ETV Bharat / state

హోటళ్లలో ఫుడ్​ సూపర్​ టేస్టీ అని వెళ్తున్నారా? - ఇవి గుర్తించకపోతే ఆరోగ్యం గుల్లే!

గ్రేటర్​ హైదరాబాద్​ వ్యాప్తంగా జోరుగా కల్తీ ఆహారం - అప్రమత్తంగా లేకుంటే ఆరోగ్యం గుల్లేనని చెబుతున్న వైద్యులు - ఇటీవల దాడుల్లో పెద్ద ఎత్తున కుళ్లిన మాంసం, కల్తీ ఆహార పదార్థాలు గుర్తించిన అధికారులు

Food Adulteration in Hyderabad
Food Adulteration in Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : March 21, 2026 at 8:13 AM IST

3 Min Read
Choose ETV Bharat

Food Adulteration in Hyderabad : గ్రేటర్​ హైదరాబాద్​ వ్యాప్తంగా ఆహార కల్తీలు ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఆరోగ్యానికి చేటు తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాంతులు, డయేరియా, విరేచనాలు, టైఫాయిడ్, కడుపు నొప్పి, హెపటైటీస్‌-ఏ లాంటి వ్యాధులు వెంటనే చుట్టుముట్టడంతో పాటు దీర్ఘకాలంలో అన్నవాహిక, పెద్దపేగు, పొట్ట తదితర క్యాన్సర్లు దాడి చేసే అవకాశం ఉందంటున్నారు. ఈ నెలలోనే అంబర్‌పేట్, జియాగూడ, మంగళహాట్‌ ప్రాంతాల్లో భారీ ఎత్తున కల్తీ ఆహార పదార్థాలను గుర్తించారు.

ఎక్కడెక్కడ ఎలా? :

  • మంగళ్​హాట్​ ప్రాంతంలో రసాయనాలతో కూడిన పెరుగు, కుళ్లిన మేక మాంసం, కల్తీ అల్లం- వెల్లుల్లి పేస్ట్, హాలీంను గుర్తించారు.
  • జియాగూడలో కుళ్లిన కూరగాయలు, ఇతర పదార్థాలతో ఉన్న కల్తీ పచ్చళ్ల ఫ్యాక్టరీని పోలీసులు గుర్తించారు. ఈ దాడుల్లో ఏకంగా 78 డ్రమ్ముల కల్తీ పచ్చళ్లను సీజ్​ చేశారు.
  • మరో ప్రాంతంలో ఏకంగా 3 వేల కేజీల కల్తీ పన్నీరు, కల్తీ పాలు, 610 కేజీల కుళ్లిన చికెన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ పదార్థాలన్నీ రోడ్డు పక్కన రెస్టారెంట్లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, హోటళ్లకు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉంచినవే కావడం గమనార్హం.

ఏటా 10 వేల డయేరియా కేసులు : హైదరాబాద్​ నగరంలో ఏటా 10 వేల డయేరియా కేసులు నమోదు అవుతుంటాయి. ఇందులో ఎక్కువ శాతం కల్తీ ఆహారం వల్ల కలిగినవే. ఇలాంటి ఆహారం తినడం కారణంగా కొన్నిసార్లు ప్రాణాపాయ పరిస్థితి ఉంటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

ఇలాంటి లక్షణాలు ఉంటే జాగ్రత్త పడాల్సిందే :

  • సాధారణంగా బయట ఏదైనా ఆహారం తిన్న తర్వాత 24-48 గంటల్లోపు లక్షణాలు బయటపడతాయి. వాంతులు, కడుపులో నొప్పి, పొట్టలో వికారం, అతిసారం, జ్వరం, కడుపు ఉబ్బరంగా అన్పించడం తదితర లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆహార కల్తీగా అనుమానించి, వైద్య నిపుణులను సంప్రదించాలని ప్రభుత్వ వైద్యులు శ్రీనివాస్‌ తెలిపారు.
  • కల్తీ ఆహారంలో ఈ-కొలితో పాటు ఇతర ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉంటుంది. తిన్న నాలుగైదు రోజులకు తీవ్రమైన జ్వరం, వాంతులు, కడుపులో నొప్పి ఉంటే దానిని టైఫాయిడ్‌గా అనుమానించి, వైద్యులను సంప్రదించి రక్త పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది.
  • ఆహారం తీసుకునేటప్పుడు వాసన, రుచిలో తేడా ఉంటే వెంటనే వాటిని తినడం ఆపివేయాలి. కల్తీ జరిగినట్లు అనుమానం కలిగినట్లయితే వెంటనే గ్రేటర్‌ మున్సిపల్‌ అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లండి. లేదంటే ఫుడ్‌ కంట్రోల్‌ అథారిటీ 1800-11-2100 నంబర్​కు కాల్‌ సెంటర్‌కు కాల్ చేసి కూడా ఫిర్యాదు చేయొచ్చు.
  • బయట హోటళ్లలో, రెస్టారెంట్లలో తినేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆహార పదార్థాలు సరిగా ఉన్నాయో లేదంటే ఏమైనా రంగులు కలిపారో అనే విషయం చెక్ చేసుకోవాలని చెబుతున్నారు.

ఈ జాగ్రత్తలు పాటించడం మేలు :

  1. ఆరు బయట ప్యాకింగ్ లేకుండా అమ్మే ఆహార పదార్థాలను తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్యాకెట్​ ఫుడ్ ​కంట్రోల్ అథారిటీ నంబర్​ను చెక్ చేసుకోవడం ఉత్తమం.
  2. తక్కువ ధరకే వస్తుంది కదా అనే ఉద్దేశంతో ఎక్కడ పడితే అక్కడ కొనుగోలు చేయకూడదు. డబ్బాల్లో తెచ్చి పోసే పాలు, ప్యాకింగ్ లేని నెయ్యి లాంటి ఆహార పదార్థాలతో జాగ్రత్తలు తప్పనిసరి.
  3. ఇంట్లో తయారు చేసుకునే ఆహారమైనా వాసన, రుచిలో తేడా కన్పిస్తే వంట పదార్థాల్లో కల్తీ జరిగినట్లుగా గుర్తించాలి. ఆయా పదార్థాలను దూరంగా పెట్టడం మంచిది.
  4. మార్కెట్లలో లభించే అల్లం వెల్లల్లి పేస్టుల్లో రంగులు, కుళ్లినవి వాడుతున్నారు. ఎలాంటి లేబుళ్లు లేకుండా ప్లాస్టిక్ కవర్లలో ఉన్న వాటిని కొనడం మంచిది కాదు.
  5. ప్యాక్​ చేసిన ఆహార పదార్థాలకు సంబంధించి ఎక్స్​పైర్ తేదీని గమనించాలి.

ఎక్కువగా బయటి ఫుడ్​ తింటున్నారా? - అయితే ఇవి తెలుసుకోండి

రోడ్​ సైడ్​ బండ్ల వద్ద చిరుతిండ్లు తింటున్నారా? - వాటి తయారీ గురించి తెలిస్తే ఆవైపు కూడా వెళ్లరు!