పక్షుల పండుగతో పులికాట్ కళకళ - పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోన్న'ప్లెమింగో ఫెస్టివల్'
పులికాట్ సరస్సు, నేలపట్టు పక్షుల కేంద్రం సందర్శకులతో కిటకిట - పర్యాటకులతో కళకళలాడుతోన్న పులికాట్ సరస్సు - రాష్ట్రంతోపాటు తమిళనాడు, కర్ణాటకల నుంచి వస్తోన్న సందర్శకులు

By ETV Bharat Andhra Pradesh Team
Published : January 11, 2026 at 1:41 PM IST
Flamingo Festival in Tirupati District : తిరుపతి జిల్లాలో జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పులికాట్ సరస్సు, నేలపట్టు పక్షుల కేంద్రం సందర్శకులతో కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలు బాగున్నాయని పర్యాటకులు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి సుమారు 180 రకాల పక్షులు తమ సంతతిని వృద్ధి చేసుకునేందుకు ఇక్కడికి వలస వస్తాయి.
ఈ ఫెస్టివల్ కోసం రాష్ట్రంతోపాటు తమిళనాడు, కర్ణాటకల నుంచి తరలివచ్చిన సందర్శకులు బోట్ షికారుతో సందడి చేశారు. చిన్నా పెద్దా అంతా బోట్ రైడ్‌ను ఆస్వాదించారు. ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలు బాగున్నాయని పర్యాటకులు సంతృప్తి వ్యక్తం చేశారు. దేశ విదేశాల నుంచి వచ్చే రంగురంగుల పక్షుల కిలకిలరావాలతో తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్-2026 వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
సూళ్లూరుపేట ప్రవేశ ద్వారం హోలీ క్రాస్ కూడలి నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆర్చ్ వరకు నిర్వహించిన శోభాయాత్రను సూళ్లూరుపేట, సర్వేపల్లి ఎమ్మెల్యేలు విజయశ్రీ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రారంభించారు. ఫ్లెమింగో ఫెస్టివల్- 2026 బెలూన్‌ను ఆవిష్కరించారు. తర్వాత ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రజాప్రతినిధులు, అధికారులు పరిశీలించారు. వాలీబాల్, కబడ్డీ పోటీలను ఎమ్మెల్యే విజయశ్రీ ప్రారంభించారు.
నేలపట్టులో విదేశీ అతిథుల సందడి: నేలపట్టు పక్షుల కేంద్రంలో విదేశీ అతిథుల సందడి నెలకొంది. సైబీరియా, యూరప్ దేశాల నుంచి వేల కిలోమీటర్లు దాటి వచ్చిన ఫ్లెమింగోలు, పెలికాన్లు, కింగ్‌ఫిషర్లు వంటి 200 రకాల పక్షులు కనువిందు చేస్తున్నాయి. నేలపట్టు నుంచి పులికాట్ వరకు ఉచిత బస్సు సౌకర్యం ఉండటంతో సందర్శకులు సులభంగా చేరుకోగలుగుతున్నారు. ఇది కేవలం పండుగ మాత్రమే కాదని పర్యావరణం, వన్యప్రాణుల రక్షణపై అవగాహన కల్పించే వేదిక అని పర్యావరణ ప్రేమికులు చెబుతున్నారు. ప్రకృతి ఒడిలో, పక్షుల కిలకిల రావాల మధ్య గడపడం మంచి అనుభూతి కలిగిస్తోందని పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ముగింపు కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు: ఈ నెల 12న నిర్వహించే "ఫ్లెమింగో ఫెస్టివల్" ముగింపు కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు. నేలపట్టు, అటకానితిప్ప ప్రాంతాల్లో ఫ్లెమింగో వ్యూ పాయింట్లను సందర్శించి, స్థానిక జిల్లా పరిషత్తు పాఠశాల మైదానంలో నిర్వహించే ఉత్సవంలో సీఎం పాల్గొంటారని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తెలిపారు. పులికాట్ సరస్సు తీరంలో ఈ నెల 10, 11, 12వ తేదీల్లో 'ఫ్లెమింగో ఫెస్టివల్' నిర్వహిస్తున్నారు. ఈ పక్షుల పండగను ముందుగా రెండు రోజులే నిర్వహించాలనుకున్నా సందర్శకుల రద్దీ దృష్ట్యా మరో రోజుకు పెంచినట్లు చెప్పారు.
పక్షులు తమ సంతతిని వృద్ధి చేసుకునేందుకు ఇక్కడికి: ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి సుమారు 180 రకాల పక్షులు తమ సంతతిని వృద్ధి చేసుకునేందుకు ఇక్కడికి వలస వస్తాయి. భారతదేశంలోనే రెండవ అతిపెద్ద ఉప్పునీటి సరస్సు అయిన పులికాట్ పక్షులకు ఆహార కేంద్రంగా ఉంటే, నేలపట్టు చెట్లు వాటి విడిదికి, సంతానోత్పత్తికి ఆలవాలంగా మారాయి. గుడ్లు పెట్టి, పొదిగి, పిల్లలతో తిరిగి తమ దేశాలకు వెళ్లే ఈ అద్భుత ఘట్టం పర్యాటకులకు కనువిందు చేస్తోంది. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా స్థానికులకు, ముఖ్యంగా మత్స్యకారులకు ఉపాధి కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. సందర్శకుల సౌకర్యార్థం నేలపట్టు, సూళ్లూరుపేట, బీవీ పాలెం వద్ద ఉచిత బస్సులు ఏర్పాటు చేశారు.
పక్షుల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన నేలపట్టు కేంద్రం ఇప్పుడు విదేశీ పక్షులతో సందడిగా మారింది. సైబీరియా, ఆస్ట్రేలియా, ఆగ్నేయాసియా దేశాల నుంచి వేల సంఖ్యలో పక్షులు వలస వచ్చి సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా గ్రే పెలికాన్, వైట్ ఐబిస్, లిటిల్ కార్మరెంట్, ఓపెన్ బిల్ స్టార్క్, స్పూన్ బిల్ స్టార్క్ వంటి వివిధ రకాల అరుదైన విదేశీ పక్షులు విడిది చేస్తున్నాయి. ఈ పక్షులను చూసేందుకు సందర్శకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.
రాష్ట్రంలో తొలిసారి నీటి బడ్జెట్! - 2026-27 సంవత్సరానికి రూపొందించిన ప్రభుత్వం

