ETV Bharat / state

రూ.1500 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా యత్నం : డీసీపీ

గండిపేటలో రూ.1500 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం - కీలకంగా వ్యవహరించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు - కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్ట్​ చేసిన పోలీసులు

bolla brahmanaidu
Government Land Kabja in Gandipet (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 30, 2026 at 10:07 AM IST

|

Updated : May 30, 2026 at 10:38 AM IST

4 Min Read
Choose ETV Bharat

Government Land Kabja in Gandipet : హైదరాబాద్ శివార్లలోని భూముల ధరలకు రెక్కలు రావడంతో అక్రమార్కులు ప్రభుత్వ భూమిపై కన్నేసి కోర్టుకు సైతం నకిలీ డాక్యుమెంట్లు చూపించి రూ.1500 కోట్లకు పైగా ఉన్న ప్రభుత్వ భూమిని కాజేసేందుకు యత్నించారు. రంగారెడ్డి జిల్లా గండిపేటలో జరిగిన ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైఎస్సార్​సీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కీలకంగా వ్యవహరించడం కలకలం రేపుతోంది. ఆక్రమించుకున్న వారికి సహకరిస్తూ, ప్రభుత్వ భూమిని రెగ్యులరైజ్‌ చేయిస్తానంటూ హామీలు ఇచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. నకిలీ ప్రభుత్వ ఉత్తర్వులు, ఫోర్జరీ పత్రాలు, రూ.కోట్ల లావాదేవీలతో సాగిన ఈ భూ దందాపై సైబరాబాద్‌ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు, పరారీలో ఉన్న కీలక నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.

రంగారెడ్డి జిల్లా గండిపేట గ్రామంలోని సర్వే నంబర్ 18లో 104.25 కుంటల ప్రభుత్వ భూమి ఉంది. 1954 నుంచి ఇది ప్రభుత్వ భూమిగానే ఉంది. అదే గ్రామానికి చెందిన నిమ్మల దశరథ్ కుటుంబసభ్యులు సుమారు 10 ఎకరాలు తమకే వస్తుందని చెప్పి ఆ స్థలాన్ని ఆక్రమించారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ శాఖ అధికారులు అతడిని అక్కడి నుంచి ఖాళీ చేయించాలని భావించారు. దీంతో దశరధ్ కుటుంబసభ్యులైన నిమ్మల రాజేశ్​ గౌడ్, నిమ్మల వేణుగోపాల్, నిమ్మల రామస్వామి, మంగా, నాగేశ్వర్‌రావులు ఆ భూమి తమదేనని 2012లో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణలో ఉండగానే, రుద్రరాజు రామకృష్ణరాజు అనే మరో వ్యక్తికి దశరథ్ భూమిని అగ్రిమెంట్ చేశారు. దీంతో అక్కడ ఓ గదిని ఏర్పాటు చేసిన రామకృష్ణరాజు విజయవాడ నుంచి సునీల్ అనే వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ ఇల్లు కట్టించి ఉంచాడు.

వాట్సాప్​లో జీవో కాపీలు : కొన్నాళ్లకు అది ప్రభుత్వ భూమి అని తెలియడంతో దాన్ని వదులుకున్నాడు. సునీల్ అనే వ్యక్తికి కూడా రామకృష్ణరాజు అందుబాటులోకి రాలేదు. విషయం తెలుసుకున్న నిమ్మల కుటంబం ఆ భూమిని తమ ఆధీనంలోనే ఉంచుకునేందుకు ప్రయత్నించారు. గతేడాది అక్టోబర్​లో దశరధ్ కుటుంబసభ్యులు వేసిన రిట్‌ పిటిషన్​ను కోర్టు కొట్టివేసింది. అనంతరం అధికారులు అక్కడ ఉంటున్న సునీల్​ను ఖాళీ చేయించి ఇల్లు కూల్చేశారు. ఇల్లు కూల్చివేసి ఖాళీ చేయించినా, నిందితులు భూమిపై కన్నేసే ఉంచారు. కొన్ని రోజుల నుంచి ఆ సర్వే నంబర్​లోని 9.25 కుంటల భూమిని ప్రభుత్వం ఐదుగురికి ఇచ్చినట్లు జీవో కాపీలు ప్రత్యక్షం అయ్యాయి. గండిపేటకు చెందిన నిమ్మల రాజేశ్​ గౌడ్, నిమ్మల వేణుగోపాల్, నిమ్మల రామస్వామి, మంగా, నాగేశ్వర్‌రావు పేర్లపై జీవోలు వాట్సాప్ గ్రూప్‌లో ప్రచారం చేశారు.

