో విష్ణునివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్‌లో ఉచిత సర్వదర్శనం టైమ్‌స్లాట్ టోకెన్లను రోజూ తిరుపతిలో పొందొచ్చని కుదరకపోతే తిరుమలకు చేరుకుని నేరుగా సర్వదర్శనం క్యూలైన్‌లోకి వెళ్లొచ్చని అన్నారు. దర్శనం కల్పిస్తామని ఎవరైనా నగదు అడిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ సూచించారు.
దళారుల సమాచారం ఇవ్వాల్సిన నంబర్లు:
- తిరుమల వన్‌టౌన్ పీఎస్: 94407 96769
- టూటౌన్ పీఎస్: 94407 96772
- టీటీడీ విజిలెన్స్ టోల్‌ఫ్రీ 18004254141
తిరుమల వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాట్లు: మరోవైపు తిరుమల వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. స్వామివారిని వైకుంఠ ద్వార దర్శనంలో దర్శించుకోవాలని భక్తులు కోరుకుంటారు. అయితే ఈసారి టీటీడీ మొదటి 3 రోజులు దర్శనానికి భక్తులను లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేసింది. ఈ మూడు రోజులు లక్కీ డిప్లో టోకెన్లు పొందిన వారికి మాత్రమే దర్శనం కల్పించనున్నారు. వచ్చే నెల 2వ తేదీ నుంచి మాత్రం రూ.300తో టోకెన్లు పొందిన వారు, సామాన్య భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చని అధికారులు తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనాల్లో తొలి 3 రోజులు రూ.300 దర్శనం టిక్కెట్లలతో పాటు శ్రీవాణి దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా అన్ని రకాల సిఫార్సు దర్శనాలు రద్దు చేస్తున్నట్లు పేర్కొంది.
ఏడుకొండల్లో కనిపించే గోపురాలు, జాలువారే జలపాతాలు - ఇంట్లోనే తిరుమల అనుభూతి
గ్లోబల్ బ్రాండ్‌గా తిరుమల - విదేశాల్లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి 3 నమూనాలు సిద్ధం

