ETV Bharat / state

శాస్త్రవిజ్ఞానం ప్రజల ముంగిట చేరాలి - సైన్స్​కు ఆదరణ, అవగాహన పెరగాలి : వెంకయ్యనాయుడు

హైదరాబాద్​లో ల్యాబ్‌ టూ సొసైటీ రోల్‌ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ ఇన్‌ బిల్డింగ్ వికసిత్ భారత్ @2047 సదస్సు - ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

Venkaiah Naidu on Science and Technology Devt
Venkaiah Naidu on Science and Technology Devt (ETV)
author img

By ETV Bharat Telangana Team

Published : January 8, 2026 at 12:20 PM IST

|

Updated : January 8, 2026 at 2:25 PM IST

4 Min Read
Choose ETV Bharat

Venkaiah Naidu on Science and Technology : సమాజం కోసం ఆలోచించడం, పని చేయడం ‘ఈనాడు’ డీఎన్‌ఏలోనే ఉందని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. శాస్త్రీయ అంశాలకు పత్రికలో ప్రముఖ స్థానం కల్పిస్తోందని ఆయన ప్రశంసించారు. తెలుగు పత్రికా రంగంలో విప్లవాన్ని సృష్టించిన రామోజీరావు ఒక ధ్రువతార అని వెంకయ్యనాయుడు కొనియాడారు. హైదరాబాద్​ నగరంలోని బీఎం బిర్లా సైన్స్‌ సెంటర్‌లో ‘ఈనాడు’ గ్రూప్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ల్యాబ్‌ టూ సొసైటీ-రోల్‌ ఆఫ్‌ సైన్స్‌ కమ్యూనికేషన్‌ ఇన్‌ బిల్డింగ్‌ వీబీ-2047’ కార్యక్రమానికి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

అంకితభావం, దూరదృష్టి రామోజీరావు సొంతం : క్రమశిక్షణ, అంకితభావం, దూరదృష్టి రామోజీరావు సొంతమని వెంకయ్యనాయుడు తెలిపారు. తెలుగు పాఠకులకు శాస్త్ర విజ్ఞానాన్ని అందించాలని ఆయన ఎంతో తాపత్రయపడ్డారని గుర్తుచేశారు. సమాజంలో శాస్త్ర, సాంకేతికతపై నమ్మకాన్ని పెంపొందించడం మరింత అవసరమన్న ఆయన, శాస్త్రీయ విజ్ఞానాన్ని ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా చేరవేయాలని పిలుపునిచ్చారు. సమాజంలో శాస్త్ర, సాంకేతికతపై నమ్మకాన్ని పెంపొందించాలన్నారు.

శాస్త్రవిజ్ఞానం ప్రజల ముంగిట చేరాలి - సైన్స్​కు ఆదరణ, అవగాహన పెరగాలి : వెంకయ్యనాయుడు (ETV)

దీనిపై అవగాహన పెంచే బాధ్యత శాస్త్రవేత్తలు, నిపుణులు తీసుకోవాల్సిన అవసరముందని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. శాస్త్రవిజ్ఞానం నాలుగు గోడల మధ్యే ఆగిపోకూడదని, ప్రజలకు చేరాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల్లో సైన్స్‌పై ఉత్సుకతను మరింత పెంచాలని ఆయన కోరారు. క్లిష్టమైన సైన్స్‌ అంశాలను సాధారణ ప్రజలకు అర్థమయ్యే విధంగా ‘ఈనాడు’లో జ్ఞాననేత్రం శీర్షికన ప్రచురిస్తున్నారన్నారని తెలిపారు. సైన్స్‌పై ఎంత ఆదరణ పెంచగలిగితే ఆ రంగంలో దేశం అంత ముందుంటుందన్నారు.

శాస్త్ర విజ్ఞానంలో అగ్రస్థానంలో ఉండాలన్నదే లక్ష్యం : మన దేశంలో మేధస్సుకు కొదవ లేదని, రామానుజం, శకుంతలా దేవి, సీవీ రామన్‌ వంటి ప్రముఖులు దేశ కీర్తిని విశ్వవ్యాప్తం చేశారని వెంకయ్యనాయుడు తెలిపారు. అబ్దుల్‌ కలాం వంటి మహానుభావులు స్వదేశీ పరిజ్ఞానంతో ఉపగ్రహాలు, క్షిపణులను తక్కువ ఖర్చుతో అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు ఎగుమతి చేసే స్థాయికి మనం చేరుకోవడం సంతోషించదగ్గ విషయమన్న ఆయన, శాస్త్ర విజ్ఞానంలో అగ్రస్థానంలో భారత్‌ ఉండాలన్నదే మన లక్ష్యమన్నారు. మానవ జీవన నాణ్యత పెంచడంలో శాస్త్ర సాంకేతికత పాత్ర చాలా కీలకమైనదని వివరించారు. ఈ రంగంలో దూసుకెళ్లేందుకు ప్రైవేటు సంస్థలు చాలా కీలకంగా వ్యవహరిస్తున్నాయని చెప్పారు. హరిత విప్లవ పితామహుడు ఎం.ఎస్‌.స్వామినాథన్‌ కృషి వల్లే ఆహార రంగంలో భారత్‌ స్వయంసమృద్ధిని సాధించిందన్నారు.

