'బ్యారెల్ ధర 100డాలర్లు దాటితే 1991 గల్ఫ్వార్ పరిస్థితులు రావడం ఖాయం!'
ఐదు దశాబ్దాల క్రితం మొదలైన ఇరాన్-ఇజ్రాయెల్ వివాదం - ఇరాన్ అణ్వాయుధాలు సమకూర్చుకుంటే గల్ఫ్‌లో అశాంతి తలెత్తుతుందని భయం - ఈ కారణంతోనే ఇరాన్‌పై అమెరికాతో కలిసి దాడి

Published : March 3, 2026 at 6:50 PM IST
Experts On Iran War Issue Telugu : ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ కలిసి యుద్ధం చేస్తున్నప్పటికీ అంతిమ లక్ష్యాలు వేర్వేరుగా ఉన్నాయని ఐక్యరాజ్యసమితి మాజీ పొలిటికల్ అఫైర్స్ ఆఫీసర్ జి.రాజా కార్తికేయ తెలిపారు. ఇరాన్లో ప్రస్తుత పాలనపై స్థానిక ప్రజల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ ఎలాంటి మార్పు ఉండాలనే అంశంపై ఏకాభిప్రాయం లేదన్నారు. ఇరాన్‌పై యూఎస్-ఇజ్రాయిల్ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని భావించడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్‌కు ఇరాన్, ఇజ్రాయిల్ రెండు దేశాలతోనూ మంచి సంబంధాలే ఉన్నాయన్నారు.
గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేస్తున్నందున చమురు సరఫరా విషయంలో భారత్‌పై కూడా ప్రభావం ఉంటుందని రాజా కార్తీకేయ అన్నారు. ఐక్యరాజ్యసమితి అధికారిగా ఇరాన్లో సుమారు మూడేళ్ల పాటు విధులు నిర్వర్తించి రెండు వారాల క్రితమే భారత్‌కు వచ్చిన రాజా కార్తికేయ యుద్ధానికి దారి తీసిన పరిస్థితులు, అమెరికా ఎందుకు జోక్యం చేసుకుంది ఐక్యరాజ్య సమితి పాత్ర ఏమిటి వంటి అంశాలపై ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు.
ఈ యుద్ధం రావడానికి కారణాలేంటి?
ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాల సంబంధానికి దశాబ్దాల చరిత్ర ఉంది. 1979లో ఇరాన్ రాజు షా రెజాను ఇస్లామిక్ విప్లవం ద్వారా తొలగించారు. ఇందుకోసం అక్కడ అనేక రాజకీయ పార్టీలు పనిచేశాయి. తరువాత అవి ప్రజల్లో ఐకమత్యాన్ని నింపేందుకు పాలస్తీనాకు మద్దతు అనే కారణాన్ని తీసుకున్నాయి. 1947లో పాలస్తీనా నుంచి బ్రిటిష్‌వారు వెళ్లిపోయిన సమయంలో ఈ ప్రాంతాన్ని రెండు దేశాలుగా ఏర్పాటు చేసేలా ఐక్యరాజ్యసమితి చెప్పింది. అయితే పాలస్తీనా పూర్తిగా ఏర్పాటు కాలేదు.
1967 తర్వాత జోర్డాన్, ఈజిప్ట్‌ను ఓడించి పాలస్తీనియన్లు ఎక్కువగా ఉండే ప్రాంతాలను వెస్ట్‌బ్యాంక్, గాజాను ఇజ్రాయెల్ ఆక్రమించింది. పాలస్తీనియన్లు స్వాతంత్య్రం కోసం పోరాటం చేసేందుకు కొత్త సాయుధ దళాలు ఏర్పడ్డాయి. ఖమేనీ ఈ దళాలకు మద్దతిచ్చారు. దీంతో ఇజ్రాయెల్ ఇరాన్‌తోనూ శత్రుత్వం పెంచుకుంది.
అమెరికానే ప్రత్యక్షంగా ఎందుకు యుద్ధం చేస్తోంది?
1979లో జరిగిన విప్లవంలో భాగంగా అమెరికా దౌత్య కార్యాలయాన్ని ధ్వంసం చేసి 400 రోజులు వారిని బంధీలుగా చేశారు. 1980 తర్వాత అమెరికాకు ఇరాన్‌కు దౌత్య సంబంధాలు లేవు. అయితే 2001లో ఇరాన్ నుంచి తాలిబన్లను తరిమి వేయడానికి అమెరికాకు మద్దతు పలికింది. కొంతకాలం పరిస్థితులు చల్లారినా పాత కక్షలు అలానే ఉండిపోయాయి.
ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి తన దేశానికి శత్రువులుగా ఉన్న దేశాలను ఒక దానితర్వాత మరొకటిగా సమస్యలను పరిష్కరించాలనే ఆలోచనలో ఉన్నారు. అమెరికాకు ఇజ్రాయెల్ చాలా కీలకం. కాగా గతసంవత్సరం ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడి చేసింది. ఈ సంవత్సరం దాడిలో అమెరికా ప్రత్యక్షంగా పాల్గొంది. ఈ దేశాల మధ్య స్నేహసంబంధమే యుద్ధానికి కారణంగా చెప్పవచ్చు.
ఇప్పుడు జరుగుతున్న యుద్ధం ప్రధాన లక్ష్యం ఏమిటి ?
