ETV Bharat / state

పిల్లలకు ఈ 4 'టీ' ఇవ్వండి చాలు! - ఇంట్లో అంతా స్నేహపూర్వక వాతావరణం

ఉరుకుల పరుగుల జీవితాల్లో కుటుంబానికి సమయం ఇవ్వలేని పరిస్థితి - పిల్లలతో సన్నిహితంగా ఉంటే ఇంట్లో స్నేహపూర్వక వాతావరణం - పిల్లలకు మీరు నాలుగు ‘టి’లు ఇవ్వాలి

Follow Four "T" Tips with Your Children
Follow Four "T" Tips with Your Children (Getty Images)
author img

By ETV Bharat Telangana Team

Published : March 2, 2026 at 1:09 PM IST

3 Min Read
Choose ETV Bharat

Follow Four "T" Tips with Your Children : ఈ మధ్యకాలంలో ఉరుకుల పరుగుల జీవితాల్లో ఉద్యోగాల పేరిట తల్లిదండ్రులకు సమయం దొరకడం లేదు. ఉదయం లేచినప్పటి నుంచే మొదలు. టైం అయిందని ఉదయం హడావిడిగా పెద్దలు ఉద్యోగాలకు, పిల్లలు స్కూల్​కు వెళ్తారు. మళ్లీ సాయంత్రం తిరిగి వచ్చే సరికి అలసిపోయి ఇంటికి వస్తారు. దీంతో పిల్లలతో గడిపేందుకు సమయం ఉండటం లేదు. కాని ఇలా పని ఒత్తిడిలో పడి తల్లిదండ్రులు వారిపై కోపాన్ని చూపిస్తే వారి మనసు గాయపడుతుంది. వారితో సమయం గడిపితే కదా వారి గురించి తెలుస్తుంది. అప్పుడే ఇంట్లో స్నేహపూర్వక వాతావరణం వెల్లివిరుస్తుంది.

పిల్లల బాగోగులకు టైం లేదు : ప్రస్తుత డిజిటల్​ కాలంలో పిల్లల చదువులు, ఇతర వాటి అంశాల్లో వారి ప్రతిభ కనబరిచేలా తీర్చిదిద్దేందుకు తల్లిదండ్రులు తపన పడుతున్నారు. మరో వైపు పెరుగుతున్న ఖర్చులతో తల్లిదండ్రులిద్దరూ జాబ్బ్​ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఎదుగుతున్న పిల్లల బాగోగులు చూసుకునేందుకు టైం కేటాయించలేని దుస్థితిలో అధిక శాతం మంది తల్లిదండ్రులు ఉన్నారు. ఈ కారణం చేత చాలా మంది తమ పిల్లలు చదువుల్లో రాణిస్తున్నా మానసిక, శారీరక ఆరోగ్య పరంగా కుంగుబాటుకు గురవుతున్నారని నిపుణులు అంటున్నారు. వారితో సరైన సమయం కేటాయించకపోవడం వారి ఆలోచనల విధానంలో పలు రకాల మార్పులు వస్తున్నాయి.

''మమ్మల్ని ఎప్పుడూ ఫోన్​ చూస్తున్నారు అంటున్నారు కాని దానికి కారణం ఏంటనీ అడిగే వారు లేరు. అమ్మానాన్నలు వారమంతా పని చేస్తున్నారు. వాళ్లకు ఒక రోజు సెలవు దొరుకుతుంది. వారు ఆ ఒక్క రోజు సెలవు తీసుకోరు కదా. మా కోసం ఒక గంట కేటాయించాలి. మమ్మీ మొత్తం చదివేశాం, హోంవర్క్​ కూడా పూర్తయ్యింది. ఈ రోజు పార్క్​కి తీసుకెళ్లమని అడుగుతాం. కాని వాళ్లు ఈ రోజు ఓపిక లేదు. ఇంకెప్పుడైనా వెళ్దాం అంటుంటారు. ఇలా స్కూల్​కు వెళ్లడం, హోంవర్క్​ చేసుకోవడం, ఫోన్​, టీవి తప్ప బయట ఏం జరుగుతుందో తెలియడం లేదు.'' అని తాజాగా ఓ చిన్నారి మాట్లాడింది సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

