'తెలంగాణ దమ్ బిర్యానీ - రాయలసీమ రాగి సంకటి' : హైదరాబాద్‌లో నోరూరిస్తున్న ఫుడ్ ఫెయిర్
హైటెక్స్‌లో 3రోజుల పాటు 'ఫుడ్ ఎ ఫెయిర్ - 2026' - 150 స్టాళ్లు ఏర్పాటు చేసిన పలు సంస్థలు - విశేషంగా ఆకట్టుకుంటున్న ప్రియా ఫుడ్స్‌లోని 'సబల మిల్లెట్స్' స్టాల్

Published : July 3, 2026 at 2:34 PM IST
|Updated : July 3, 2026 at 3:35 PM IST
Food A Fair 2026 Hyderabad In Hitex : హైదరాబాద్‌లో స్ట్రీట్ ఫుడ్, రెస్టారెంట్, హోటల్ ఫుడ్ కల్చర్ రోజురోజుకు పెరిగిపోతోంది. నగర ఫుడ్ లవర్స్‌కు నోరూరించే రుచులు, వంటకాలు అందించేందుకు హోటళ్లు, రెస్టారెంట్లే కాకుండా అంకుర సంస్థలు కూడా ముందుకొచ్చాయి. ఈ నేపథ్యంలో హైటెక్స్‌లో 3రోజులపాటు జరుగుతున్న 'ఫుడ్ ఎ ఫెయిర్-2026' కళకళలాడుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన చెఫ్‌లు, సంస్థలు, వినియోగదారులను ఓ వేదికపై తీసుకొచ్చి, భిన్న రకాల రుచులతో పాటు ఆరోగ్యకర, పౌష్టికాహర ఉత్పత్తులు అందుబాటులో ఉంచాయి.
ఆకట్టుకుంటున్న సబల మిల్లెట్స్ : ఐటీ కారిడార్ ప్రాంతమైన మాదాపూర్ హైటెక్స్‌లో 'ఫుడ్ ఎ ఫెయిర్ - 2026' సందడిగా సాగుతోంది. చెఫ్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బ్లిట్జ్ ఎగ్జిబిషన్స్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో 3రోజుల పాటు జరగనున్న ఈ ప్రదర్శనను నేషనల్ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ లాంఛనంగా ప్రారంభించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు ఫుడ్ ఇండస్ట్రీ, ఔత్సాహిక వ్యాపారవేత్తలు, అంకుర కేంద్రాల వ్యవస్థాపకులు 150 పైగా స్టాళ్లు ఏర్పాటు చేశారు. రామోజీ గ్రూపునకు చెందిన ప్రియా ఫుడ్స్ ఆధ్వర్యంలో 'సబల మిల్లెట్స్' స్టాల్‌లో చిరుధాన్యాల ఉత్పత్తులు విశేషంగా ఆకట్టుకున్నాయి. కేవలం 2 నిమిషాల్లో తయారు చేసుకునేందుకు వీలైన కిచిడీలు, ఉప్మాలు, మిల్లెట్ నూడుల్స్, కుకీస్, ప్రోటీన్ బార్స్ వంటి ఆహార పదార్థాలు ఆకర్షణగా నిలిచాయి. పలు సంస్థల ఆధ్వర్యంలో ఉత్పత్తైన పాల పదార్థాలు, కేకులు, బిస్కట్లు, చాక్లెట్లు, ఇడ్లీలు, సమోసాలు, నూడిల్స్, లడ్డూలను సందర్శకులు తిలకించి రుచులు చూశారు.
"హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థులకు మేము శిక్షణ ఇస్తాం. నేర్చుకున్న వారికి వచ్చిన ఆర్డర్లను సిద్ధం చేసేందుకు అప్పగిస్తాం. సాధారణంగా మైదాతో చేసిన బ్రెడ్, పఫ్స్ చూస్తుంటాం. కానీ, చిరుధాన్యాలతో కూడా వీటిని రుచికరంగా చేసుకోవచ్చు. ఆరోగ్యానికి మేలు చేయడంతో ప్రభుత్వం కూడా వీటిని ప్రోత్సహిస్తోంది" - స్రవంతి, ది బేకర్స్ స్టూడియో వ్యవస్థాపకురాలు
తెలుగు రాష్ట్రాల విభిన్న వంటకాలు : ఫుడ్ పరిశ్రమ వర్గాలు, వినియోగదారులు, చెఫ్స్ అంతా ఆహార వ్యాపారం విస్తృతం చేయడంపై మేథోమదనం సాగించారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల నుంచి విచ్చేసిన పలు కళాశాలల విద్యార్థులకు వంటల తయారీపై పోటీలు నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రా, రాయలసీమ రుచులైన బిర్యానీ, హలీం, రాగిసంకటి, కోడికూర, అలసంద గారెలు వంటివి నోరూరించాయి. గుత్తి వంకాయ, కొబ్బరి బెల్లం మాస్, బెల్లం రవ్వ కేసరి, బోన్ లెస్ చికెన్ తదితర వంటకాలు విశేషంగా ఆకర్షించాయి. వంటల పోటీలో పాల్గొనడంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఆరోగ్యాభిలాషులు సందర్శించి ఆహార పరిశ్రమను ప్రోత్సహించాలని ప్రముఖ చెఫ్స్ సూచించారు.