"ఈ రోజుల్లో ఏఐ గురించి విస్తృతంగా మాట్లాడుకుంటున్నాం. ఏఐ పరిజ్ఞానం వెనుక కీలక పాత్ర పోషించేది డేటా సైన్స్​. వివిధ గణాంక నమూనాలకు ఆధారం కల్యంపూడి రాధాకృష్ణరావు పరిశోధనలే. ప్రచారం లభించకపోయినా తెరవెనక ఉండి ఎంతోమంది భారతీయ శాస్త్రవేత్తల కృషిని స్మరించుకోవాలి. ఎల్లాప్రగడ సుబ్బారావు లాంటి మహానీయులు చేసిన కృషిని గుర్తుచేసుకుంటూ ఉండాలి. అలాంటి గొప్పవారు చేసిన కృషిని మనం ప్రోత్సహిస్తూ ఉండాలి. వారి నుంచి స్ఫూర్తిని పొందేందుకు యువతను ప్రోత్సహించాలి. మన మేధస్సును వ్యవస్థీకృతం చేయాలి. అది ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్లనే మనం పరిశోధన పత్రాల విషయంలో వెనకబడ్డాం. మనకు ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. పరిశోధనల దిశగా మరింత ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది"- వెంకయ్యనాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి

ప్రతి శాస్త్రవేత్త ప్రధాన లక్ష్యం ప్రజాహితమే : ఎంఎస్​ స్వామినాథన్ రీసెర్చ్​ ఫౌండేషన్​ ఛైర్​పర్సన్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ ముందుకెళ్తోంది అని అన్నారు. సైన్స్​ అంటే కేవలం ల్యాబ్​లో చేసే పరిక్షలు కావని సమాజానికి అత్యంత అవసరమైన అంశమని తెలిపారు. సైన్స్​ వ్యాప్తికి సోషల్​ లిజనింగ్ ముఖ్యమైన అంశమని చెప్పారు. వికసిత్ భారత్ కోసం ముూడు పనులు చేయాలన్నారు. వాటిలో మొదటిది వినడం, రెండోది విశ్వసనీయత ఉన్న వ్యక్తులచే మేసేజింగ్, క్షేత్రస్థాయి పనితీరు అని వివరించారు.

"మానవ మెదడు మొదటి ఐదేళ్లలో బాగా వృద్ధి చెందుతుంది. ఆ సమయంలో పోషకాహారం చాలా కీలకం. పిల్లలు, యువత పోషకాహార లోపంతో ఉండకూడదు. దీనిపై అవగాహన చాలా తక్కువగా ఉంది. పాలసీ మేకర్స్​తో శాస్త్రవేత్తలు సంయుక్త విషయ విశ్లేషణ చేయాలి. ప్రతీ శాస్త్రవేత్త ప్రధాన లక్ష్యం ప్రజా హితమే. జర్నలిస్టులు కూడా క్యూరియస్ గా ఉండాలి"-డాక్టర్ సౌమ్య స్వామినాథన్, ఎంఎస్​ స్వామినాథన్ రిసెర్చ్​ ఫౌండేషన్​ ఛైర్​పర్సన్

గడిచిన 51 ఏళ్లుగా ఈనాడు పత్రిక శాస్త్ర విజ్ఞానాన్ని జనాలకు అందించడంలో ఈనాడు దినపత్రిక తమ వంతు పాత్ర పోషిస్తోందని ‘ఈనాడు’ ఆంధ్రప్రదేశ్​ ఎడిటర్‌ ఎం.నాగేశ్వరరావు తెలిపారు. ఈనాడుతో పాటు ఈటీవీ, ఈటీవీ భారత్, ఈనాడు డిజిటల్, ఈనాడు రేడియో విభాగం కూడా శాస్త్రీయ అంశాలను కవర్ చేయడంలో ముందుటాయని పేర్కొన్నారు. ఇలాంటి సైన్స్‌ పండుగలో తాము కూడా భాగమవ్వడం సంతోషంగా ఉందని తెలిపారు. భారత్ సైన్స్​కి పవర్‌ హౌస్‌ అన్న ఆయన మాతృభాషలో సైన్స్‌ బోధనను సమర్ధించారు.

ఈ కార్యక్రమంలో ఏఎస్‌టీసీ గౌరవ అధ్యక్షుడు డా.ఆర్‌బీఎన్‌ ప్రసాద్‌, ఎస్‌ఏసీ-ఏఎస్‌టీసీ ఛైర్మన్‌ డా.సీహెచ్‌ మోహన్‌రావు, డబ్ల్యూహెచ్‌వో మాజీ శాస్త్రవేత్త డా.సౌమ్యా స్వామినాథన్‌, అనంత్‌ టెక్నాలజీస్‌ సీఎండీ డా.పావులూరి సుబ్బారావు, సీఎస్‌ఐఆర్‌ డైరెక్టర్‌ డా.డి.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రారంభ సమావేశం తర్వాత పలువురు ప్రముఖులతో ప్యానల్ డిస్కషన్స్ జరిగాయి. కాగా శాస్త్రీయ విజ్ఞానం పట్ల ప్రజల్లో మరింత అవగాహన కలిగితే 2047 వికసిత్ భారత్​లో సైన్స్‌ పాత్ర కీలకంగా ఉంటుందని ప్రముఖులు అభిప్రాయపడ్డారు.

భారత్​ శరవేగంగా ముందుకు దూసుకుపోతోంది : వెంకయ్యనాయుడు - Prof CR Rao Birth Celebrations

'వివిధ భాషల్లో విద్యాబోధనకు కేంద్రం చొరవ సంతోషకరం'

Last Updated : January 8, 2026 at 2:25 PM IST