  • ఓ కుటుంబంలో తల్లిదండ్రులు నిర్మల్‌లో ఉంటారు. ఒక కుమారుడు హైదరాబాద్‌లో మరో కుమారుడు చెన్నైలో ఉంటాడు. ఈ నలుగురు కలసి రాత్రికి ఓ అరగంట కాన్ఫరెన్స్‌ కాల్‌లో కలుస్తారు. ఆ రోజు భోజనం నుంచి ఆఫీసులో జరిగిన విశేషాలన్నీ తల్లిదండ్రులతో కుమారులు షేర్​ చేసుకుంటారు. ఇలా ఒకరికొకరు దూరంగా ఉన్నా వారి ఆత్మీయతతో ఒకే చోట ఉన్నట్లుంటుంది.

ఈ నాలుగు 'టీ'లు ఇస్తే చాలు :

  • టీ ఫర్​ టైం : చాలా వరకు తల్లిదండ్రులు వారి ఖాళీ టైంలో పిల్లలతో గడుపుతారు. కానీ అలా కాకుండా మీరు ఖాళీగా ఉన్నప్పుడు కాకుండా వారికి అవసరమైనప్పుడు సమయం ఇవ్వడం ముఖ్యం. ఇలా రోజుకు కనీసం అరగంట ఫోన్​, టీవీ లేకుండా పిల్లలతో మనసు విప్పి మాట్లాడండి, ఆటలు ఆడండి.
  • టీ ఫర్​ టచ్​ : పిల్లలతో ఆప్యాయంగా ఉండాలి. కోపంలో ఉన్నప్పుడు వారిపై అరవకండి. చిరునవ్వుతో దగ్గరకు తీసుకోవాలి. తలపై చేయి వేయడం, వారిని హత్తుకోవడం వల్ల ఆత్మీయ స్పర్ళ పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
  • టీ ఫర్ టాక్​ : ఇప్పుడున్న పిల్లలకు పెద్ద పెద్ద సందేశాలు అవసరం లేదు. వారితో ఒక ఫ్రెండ్​లా మాట్లాడాలి. అలా వారితో ఈ రోజు ఎలా అనిపించిందని అడిగి ప్రేమగా మాట్లాడండి. ఇతరులతో మాత్రం పోల్చకండి.
  • టీ ఫర్​ ట్రస్ట్​ : పిల్లలపై నమ్మకం ఉంచాలి. వాళ్ల సానుకూల నిర్ణయాలను స్వాగతించాలి. పలు విషయాలపై వారికి స్వేచ్ఛనివ్వాలి. తప్పుజరిగితే సరిదిద్దుకునే అవకాశం వారికి ఇవ్వాలి.

''మా పిల్లలను నేను పాఠశాలకు తీసుకెళ్తాను. అలా కారులో వెళ్తున్న ఆ చిన్నపాటి దూరంలో ఎంతో ఉత్సాహం ఉంటుంది. కూతురు నీటి ఎక్జామ్​ సన్నద్ధమయ్యేటప్పుడు పని ఒత్తిడి లేకుండా దగ్గరుండి ధైర్యం చెప్పడం ద్వారా మంచి ఫలితాన్నిచ్చింది. అలా పిల్లలతో ఆత్మీయంగా ఉంటే వారి మనసు తల్లిదండ్రులకు సులువుగా అర్థమవుతుంది.'' - డా. రామకృష్ణ, నిర్మల్​

మీ పిల్లల ముందు గొడవ పడుతున్నారా? - వారిలో ఈ మార్పులు రావచ్చు!

పిల్లలకు పర్యావరణ పాఠాలు - ఈ గ్రీన్​ పేరెంటింగ్ గురించి మీకు తెలుసా?