ETV Bharat / state

ప్రాణాలు పోతున్నా పట్టింపేది? - వన్యప్రాణులకు ప్రమాదంగా మారుతున్న ఫారెస్ట్‌ అధికారుల తీరు!

పులి మరణంతో తీవ్ర ఆందోళన - దీని వెనుక ఉంది ఎవరు? - ఇది అధికారుల నిర్లక్షమా? - చనిపోయి ఏడాది దాటినా బయటకు రాని నిజం - ప్రశ్నార్థకంగా వన్యమృగాల భద్రత

Forest Officers Becoming Danger To Animals :
Forest Officers Becoming Danger To Animals : (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : January 6, 2026 at 12:57 PM IST

3 Min Read
Choose ETV Bharat

Forest Officers Becoming Danger To Animals : ఖమ్మం, భద్రాద్రి జిల్లాలోని కొన్ని మారుమూల ప్రాంతాల్లో కొందరు విద్యుత్తు తీగలతో వన్యప్రాణులను వేటాడుతున్నా, క్షేత్రస్థాయి అటవీ సిబ్బంది కళ్లు మూసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. శని, ఆదివారాలు వస్తే పట్టణాలకు సైతం వన్యప్రాణుల మాంసం విచ్చలవిడిగా సరఫరా అవుతున్నా, అటవీ అధికారులకు సమాచారం అందితే కానీ నిందితులను పట్టుకోలేని పరిస్థితి నెలకొంది. అలాగే తాజాగా వెలుగులోకి వచ్చిన చిరుతపులి మృతి మరింత ఆందోళన కలిగిస్తోంది.

కాపాడాల్సిన వారే ప్రమాదంగా మారారా? : కంచే చేనును మేసినట్లుగా మారింది ఖమ్మం జిల్లాలోని తల్లాడ ఫారెస్ట్‌ రేంజ్‌ పరిస్థితి. ఒకవైపు అరుదైన చిరుతపులి మృతి చెందితే, దాని మరణానికి గల కారణాలను అన్వేషించాల్సిన అటవీ శాఖ అధికారులు, ఆధారాలను కాల్చి బూడిద చేయటం సర్వత్రా చర్చనీయాంశమైంది. కాపాడాల్సిన వారే ఇలా చేయడం తీవ్ర ఆందోళనలు కలిగిస్తోంది. అడవిలో ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించటం వన్యప్రాణుల పాలిట శాపంగా మారుతోందని చెప్పటానికి ఈ ఘటనే నిదర్శనంగా నిలుస్తోంది.

గుట్టుచప్పుడు కాని చర్యలపై అనుమానాలు : వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం చిరుతపులి మరణిస్తే అనుసరించాల్సిన నిబంధనలేవీ అధికారులు పాటించకపోవటం అనేక అనుమానాలకు తావిస్తోంది. చిరుత చనిపోయిన సమాచారం అందిన వెంటనే పోస్టుమార్టం నిర్వహించకుండా, పంచనామా చేయకుండా గుట్టుచప్పుడు కాకుండా కళేబరాన్ని కాల్చేయటం అంటే నేరాన్ని కప్పిపుచ్చే కుట్రే. పైగా ఏడాది పాటు ఈ నిజాన్ని దాచిపెట్టడం వెనుక ఉన్న ‘అదృశ్య హస్తాలు’ ఎవరివనేది తెలియాలి. వేటగాళ్లతో అధికారులు కుమ్మక్కై ఈ పనికి పూనుకున్నారా? లేదా చిరుత కళేబరం దొరికితే తమ ఉద్యోగాలకు ఏమైనా ఇబ్బందులు వస్తాయని దహనం చేశారా? అనేది ఉన్నతాధికారుల పరిశీలనలో తేలాల్సి ఉంది.

ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం : కల్లూరు ఘటనపై ఖమ్మం డీఎఫ్‌ఓ సిద్ధార్థ్‌ విక్రమ్‌సింగ్‌ ఆదేశించిన విచారణ కేవలం కంటితుడుపు చర్యగా మిగలకూడదు. ఇప్పటికే కల్లూరు డిప్యూటీ రేంజ్‌ అధికారి, కల్లూరు, లక్ష్మీపురం బీట్‌ అధికారులపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం వల్లే క్షేత్రస్థాయి సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఉభయ జిల్లాల అటవీ శాఖ అధికారులు ఇప్పటికైనా మేల్కొని వన్యమృగాల సంరక్షణకు చొరవ చూపాలని కోరుతున్నారు.

అరుదైన మృగాలకు రక్షణేది? : కనకగిరి అభయారణ్యంలో చిరుత పులులు సంచరిస్తున్నాయని ఓవైపు అటవీశాఖ అధికారులు చెబుతుండగా, ఇలాంటి ఘటనలు జరగటం వన్యమృగాల భద్రతను ప్రశ్నార్థకంగా మారుస్తోంది. అడ్డుకోవాల్సిన అధికారులే ఆధారాలను మాయం చేయాలని చూస్తే, భవిష్యత్తులో వేటగాళ్లకు అడ్డులేకుండా పోతుందనే వాదనలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో బీట్, సెక్షన్‌ అధికారులు ఏం చేస్తున్నారో పర్యవేక్షించాల్సిన బాధ్యత ఉన్నతాధికారులదే. ఒక చిరుత మరణిస్తే ఏడాది దాకా జిల్లా అధికారులకు తెలియకపోవటం వారి వైఫల్యానికి అద్దం పడుతోంది.

మాంసంతో విందుకు ఏర్పాట్లు : సత్తుపల్లి నీలాద్రి అర్బన్‌ పార్కులోని దుప్పులను వేటాడిన ఘటన వన్యప్రాణుల సంరక్షణను ప్రశ్నార్థకంలో పడేస్తోంది. ప్రజాప్రతినిధుల కుటుంబాలకు చెందిన వారే ఇందులో ప్రధాన నిందితులుగా ఉండటమనేది ఆలోచింపజేస్తోంది. దుప్పులను వేటాడి వాటి మాంసంతో విందును ఏర్పాటు చేయటమనేది తీవ్ర చర్చనీయాంశమైంది. ఉభయ జిల్లాల్లో అటవీ జంతువుల వేట విచ్చలవిడిగా సాగుతుండగా, వాటిలో కొన్ని మాత్రమే అటవీ అధికారుల దృష్టికి వస్తున్నట్లు తెలుస్తోంది. వన్యప్రాణుల పరిరక్షణకు ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతున్నప్పటికీ ఏదో చోట ఇలాంటి ఘటనలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

బడాబాబులూ 'కూర' మృగాళ్లే! - ఇది హోదాకు చిహ్నమా విలువల పతనమా?

పులుల సంఖ్య లెక్కించాలని ఆసక్తి ఉందా? - అయితే ఇలా దరఖాస్తు చేసుకోండి