మంత్రి వివేక్ నన్ను చంపుతారేమోనని అనుమానం - బెయిల్‌పై విడుదలైన బాల్క సుమన్
జైలు నుంచి విడుదలైన బాల్క సుమన్ - రాజకీయ వైరుధ్యాన్ని మంత్రి వివేక్ వ్యక్తిగతంగా తీసుకున్నారన్న బాల్క సుమన్ - మంచిర్యాల కలెక్టర్, డీసీపీ, సీఐ, ఎస్సైలు వివేక్ తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపాటు

Published : March 4, 2026 at 2:47 PM IST
|Updated : March 4, 2026 at 4:21 PM IST
BRS Leader Balka Suman Released From Adilabad District Jail : మంచిర్యాల జిల్లా కలెక్టర్, డీసీపీ, సీఐ, ఎస్సైలు సహా రెవెన్యూ అధికారులు మంత్రి వివేక్ వెంకటస్వామి విశాఖ కంపెనీ ఉద్యోగులుగా మారిపోయారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలను ఇప్పటికైనా పాటించి క్యాతన్‌పల్లి మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికను పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. జైలులో తనని తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని, జైలు నుంచి బయటకు రాకుండా అనేక కుట్రలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనని వేధించిన మంత్రి వివేక్‌ను ప్రేమిస్తూనే ఉంటానని, వివేక్ తనని చంపుతారేమోనని అనుమానంగా ఉందని వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లా జైలులో 14 రోజుల పాటు రిమాండ్‌లో ఉన్న ఆయన ఈరోజు ఉదయం విడుదల అయ్యారు.
మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక జరిగే తరుణంలో : గత నెలలో మున్సిపల్ ఫలితాల అనంతరం క్యాతన్‌పల్లి మొత్తం 22 స్థానాలకు బీఆర్ఎస్, సీపీఐలు కలిసి 14 దక్కించుకోగా 7 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. దీంతో మున్సిపల్ ఎన్నిక నిర్వహించే తరుణంలో జరిగిన ఘర్షణలో సుమన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. పలు రకాలుగా లాయర్లు బెయిల్ కోసం ప్రయత్నించగా ఈరోజు సుమన్ విడుదలయ్యారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన మరో ముగ్గురు నేతలు మూల రాజిరెడ్డి, దోమకొండ అనిల్, రామగిరి లక్ష్మణ్ కూడా బెయిల్‌పై విడులయ్యారు.
బయటకు రాకుండా కుట్రలు : ఈ సందర్బంలో మాజీ మంత్రి జోగు రామన్న బీఆర్ఎస్ నేతలు భారీ సంఖ్యలో వచ్చ జైలు నుంచి విడుదలైన బాల్క సుమన్‌కు పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు. దీంతో జైలు పరిసరాల్లో పోలీసు శాఖ గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది. క్యాతన్‌పల్లి మున్సిపల్ ఎన్నికల్లో సంపూర్ణ ఆధిక్యత కలిగిన బీఆర్ఎస్కు పాలకవర్గం పగ్గాలు దక్కకుండా మంత్రి వివేక్ సూచనలకు అనుగుణంగా మంచిర్యాల జిల్లా అధికార యంత్రాంగం మొత్తం సహకరించిందని సుమన్ మండిపడ్డారు. ఈరోజు తన చిన్నకుమారుడి జన్మదినం ఉన్నందున తనను జైలు నుంచి బయటకు రాకుండా వేర్వేరు కేసులను తెరపైకి తెచ్చి అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. హోలీ రోజు తన కుటంబం కార్యకర్తలతో కలిసి గడపకుండా ఉండేందుకు కుట్రలు చేశారన్నారు.
"మా కౌన్సిలర్లను ప్రలోభ పెట్టి మున్సిపాలిటీని దక్కించుకోవాలని చూశారు. నేనుంటే అది సాధ్యం కాలేదని నన్ను జైల్లో పెట్టి క్యాతన్‌పల్లి మున్సిపల్ ఛైర్మన్ పదవి వశపరచుకోవాలని మంత్రి వివేక్ వెంకటస్వామి చూశారు. అయినా కూడా మా కార్యకర్తలు బలంగా, మొండిగా నిలబడ్డారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్‌లు ప్రజాతీర్పును గౌరవించి అర్థం చేసుకోవాలని కోరుతున్నా. రాజకీయాల్లో వివిధ పార్టీల్లో వ్యక్తులు ఉండటం సహజం. రాజకీయ వైరుధ్యాలుగానే చూడాలి తప్ప వ్యక్తిగతంగా చూడకూడదు. నేను ఎప్పుడు ఎవరితోనూ వ్యక్తిగత శత్రుత్వాలు పెట్టుకోలేదు. కానీ ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులను శత్రువులుగా చూస్తున్నారు. నేను పదేళ్లలో ఒక్కరిని కూడా జైలుకు పంపలేదు" -బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్యే
అధికారులు పైన వచ్చే ఆదేశాలను పాటించారు : ఈ జిల్లాలోని అధికారులకు చట్టం, రాజ్యాంగం ఏమైనా తెలుసా? అని సుమన్ ధ్వజమెత్తారు. ప్రభుత్వాలు వస్తుంటాయ్ పోతుంటాయని అని అన్నారు. జైలులో తనకు చాలా ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారు.
ఉద్రిక్తతల నడుమ క్యాతనపల్లి చైర్మన్ ఎన్నిక వాయిదా - కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ
మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాల పరంపర - మంచిర్యాల, క్యాతనపల్లి పురపాలకల్లో అలజడి

