ETV Bharat / state

15 ఏళ్లు న్యాయపోరాటం - జైలు నుంచి విడుదలైన మాజీ మావోయిస్టు కేశవరావు

జైలు నుంచి విడుదలైన అనంతరం మంగళవారం అర్ధరాత్రి ఇంటికి - చిన్న వయసులోనే మావోయిస్టు ఉద్యమంలో చేరి క్రమంగా ఉన్నత స్థాయి నాయకుడిగా ఎదిగిన కేశవరావు

Former Maoist Leader Release
Former Maoist Leader Release (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 20, 2026 at 4:53 PM IST

1 Min Read
Choose ETV Bharat

Former Maoist Leader Kesava Rao Release : శ్రీకాకుళం జిల్లా మందస మండలం నల్లబోడ్లురుకు చెందిన మాజీ అగ్రశ్రేణి మావోయిస్టు నాయకుడు దున్న కేశవరావు (అలియాస్ ఆజాద్) జైలు నుంచి విడుదలైన అనంతరం మంగళవారం అర్ధరాత్రి ఇంటికి చేరుకున్నారు. చిన్న వయసులోనే మావోయిస్టు ఉద్యమంలో చేరిన ఆయన అజ్ఞాతంలోకి వెళ్లి క్రమంగా ఉన్నత స్థాయి నాయకుడిగా ఎదిగారు. ఆయనపై ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో మొత్తం 68 కేసులు నమోదయ్యాయి.

జైలులోనే నిరాహార దీక్ష : 25 ఏళ్ల అజ్ఞాతం తర్వాత 2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి డీజీపీ అరవిందరావు ఎదుట హైదరాబాద్‌లో లొంగిపోయారు. అక్కడ నుంచి స్వగ్రామం నల్లబొడ్లూరు చేరుకొని కుటుంబసభ్యులతో ఉండగా 10 రోజుల తర్వాత ఒడిశా పోలీసులు విచారణ పేరిట కేశవరావును కస్టడీలోకి తీసుకున్నారు. తరువాత అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించి ఝార్పడా జైలుకు తరలించారు. కేశవరావు 2025లో జైలులోనే నిరాహార దీక్ష చేశారు.

15 ఏళ్ల పాటు న్యాయ పోరాటం : మరోవైపు, ఆయన తల్లి కాములమ్మ 15 ఏళ్ల పాటు న్యాయ పోరాటం చేశారు. పలు సంఘాల సహకారంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల్లో ఆయనపై ఉన్న కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఒడిశాలోని పర్లాఖెముండి న్యాయస్థానం కేశవరావును నిర్దోషిగా ప్రకటించింది. ఇంటికి చేరుకున్న కేశవరావుకు ఆయన తల్లి కాములమ్మ మిఠాయిలు తినిపించి మురిసిపోయారు.