"ఈ ఫుడ్ ఫెయిర్‌లో చెన్నై, బెంగళూరు, కేరళ నుంచి వచ్చిన ప్రొఫెషనల్ చెఫ్‌లు వచ్చి ప్రత్యక్షంగా రకరకాల ఆహార పదార్థాలను చేసి చూపిస్తున్నారు. దాదాపు 150 స్టాళ్లు ఉన్నాయి. ఇక్కడ వంటకాలకు ఉపయోగించిన సామగ్రి, ప్యాకెటెడ్, ఫ్రోజెన్ ఫుడ్స్, పౌడర్లు, మసాలాలు అన్నింటి గురించీ చెప్తారు. ఎక్కువగా మానవ వనరులు అవసరం లేకుండా ప్రాసెస్ చేసిన పదార్థాలతో సులభంగా వండే వంటకాలు ఇక్కడ పెద్ద మొత్తంలో ఉన్నాయి" - సుధాకర్‌రావు, ఎడ్వైజరీ కౌన్సిల్ సభ్యుడు
డిగ్రీ, డిప్లొమా కోర్సులు అందించేలా : ఫుడ్ ఎ ఫెయిర్-2026లో ఫ్రోజెన్ ఫుడ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కూరగాయలు, పండ్లు, బఠానీలు, స్వీట్ కార్న్, క్యారెట్, బ్రోకలీ వంటివి పలు బ్రాండెడ్ కంపెనీలు తమ ఉత్పత్తుల ప్రదర్శించారు. మాంసం, సీఫుడ్, చికెన్ నగ్గెట్స్, కబాబ్స్, చేపలు, రొయ్యలు, తిన్నడానికి సిద్ధంగా ఉన్న పరాటాలు, సమోసాలు, పిజ్జాలు, ఐస్‌క్రీమ్‌లు పలకరించాయి. సీజన్‌తో సంబంధం లేకుండా అన్ని రకాల ఆహార పదార్థాలు ఏడాది పొడవునా అందుబాటులో ఉంటాయి. బహుళ ప్రయోజనాలు దృష్ట్యా ఈ రంగంలో డిగ్రీ, డిప్లొమా కోర్సులు అందించేందుకు పలు సంస్థలు ముందుకొచ్చి ఉపాధి కల్పిస్తున్నారు.
విదేశీ ఎగుమతుల అవకాశాలపై అవగాహన : దేశంలోని ప్రముఖ చెఫ్‌లు ప్రత్యక్ష వంట ప్రదర్శనలు, ప్రత్యేక రుచుల పరిచయ కార్యక్రమాలు, ఫుడ్ పోటీలు, సదస్సుల తరుణంలో విదేశీ ఎగుమతి అవకాశాలపై అపెడా సంస్థ అవగాహన కల్పిస్తోంది. ఆధునిక ఆహార వాణిజ్యం, ఆవిష్కరణలు, వాల్యూ ఎడిషన్ ఉత్పత్తులు, మార్కెట్ అవకాశాల మధ్య వారధిగా నిలించేందుకు సాగుతున్న ఫుడ్ ఫెయిర్‌కు సందర్శకులు పోటెత్తుతున్నారు. బీ-టు-బీ భేటీలు, కొత్త ఆవిష్కరణలు, ప్రత్యక్ష ప్రదర్శనలు, పరిశ్రమ రంగ నిపుణులతో చర్చలు నడుస్తున్నాయి.
'పూర్వ' వైభవం చాటేలా : పాతబస్తీలోని ఆ 8 కమాన్ల పునరుద్ధరణ
మీ పిల్లల పోషకాహారం స్కోరెంత? - మెరుగుపడాలంటే మెనూలో ఈ 13 ఉండాల్సిందే!