వీటిని గమనించిన గండిపేట మండల తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కోర్టు అనుమతితో నిమ్మల కుటుంబసభ్యుల ఇళ్లలో సోదాలు చేశారు. సోదాల్లో భాగంగా పలు కీలక డాక్యుమెంట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గతేడాది అక్టోబర్ 30న అంటే కోర్టు రిట్‌ పిటిషన్​ను కొట్టివేసిన కొన్ని రోజులకే నిమ్మల కుటుంబం బొల్లా రమేశ్​ అనే వ్యక్తితో ఆ భూమి డెవలప్​మెంట్ కింద రూ.3.5 కోట్లకు ఒప్పందం చేసుకున్నట్లు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ వినుకొండ మాజీ వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆ భూమిని రెగ్యులరైజ్ చేపిస్తానని చెప్పాడని పోలీసులు వివరించారు.

గండిపేటలోని భూమిని ప్రభుత్వం క్రమబద్ధీకరించిందంటూ నకిలీ జీవోలు సృష్టించి వాట్సాప్​​లో వైరల్ చేశారు. తహసీల్దార్​ ఫిర్యాదుతో నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. నకిలీ పత్రాలు తయారు చేసిన వేణు గోపాల్‌, నిమ్మల రాజేశ్​గౌడ్‌, సాయి కిరణ్‌లను అరెస్ట్‌ చేశాం. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మ నాయుడు, బొల్లా రమేశ్‌ పరారీలో ఉన్నారు. బ్రహ్మ నాయుడి ఖాతా నుంచి రెండు విడతల్లో రూ.1.25 కోట్లు ట్రాన్స్‌ఫర్‌ అయినట్లు గుర్తించాం. బొల్లాపై నార్సింగి పోలీస్​స్టేషన్​లో కేసు నమోదు చేశాం. - సీహెచ్​ శ్రీనివాస్​, శేరిలింగంపల్లి డీసీపీ

సచివాలయంలో అసిస్టెంట్ కలెక్టర్​నంటూ నమ్మించి : తన ఖాతా నుంచి నిమ్మల కుటుంబంలోని ఒక ఖాతాకు రూ.కోటి, మరో ఖాతాకు రూ.25 లక్షలు బదిలీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. మిగితా డబ్బు నిమ్మల కుటుంబలోని మరికొందరికి బొల్లా రమేశ్​ బదిలీ చేసినట్ల పోలీసులు తెలిపారు. ఈ మొత్తం వ్యవహారానికి రాధాకృష్ణ అనే వ్యక్తి మధ్యవర్తిత్వం చేసినట్లు గుర్తించారు. సూర్యాపేటకు చెందిన రాధాకృష్ణ అనే వ్యక్తి సచివాలయంలో అసిస్టెంట్ కలెక్టర్​గా పని చేస్తున్నానని అందరినీ నమ్మించినట్లు వెల్లడించారు.

ఈ కేసులో ఇప్పటి వరకు నిమ్మల రాజేష్ గౌడ్, నిమ్మల వేణుగోపాల్‌, నిమ్మల సాయికిరణ్​లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, బొల్లా రమేశ్​, సునీల్, రాధాకృష్ణ సహా మరికొందరిని పట్టుకునేందుకు నాలుగు పోలీస్ బృందాలు ఏర్పాటు చేసినట్లు డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. నకిలీ ప్రభుత్వ ఉత్తర్వులు, ఫోర్జరీ భూ పత్రాలు, ధ్రువీకరణ లేని వాట్సాప్ సోషల్ మీడియా సందేశాలను నమ్మవద్దని సైబరాబాద్ పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు. భూముల కొనుగోలు లేదా లావాదేవీలకు ముందు సంబంధిత రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల వద్ద పూర్తి ధ్రువీకరణ చేసుకోవాలని కోరుతున్నారు.

'వకీల్‌సాబ్​' గుప్పిట్లో వందల ఎకరాల ప్రభుత్వ భూమి! - హైడ్రా ఆపరేషన్ అమీన్‌పూర్​తో వెలుగులోకి

రూ.500 కోట్ల భూమిని హాం ఫట్​ చేసేందుకు మాస్టర్​ ప్లాన్ - తీగ లాగితే రియల్టర్ల డొంక కదిలింది

Last Updated : May 30, 2026 at 10:38 AM IST