ఈ యద్ధానికి ప్రధాన లక్ష్యాలు, ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తోందని అమెరికా చెప్పుకొచ్చింది. ఇరాన్ క్షిపణుల రేంజి తగ్గించాలని అమెరికా పలుమార్లు కోరింది. ఇరాన్లో మానవ హక్కుల సమస్యలను రూపుమాపాలనే లక్ష్యంతో దాడులు చేశామని అమెరికా వెల్లడించింది. నిజానికి ఇరాన్ ప్రభుత్వంతో పాటు పూర్తి వ్యవస్థ మారాలనేదే అమెరికా లక్ష్యం. ఈ యుద్ధం కారణం తనకు వ్యతిరేకంగా ఉండే గ్రూపులను పూర్తిగా తొలగించవచ్చన్నది ఇజ్రాయెల్ లక్ష్యం.
ఇరాన్ ప్రజల ఆలోచన ఏవిధంగా ఉంది?
ఇరాన్ జనాభా దాదాపు 9 కోట్లు. వారిలో కొంతమంది మధ్యతరగతి కుటుంబాలవారు ఖమేనీ పాలకు మద్దతుగా ఉంటున్నారు. మరికొంత మంది వ్యతిరేకంగా ఉంటారు. ముఖ్యంలో జనవరిలో జరిగిన నిరసనలతో పాటు గతంలోనూ చాలా సార్లు ఖమేనీకి వ్యతిరేకంగా ఉద్యమాలు వచ్చాయి. ఇరాన్‌లోని రాజకీయ వ్యవస్థ కారణంగా ప్రజలకు కొన్ని రకాల హక్కులు లేవు. న్యాయ వ్యవస్థలో సాక్ష్యంలో స్త్రీలకు పురుషులతో సమాన హక్కులు లేవు. ఇక్కడ ఇల్లు కొనుక్కోవాలంటే సుమారు 100 ఏళ్ల ఆదాయాన్ని వెచ్చించాల్సి వస్తోంది. దీంతో చాలా మంది యువత వివాహం చేసుకోవడానికి నిరాకరిస్తున్నారు. పిల్లలు కనడాన్ని ఆర్థిక భారంగా భావిస్తున్నారు. ఇలాంటి కారణాలు ఉండటంతో ఈ విధానం మారాలని ప్రజలు కోరుకుంటున్నారు. అయితే కొత్తగా ఏ విధానాన్ని అవలంభించాలనే విషయంపై ఎవరికీ స్పష్టత లేదు.
అమెరికాను ఢీకొట్టే శక్తి ఇరాన్‌కు ఉందా?
ఈ ప్రాంతంలో ఇరాన్ సైనిక బలం చాలా శక్తివంతమైనదని, విస్తీర్ణ పరంగా పెద్దది. చమురు నిల్వల పరంగా అనేక అనుకూల అంశాలు ఉన్నాయి. దీనితో పాటు జాతీయ భద్రతకు ఎక్కువగానే ఖర్చుచేస్తుంది. ఇరాన్ సైన్యం వద్ద మిసైళ్లు, శాటిలైట్లు ఉన్నాయి. అమెరికా అంచనా ప్రకారం మరో నెలరోజుల్లో ఈ యుద్ధం ముగుస్తుంది. గల్ప్ దేశాలలో సుమారు 51 వేల మంది అమెరికన్ సైనికులు వివిధ స్థావరాలలో ఉన్నారు.
ఈ యుద్ధం చమురు సరఫరాపై ఏ విధమైన ప్రభావం చూపనుంది?
యూఏఈ, ఒమన్ ఉండే ప్రాంతంలో స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ఉంది. ప్రపంచంలో 16 శాతం చమురు ఈ ప్రాంతం ద్వారానే సరఫరా అవుతుంది. ఈ యుద్ధం కారణంగా దీనిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. దీంతో బ్యారల్ క్రూడ్ఆయిల్ ధర 68 నుంచి 75 అమెరికన్ డాలర్లకు చేరింది. ఈ విలువ 100 డాలర్లు దాటినా అందరిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. 1991 గల్ఫ్ వార్ సమయంలో చమురు విలువ పెరిగి, విదేశీ మారద నిల్వల కొరత ఏర్పడటంతో వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. ఇదే పరిస్థితులు మళ్లీ ఎదురయ్యే అవకాశం ఉంది.
భారత్ వైఖరి ఈ విషయంలో ఏ రకంగా వ్యవహరిస్తోంది?
ఇరాన్, ఇజ్రాయిల్ దేశాలతో భారత్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ కార్గిల్ యుద్ధంలో మనకు సాయం చేసింది. గత రెండు దశాబ్దాలుగా భారత్ ఇజ్రాయెల్ సంబంధం పెరిగింది. ఇటీవల ప్రధాన మంత్రి ఆదేశంలో పర్యటించిన విషయం తెలిసిందే.
అనేక అంతర్జాతీయ సదస్సులలో కశ్మీర్ విషయంలో ఇరాన్ మనకు మద్దతుగా నిలిచింది. ఈ దేశంలోని చాబహార్ పోర్ట్‌ను పదేళ్ల పాటు లీజుకు ఇచ్చింది. దీనిని వినియోగించడంతో భారత్‌కు మధ్య ఆసియాతో, రష్యా, యూరప్ దేశాలకు సులువుగా సరుకులను పంపిణీ చేయవచ్చు. అందుకే భారత్ అచితూచి వ్యవహరిస్తోంది.
గల్ఫ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు మూడో ప్రపంచయుద్ధానికి దారితీస్తాయా?
ప్రపంచంలో ఎప్పుడూ లేనంతగా ఆయుధాల కొనుగోళ్లు పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక యద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధాల కారణంగా అనేక దేశాలు సతమతమవుతున్నాయి. అయితే మూడో ప్రపంచ యుద్ధం జరగకపోవచ్చు. కానీ ఈ యుద్ధాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తుంది.
పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రతరం- ఇరాన్‌పై దాడులను మరింత పెంచుతామన్న ట్రంప్

