ETV Bharat / state

కలకలం రేపిన కల్తీ పాలు - రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

కల్తీపాలపై ఫుడ్ సేప్టీ అధికారుల విస్తృత తనిఖీలు - పాల నమూనాలను సేకరించి ల్యాబ్స్​కు తరలింపు, ఫ్రిజ్​లో నిల్వ ఉంచిన బాదం పాల ప్యాకెట్లను సైతం గుర్తించిన అధికారులు

Food Safety Officials Inspects Milk Centers
Food Safety Officials Inspects Milk Centers (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 25, 2026 at 11:26 AM IST

|

Updated : February 25, 2026 at 2:10 PM IST

3 Min Read
Choose ETV Bharat

Food Safety Officials Inspects in Milk Centers Across AP : రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పాల విక్రయ కేంద్రాలపై ఫుడ్​ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో పాల కేంద్రాలపై అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. రాజమండ్రి కల్తీ పాల ఘటన మరెక్కడా పునరావృతం కాకుండా ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృత స్థాయిలో ముమ్మర తనిఖీలను చేపట్టారు.

మచిలీపట్నం జిల్లా పరిషత్ సెంటర్, చిలకలపూడి సెంటర్​లోని పాల కేంద్రాలలోని పాలను తనిఖీ చేశారు అనంతరం మచిలీపట్నంలో చిలకలపూడి ప్రాంతంలో ఎస్.ఎస్. మిల్క్, జిల్లా పరిషత్ కృష్ణవేణి మిల్క్ డైరీ పాల కేంద్రాల నుంచి పాల నమూనాలను సేకరించి ప్రయోగశాలలకు పంపారు. ఎమ్మార్పీ, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేని, అత్యధిక కాలం ఫ్రిజ్ లో నిల్వ ఉంచిన బాదం పాల ప్యాకెట్లను సైతం అధికారులు గుర్తించారు.

కలకలం రేపిన కల్తీ పాలు - రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు (ETV Bharat)

అనంతపురంలో సైతం తనిఖీలు: అనంతపురం నగరంలోని పలు ప్రాంతాల్లో పాలు విక్రయ కేంద్రాలపై విజిలెన్స్, ఆహార భద్రత అధికారులు తనిఖీలను చేపట్టారు. నగరంలోని శ్రీ కంఠం కూడలి, శారద నగర్, రాంనగర్ సమీపంలోని శ్రీనగర్ కాలనీ కళ్యాణదుర్గం బైపాస్ రోడ్డు సమీపంలో రోడ్డు పక్కన పాలు విక్రయిస్తున్న వ్యాపారుల వద్ద తనిఖీలు చేశారు. ఆహార భద్రత అధికారులతో పాటు విజిలెన్స్, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు.

అదే విధంగా కళ్యాణదుర్గం రోడ్డు సమీపంలో పాలలో ఉప్పు కలిసినట్లు ప్రాథమికంగా నిర్ధారించామని ఆహార భద్రత అధికారిని తస్లీమా తెలిపారు. అన్ని ప్రాంతాల్లో పాలను తనిఖీలు చేసి శాంపిల్స్ పరీక్షా కేంద్రాలకు తరలిస్తామన్నారు. ఎటువంటి కల్తీ ఉన్నట్లు తేలిన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. రోడ్డు సమీపాల్లో అపరిశుభ్ర ప్రాంతాల్లో పాలను విక్రయించకూడదని అధికారులకు వ్యాపారులకు సూచించారు.

"ఆహార భద్రత కమిషనర్​ ఆదేశాల మేరకు విజిలెన్స్ డిపార్ట్​మెంట్​తో కలిసి పాల విక్రయ కేంద్రాలపై తనిఖీలను నిర్వహించాం. అన్ని ప్రాంతాల్లో పాలను తనిఖీలు చేసి శాంపిల్స్ పరీక్షా కేంద్రాలకు తరలిస్తాం. ఎటువంటి కల్తీ ఉన్నట్లు తేలినా సరే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. రోడ్డు సమీపంలో, అపరిశుభ్ర ప్రాంతాల్లో పాలను విక్రయించకూడదని వ్యాపారులకు సూచించాం"-తస్తీమా, జిల్లా ఆహార భద్రతా అధికారిణి

స్వచ్ఛమైన పాలనే విక్రయించాలి: రాజమండ్రిలో పాల కల్తీ వల్ల మృతి చెందిన అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించటంతో అనంతపురం జిల్లాలో అధికారులు ఉదయమే ఆయా పాల అమ్మకపు కేంద్రాల వద్ద ముమ్మరంగా తనిఖీలను విస్తృతంగా చేపట్టారు. ప్రజా ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించిందని, కల్తీ లేని పాలను ప్రజలకు విక్రయించేలా చూడాలని పాల వ్యాపారులతో అధికారులు పేర్కొన్నారు.

విజయవాడలో సైతం: విజయవాడలోని పాల బూత్​లపై ఫుడ్ సేఫ్టీ, పశుసంవర్థక అధికారులు దాడులు నిర్వహించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు శాంపిల్స్ సేకరించారు. ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ, పశుసంవర్థక అధికారులు మాట్లాడారు. విజయవాడలోని 6 పాల బూత్​లపై తనిఖీలు చేశామని అధికారులు తెలిపారు. 6 పాల బూత్​ల నుంచి పాల శాంపిల్స్ సేకరించామన్నారు. లేబరేటరీ నుంచి మూడు రోజుల్లో రిజల్ట్ వస్తుందని తెలిపారు. పాలు కల్తీ చేసినట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్లాస్టిక్ కానీ, అల్యూమినియం డబ్బాల్లో కానీ పాలను నిల్వ చేయవద్దు. కేవలం స్టెయిన్లెస్ స్టీల్ క్యాన్లలో మాత్రమే పాలను నిల్వ చేయాలని అధికారులు సూచించారు.

అయితే ఫుడ్ సేఫ్టీ కమిషనర్, కలెక్టర్ ఆదేశాలతో దాడులు నిర్వహిస్తున్నామన్నారు. నిరంతరం దాడులు నిర్వహిస్తామన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం పాలలో కల్తీ చేస్తే మరణశిక్ష కూడా విధించే అవకాశం ఉందని తెలిపారు. పాల కల్తీ మామూలు నేరం కాదు మర్డర్ చేసిన నేరం కన్నా పెద్ద నేరంగా పరిగణించబడుతుందన్నారు. కృష్ణలంక సెంటర్, వన్ టౌన్‌, పంట కాలవ రోడ్డు, కరెన్సీ నగర్, ప్రసాదంపాడు ప్రాంతాలలో లూజ్ మిల్క్ అమ్మే వారిపై దాడులు నిర్వహించామని అధికారులు వెల్లడించారు.

నిర్లక్ష్యం వద్దు: ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, నిర్లక్ష్యం వహించొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ రోజు ఉదయం శ్రీకాకుళం, రాజమహేంద్రవరం ఘటనపై సమీక్ష నిర్వహించిన సీఎం, ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా వివిధ శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు.

పాల ‘కల్తీ’ - ఆహార భద్రతాధికారుల తనిఖీలు - ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు

పాలు కల్తీ చేస్తే మరణ శిక్ష - ఫుడ్ సేఫ్టీ అధికారుల హెచ్చరికలు

Last Updated : February 25, 2026 at 2:10 PM IST