నేపాల్‌లో విజృంభిస్తున్న వరదలు - విపత్తు కారణాల గురించి పర్యావరణవేత్తలు ఏమంటున్నారంటే?
నేపాల్‌లో పెనువిషాదాన్ని మిగిల్చిన వరదలు - నీటి ప్రవాహాలకు అడ్డంకులే ప్రధాన కారణమంటున్న విశ్లేషకులు - విపత్తులపై ఎగువ దేశాల సమాచారంతో కింది దేశాలు అప్రమత్తం - పర్యావరణవేత్త డా.ప్రసన్నకుమార్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖీ

Published : August 27, 2026 at 3:42 PM IST
Environmentalist To Tackle Disaster : హిమాలయ దేశం నేపాల్‌ను ముంచెత్తిన ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. వందల మంది గల్లంతు కాగా, అపార ఆస్తి నష్టం సంభవించింది. హిమానీ నదాలు కరిగి నదులు ఉగ్రరూపం దాల్చడం వల్లే పెను విపత్తు సంభవించింది. మారుతున్న వాతావరణ పరిస్థితులకు తోడు నదుల సహజ ప్రవాహాలను అడ్డుకునే రీతిలో నిర్మిస్తున్న జల విద్యుత్ ప్లాంట్లు, రోడ్లు జల విధ్వంసానికి కారణమవుతున్నాయి. హిమాలయ సహజ పర్యావరణ సమతుల్యతను ఎలా దెబ్బతీస్తున్నాయనే అంశాలపై ప్రముఖ పర్యావరణ వేత్త డాక్టర్ ప్రసన్న కుమార్‌తో ఈనాడు-ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖి ద్వారా తెలుసుకుందాం.
నేపాల్‌లో ఇలా ఆకస్మిక వరదలు రావడానికి కారణాలు ఏమై ఉంటాయి?
ప్రకృతి విపత్తులకు కొంతమేర వాతావరణ మార్పులు కారణమవుతున్నాయి. నేపాల్‌లో మంచు పర్వతాలు ఎక్కువగా ఉంటాయి. ఈ దేశానికి పైభాగాన టిబెట్ ఉంటుంది. ఇది పూర్తిగా మంచు ప్రాంతం. ఉష్ణోగ్రతల వల్ల టిబెట్‌లో కరిగిన మంచు దిగువన ఉన్న నేపాల్‌కు వచ్చి చేరుతుంది. కొండ ప్రాంతాల్లో నీటిని ఆపడానికి తటాకాలు, సరస్సులు ఉన్నా వాటి సామర్థ్యానికి మించి వరద చేరినప్పుడు బద్దలవుతుంటాయి. మంచు విపరీతంగా కరుగుతోంది. దీనివల్ల పరిసర ప్రాంతాలకు ముప్పు ఎలా ఉండబోతుంది?
హిమాలయ ప్రాంతాల్లో ఈ సమస్య ఎప్పటికీ ఉంటుంది. అటు సముద్రానికి దగ్గర్లో ఉండే ప్రదేశాలకు కూడా తుఫానుల ప్రభావం ఉంటుంది. నేపాల్ భౌగోళిక స్వరూపాన్ని పరిశీలిస్తే అక్కడ ఉండే పర్వతాలను 'యంగెస్ట్ మౌంటెయిన్స్' అంటారు. అంటే ఇవి దృఢంగా ఉండవు. అందుకే అక్కడ తరచుగా కొండచరియలు విరిగిపడటం సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. దీనికి తోడు అది భూకంపాలు సంభవించే ప్రాంతం.
ప్రస్తుతం మన దేశంలో విపత్తుల గురించి సమాచారం, అప్రమత్తం అందించే వ్యవస్థలు ఎలా ఉన్నాయి?
ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు చాలా ముందస్తుగానే విపత్తుల గురించి తెలుసుకోగలుగుతున్నాం. దేశాల మధ్య సమన్వయంతో కలిసి అప్రమత్తం చేసుకొని, పరస్పరం సహాయం చేసుకుంటే ఇంకా వేగంగా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.
పర్వత ప్రాంతాల్లో వరద విపత్తులకు హైడ్రో ప్రాజెక్టులు, వంతెనలు, రోడ్లు కారణమవుతాయా?
హైడ్రో ప్రాజెక్టులతో నీటిని ఆపుతాం. రోడ్ల నిర్మాణం ద్వారా నీటి ప్రవాహాన్ని మళ్లిస్తాం. ఇలా చేయడం వల్ల రిజర్వాయర్లకు నీటి ఒత్తిడి ఎక్కువవుతుంది. ఫలితంగా అక్కడి భూమి లోపలి పొరలు కరిగిపోవడం, కుంగిపోవడంతో జలాశయాలు తెగిపోతాయి. దీంతో ఒక్కసారిగా వరదలు సంభవిస్తాయి. డ్యామ్‌లు, రోడ్ల నిర్మాణం ద్వారా ప్రకృతిపై ప్రభావం పడుతుంది. ఇది విపత్తుగా మారి రిజర్వాయర్ల మీద కూడా ప్రభావం చూపుతుంది. రెండు పరస్పరం నష్టం చేసుకునే అవకాశం ఉంది.
భవిష్యత్తులో మన దేశానికి ఇలాంటి విపత్తులు రాకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు చేపట్టాలి?
సాధ్యమైనంత వరకు నీటి ప్రవాహానికి ఆటంకం కలిగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పర్వత ప్రాంతాల్లో నీరు స్వేచ్ఛగా ప్రవహించేలా తగిన ఏర్పాట్లు చేయాలి. ప్రభావిత ప్రాంతాలకు ఎగువ, దిగువన ఉండే వారితో సమన్వయం కలిగి ఉండాలి. ముందస్తుగా విపత్తులను పసిగట్టి, అక్కడి ప్రజలకు దాని గురించి అవగాహన కల్పించి అప్రమత్తం చేయాలి. ప్రవాహ ఉద్ధృతి ఎక్కువగా ఉండే ప్రాంతాలకు దూరంగా ఉండాలి. ఒకవేళ అలాంటి ప్రదేశాల్లో నివసిస్తే విపత్తు నిర్వహణలో పాల్గొనేలా శిక్షణ పొంది ఉంటే మంచిది.
వరదొచ్చినా నీళ్లు నిల్వ చేసుకోలేని దుస్థితి - రైతులకు ఏటా కన్నీళ్లే!
జలాశయాలకు తగ్గిన వరద ప్రవాహాలు - ఇక ఎగువ రాష్ట్రాల్లో కురిసే వానలపైనే ఆశలు

