ETV Bharat / state

పాల ‘కల్తీ’ - ఆహార భద్రతాధికారుల తనిఖీలు - ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు

నాణ్యత ప్రమాణాలు సరిగ్గా పాటించని కొందరు అమ్మకందారులపైన పలు కేసులు నమోదు చేసిన ఆహార భద్రతాధికారులు - అసలు పాలే లేకుండా నెయ్యి తయారు చేస్తున్న ముఠాలు

Food Safety Officer Rides in Visakha District
Food Safety Officer Rides in Visakha District (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 24, 2026 at 12:58 PM IST

3 Min Read
Choose ETV Bharat

Food Safety Officer Rides in Visakha District: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరిగిన కల్తీ పాల ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను భయాందోళనలకు గురి చేసింది. ఏకంగా ఊపిరి తీసే స్థాయిలో జరిగిన ఈ కల్తీ ఉదంతం కలవరం రేపుతోంది. అయితే మహానగరం విశాఖలో పరిస్థితి ఎలా ఉంది? అని ఎంతో మందిలో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు ఇటీవల సుమారు 40 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు.

నాణ్యత ప్రమాణాలు సరిగ్గా పాటించని కొందరు అమ్మకందారులపైన పలు కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. వేరే రాష్ట్రాలనుంచి వచ్చిన కొన్ని ముఠాలు కల్తీ విధానాలు అనుసరిస్తూ, కృత్రిమంగా పాల ఉత్పత్తులు తయారు చేస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో బయటపడింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఈ మోసగాళ్లు ఇళ్లు అద్దెకు తీసుకుని ఈ నిర్వాకానికి పాల్పడుతున్నట్లు తెలుస్తుంది.

కల్తీకి అడ్డా: అడ్డదారిలో డబ్బు సంపాదనకు మరిగిన కొందరు, కల్తీ నెయ్యి తయారు చేస్తూ విక్రయాలు సాగిస్తున్నారు. పూర్ణమార్కెట్​ ప్రాంతంలో ఈ కార్యకలాపాలు చేపడతున్నట్లు బట్టబయలయ్యింది. వీళ్లు కొన్ని పాల పౌడర్‌ను డబ్బాల్లో వేసి వాటిల్లో పామాయిల్‌ కలిపి నిల్వ చేస్తున్నారు. తర్వాత ఆ మిశ్రమానికి పలు ప్రమాదకర రసాయనాలను కలిపి ఉంచుతున్నారు. ఆపై దాన్నంతటినీ ఒక ముద్దలా వచ్చాక ఆ పదార్థాన్ని వేడి చేస్తున్నారు. ఇంతే అసలు పాలే లేకుండా ఇలా వాళ్లు నెయ్యి తయారు చేసి సీలు ప్యాకింగ్‌తో విక్రయానికి సిద్ధం చేశారు.

కర్ణాటక నుంచి వచ్చిన కొందరు వ్యక్తులు ఈ విధంగా కల్తీకి పాల్పడుతున్నట్లు ఆహార భద్రతాధికారులు తనిఖీల్లో అధికారులు గుర్తించినట్లు తెలిపారు. వీరి దగ్గర పెద్దమొత్తంలో పామాయిల్‌ ప్యాకెట్లు సహా కల్తీ ఉత్పత్తుల తయారీ కోసం వినియోగించే నిల్వ చేసిన ఇతర రసాయనాలు ఉన్నాయి. ఆ పదార్థాల నమూనాలను ప్రయోగశాలకు పంపగా వాళ్లు తయారు చేసిన పదార్థాలు సురక్షితం కాదని తేలింది. దీంతో ఈ ఉదంతానికి పాల్పడ్డ వారిపై కేసు నమోదు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. సదరు వ్యక్తులకు ఇప్పటికే నోటీసులు పంపారు.

అప్రమత్తత అవసరం: మీ ఇంటికే వచ్చి పాలను ఇచ్చినప్పటికీ వాటిల్లోని కల్తీ జరిగే ప్రమాదం లేకపోలేదని ఆహార భద్రత అధికారులు హెచ్చరిస్తున్నారు. వివిధ హానికారక రసాయనాలతో కల్తీ పాలను తయారు చేయడమే కాకుండా వాటిని నిజమైన వాటిలా చూపించడానికి పాల పౌడర్లలో యూరియా కలుపుతున్నారు. కృత్రిమంగా తయారు చేసిన పాలు అనే సందేహం రాకుండా ఉండటానికి, అవే స్వచ్ఛమైన పాలు అని నమ్మించడానికి నురుగు వచ్చేలా కూడా చేస్తారని అధికారులు వివరిస్తున్నారు.

పాల కల్తీ కేసులు విశాఖ నగరంలో ఇటీవల నమోదవ్వనప్పటికీ, ప్రజలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మధ్యవర్తులు రైతుల నుంచి కొనుగోలు చేసిన పాలను ఇంటింటికీ సరఫరా చేస్తారు. అలాంటి సందర్భాల్లో పాల నిల్వ కేంద్రాల్లో పలు రకమైన మోసాలకు పాల్పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. విశాఖలో 85 శాతం మంది ప్యాకెట్‌ పాలే వినియోగిస్తున్నట్లు అధికార గణాంకాల్లో తెలిసింది.

తనిఖీలు ముమ్మరం: తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన కల్తీ పాల వ్యవహారంతో అప్రమత్తమయినట్లు ఆహార భద్రత సహాయ తనిఖీ అధికారి కల్యాణచక్రవర్తి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వారు విశాఖ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లోని పాల సేకరణ కేంద్రాలు, నిల్వ పాయింట్ల నుంచి నమూనాలు సేకరించాలని తనిఖీ అధికారులను ఆదేశించామన్నారు. నిర్వహణ కేంద్రాల్లో శాస్త్రీయ పద్ధతులు సహా, శుభ్రత పాటిస్తున్నారా లేదా అనేది తనిఖీ చేస్తామని ఆహార భద్రత సహాయ తనిఖీ అధికారి పేర్కొన్నారు.

రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటన - ఐదుగురు మృతి

ప్రజారోగ్యంతో ఆటలా? - ప్యాకేజ్డ్ ఫుడ్ లేబులింగ్‌పై సుప్రీం అసహనం