నాకు మంత్రి పదవి ఇవ్వండి - నీళ్లు ఎలా రావో చూస్తా : రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సవాల్
సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు సవాల్ - గురుదక్షిణ చెల్లించేందుకే సీఎం నీళ్లను వదులుతున్నారని ఆరోపణ - ప్రభుత్వం తుమ్మిడిహట్టిలో తట్టెడు మట్టి ఎందుకు తీయలేదని ప్రశ్న

Published : July 8, 2026 at 1:54 PM IST
|Updated : July 8, 2026 at 2:46 PM IST
Harish Rao Challenge To Revanth Reddy : గురుదక్షిణ చెల్లించేందుకే సీఎం రేవంత్ రెడ్డి నీళ్లను వదులుతున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. కాళేశ్వరంలో నీళ్లు ఉండి కూడా లిఫ్ట్ చేయకపోవడం క్రిమినల్ నెగ్లిజెన్స్ కిందకు వస్తుందన్నారు. ఇలాంటి వారిని ఉరితీసినా తప్పులేద్నారు. నీళ్లు ఉండి కూడా వరంగల్ జిల్లాకు అన్యాయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మంగళవారం రేవంత్ రెడ్డి ప్రసంగం సొల్లు తప్ప, ఏదీ నిజం లేదని, అబద్ధాలకు చొక్కా తొడిగితే రేవంత్ రెడ్డిలా ఉంటుందని ఎద్దేవా చేశారు. అబద్ధాల్లో నోబెల్ ఇవ్వాల్సి ఉంటే రేవంత్‌కే ఇవ్వాలని సూచించారు.
తుమ్మిడిహట్టి పేరిట రూ.2,328 కోట్లు తిన్నారు : కాంగ్రెస్ ఉన్నప్పుడే తుమ్మిడిహట్టికి ఒప్పందం అయినట్లు సీఎం చెప్పారని, తుమ్మిడిహట్టికి రూ.6,500 కోట్లు ఖర్చుపెట్టినట్లు సీఎం చెబుతున్నారని, 8 ఏళ్లు కేంద్రం, రాష్ట్రం, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయని హరీశ్ రావు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మిడిహట్టిలో తట్టెడు మట్టి ఎందుకు తీయలేదు? ప్రశ్నించారు. పనులు చేయకుండా రూ.2,328 కోట్లు తిన్నారని, మెుబిలైజేషన్ అడ్వాన్స్‌లు పేరిట కాంగ్రెస్ నేతలు రూ.2,328 కోట్లు తిన్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వం రాగానే మెుబిలైజేషన్ అడ్వాన్స్ విధానాన్ని తొలగించామని, తుమ్మిడిహట్టికి అనుమతి ఇవ్వాలని మహారాష్ట్ర ఇరిగేషన్ మంత్రిని కలిశానని అన్నారు.
కాంగ్రెస్ సీఎంలు కోరితేనే ఇవ్వలేదని, మీకు ఎలా ఇస్తామని ప్రశ్నించారని తెలిపారు. తుమ్మిడిహట్టి నిర్మాణానికి తాము అన్ని ప్రయత్నాలు చేశామని పేర్కొన్నారు. ప్రాజెక్టును కావాలని మార్చలేదని, నీటి లభ్యత తక్కువగా ఉన్నందున ప్రత్యామ్నాయం చూసుకోవాలని కేంద్రం లేఖ రాసిందని, నీళ్లు లేని చోట తుమ్మిడిహట్టి ప్రాజెక్టును కాంగ్రెస్ తలపెట్టిందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి అసత్య మాటలు మాట్లాడటం ఇప్పటికైనా మానాలని హితువు పలికారు.
ఒకపక్క నీళ్లు లేక పల్లెల్లో రైతన్నల కన్నీళ్లు!
— KTR (@KTRBRS) July 8, 2026
మరోపక్క..మేడిగడ్డ కాడ వృథాగా కిందికి పోతున్న లక్ష ల క్యూసెక్కుల నీళ్లు!
నిర్లక్ష్యంలో నీరో చక్రవర్తిని మించిపోయి తమాషా చూస్తున్నది సర్కారు!
వానల్లేక..ఎవుసం జరగక అన్నదాత అల్లాడుతుంటే ప్రభుత్వానికి పాపం అనిపించడం లేదా?
కాళేశ్వరం… pic.twitter.com/KbeeFDzChr
"నీటిపారుదల మంత్రిగా నాకు 3 నెలలు అవకాశం ఇవ్వండి. నీళ్లు ఎలా రావో చూస్తా. కన్నెపల్లి నుంచి ఎల్లంపల్లి వరకు నీళ్లు తెస్తా. నీళ్లు తీసుకురాలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఈ మూడు నెలలపాటు జీతం, కారు, ప్యూన్, ఫ్యాన్ ఏమీ వద్దు. నాకు పదవులు ఏం కొత్త కాదు. 13 ఏళ్లు మంత్రిగా చేశాను" - హరీశ్‌రావు, మాజీ మంత్రి
రాజీనామా చేస్తా : సీఎం తీరు దొంగే దొంగ అన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. తుమ్మిడిహట్టిని 152 మీటర్ల ఎత్తులో నిర్మించేందుకు మహారాష్ట్ర అనుమతి ఇచ్చిందని చెప్పారని, ఒకవేళ అనుమతి ఇచ్చింది నిజమే అయితే రేవంత్ రెడ్డి ఆ ఒప్పందాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ఆ ఒప్పందాన్ని బయటపెడితే రాజీనామా చేస్తామని సవాల్ చేశారు. తుమ్మిడిహట్టి నిర్మిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిందని, కాంగ్రెస్ వచ్చి రెండున్నరేళ్లు అయినా తుమ్మిడిహట్టి కోసం ఏం చేసిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ డీఎన్‌ఏలోనే అవినీతి ఉందని విమర్శించారు. రేవంత్‌రెడ్డి టీడీపీలో ఉండగా జలయజ్ఞాన్ని ధనయజ్ఞం అని విమర్శించారని గుర్తు చేశారు. రేవంత్‌రెడ్డి పార్టీ మారగానే మాటమార్చారని వెల్లడించారు.
మేడిగడ్డ వద్ద బ్యారేజీ కట్టవద్దని నిపుణులు చెప్పలేదని, మేడిగడ్డ వద్ద బ్యారేజీ వద్దని నిపుణులు చెప్పినట్లు సీఎం అసత్యాలు చెబుతున్నారని విమర్శించారు. తమ నివేదికను దృష్టిలో పెట్టుకునే మేడిగడ్డ నిర్మించినట్లు నిపుణులు అఫిడవిట్ ఇచ్చారని తెలిపారు. సీఎం చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. చిల్లర రాజకీయాల కోసం రైతులు, రాష్ట్ర ప్రయోజనాలు పక్కనపెట్టడం సరైనదేనా? నిలదీశారు. వ్యాప్కోస్‌ను చెఫ్‌తో పోలుస్తూ రేవంత్ రెడ్డి మాట్లాడారని, చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టు కోసం వ్యాప్కోస్‌ను తెచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వమేనని, చేవెళ్ల-ప్రాణహితకు వ్యతిరేకంగా లేఖలు వచ్చాయని, ప్రత్యామ్నాయం చూపాలని వ్యాప్కోస్‌ను కోరామని అన్నారు. నేడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కూడా వ్యాప్కోస్‌కే పనులు అప్పగించిందని, రేవంత్ రెడ్డి పనులు అప్పగిస్తే కరెక్టు మేం చేస్తే తప్పా? అని ప్రశ్నించారు.
"తుమ్మిడిహట్టి వద్ద 160 టీఎంసీలు లేవని సీడబ్ల్యూసీ నివేదిక ఇచ్చింది. మేడిగడ్డ వద్ద 240 టీఎంసీలు వాడుకోవచ్చని నివేదికలో పేర్కొంది. 160 టీఎంసీలు లేని దగ్గర ప్రాజెక్టు కట్టాలా? 240 టీఎంసీలు ఉండే దగ్గర ప్రాజెక్టు కట్టాలా?. అన్ని అనుమతులు తీసుకొనే మేడిగడ్డ బ్యారేజీ నిర్మించాం. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 16 టీఎంసీలు. కాళేశ్వరం ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం 141 టీఎంసీలు. కొడంగల్-నారాయణపేట ప్రాజెక్టు అంచనా రూ.1,400 కోట్ల నుంచి రూ.4 వేల కోట్లకు పెంచారు" - హరీశ్‌రావు, మాజీ మంత్రి
మోటార్లు ఇప్పుడు ఆన్ చేసినా నీళ్లు వస్తాయి : ఎస్‌ఎల్‌బీసీలో 8 మంది కార్మికులు చనిపోతే మృతదేహాలు కూడా తీయలేదని, రేవంత్ రెడ్డి తప్పిదం వల్ల వట్టెం పంప్‌హౌస్ కూలిపోయిందని తెలిపారు. నీళ్లు వదలకుండా నిల్వ చేసినందుకు వట్టెం పంప్‌హౌస్ కూలిపోయిందని, ఇసుక అక్రమ రవాణా కోసం పెద్దపల్లి జిల్లాలో బాంబులు పెట్టి చెక్‌డ్యామ్‌లు పేల్చారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి పాలనలో ఇన్ని కూలిపోతే కాంగ్రెస్ నేతలు ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. 2022లో గోదావరి నది చరిత్రలో ఎప్పుడూ రానంత వరద వచ్చిందని, విపరీతంగా వరద రావడం వల్ల కన్నెపల్లి పంప్‌హౌస్ మునిగిందని, కన్నెపల్లి పంప్‌హౌస్ మునిగిన 45 రోజుల్లో మరమ్మతులు చేసి మోటార్లు ఆన్ చేశామని, కన్నెపల్లి పంప్‌హౌస్ మోటార్లు ఇప్పుడు ఆన్ చేసినా నీళ్లు వస్తాయని, బదనాం చేయడానికే ఉత్తమ్ మాట్లాడుతున్నారు తప్ప వాస్తవం లేదని వివరించారు.
నీటిని వృథా చేస్తారా? : కాంగ్రెస్ సర్కార్‌ను 'ఎక్స్' వేదికగా కేటీఆర్ ప్రశ్నించారు. మేడిగడ్డ వద్ద వృథాగా లక్షల క్యూసెక్కులు పోతున్నాయని, నీళ్లు లేక పల్లెల్లో రైతన్నలు కన్నీళ్లు పెడుతున్నారని అన్నారు. నీళ్లు లేక రైతులు కన్నీళ్లు పెడుతుంటే నీటిని వృథా చేస్తారా? అని నిలదీశారు. నిర్లక్ష్యం వహించి కాంగ్రెస్ సర్కార్ తమాషా చూస్తోందని మండిపడ్డారు.
కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ఆర్థిక ఉగ్రవాదులు : సీఎం రేవంత్

