మంత్రాలయంలో విషాదం - తుంగభద్రలో గల్లంతై ఐదుగురు మృతి
మంత్రాలయం తుంగభద్ర నదిలో శనివారం నాడు గల్లంతైన ఐదుగురు వ్యక్తులు - లభ్యమైన మృతదేహాలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : May 30, 2026 at 7:53 PM IST
|Updated : May 31, 2026 at 12:29 PM IST
5 people Missing in Tungabhadra River : వారంతా బంధుల ఇంట్లో నిర్వహించే శుభకార్యానికి వచ్చారు. బంధువులతో సంతోషంగా ముచ్చటించారు. ఆ తర్వాత బాలుడితో సహా ఐదుగురు వ్యక్తులు తుంగభద్ర నది చూసేందుకు వెళ్లారు. అనంతరం నీటిలోకి దిగారు. ఈ క్రమంలో బాలుడు నీటిలో కొట్టుకుపోతుండగా అతడిని కాపాడేందుకు ప్రయత్నించి మరో నలుగురు గల్లంతయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి ఐదుగురి మృతదేహాలను వెలికితీశారు. ఈ విషాద ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది.
ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మంత్రాలయంలో కాళప్పాచారి ఇంట్లో ఆదివారం వ్రతం ఉండటంతో శనివారం నాడు బంధువులు వచ్చారు. ఇందులో ఆరుగురు వ్యక్తులు తుంగభద్ర నది చూసేందుకు శనివారం సాయంత్రం వెళ్లారు. ఆ తర్వాత నీటిలోకి దిగారు. ఈ క్రమంలో బాలుడు యువన్ చంద్ర(5) నీటిలో కొట్టుకుపోతుండగా అతడిని కాపాడేందుకు ప్రయత్నించి ఒకరి తర్వాత ఒకరు నదిలో గల్లంతయ్యారు. అపర్ణ అనే బాలిక ప్రమాదం నుంచి బయటపడి బంధువులకు సమాచారమిచ్చింది.
Tungabhadra River Tragedy Updates : దీనిపై సమాచారం అందుకున్న మంత్రాలయం సీఐ దస్తగిరి బాబు, అగ్నిమాపక అధికారులు, మత్స్యకారుల సహకారంతో ఘటనా స్థలానికి చేరుకొని నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారు వడ్ల సతీష్(25), రాఘవేంద్ర (25), వడ్ల ధను(22), సంధ్య(21)గా గుర్తించారు. శనివారం సాయంత్రం వడ్ల ధను (22) మృతదేహాన్ని వెలికితీశారు. మిగతా వారికోసం రాత్రి 8:30 గంటల వరకు గాలించినా వారి జాడ దొరకలేదు.
ఈ క్రమంలోనే ఇవాళ గాలింపు చర్యలు చేపట్టగా యువన్ చంద్ర, సతీష్ చంద్ర, రాఘవేంద్ర, సంధ్య మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో సతీష్ చంద్ర, యువన్ చంద్ర తండ్రీ కుమారులు కాగా మిగతా వారంతా దగ్గరి బంధువులు. దీంతో శుభకార్యం జరగాల్సిన ఇంట రోదనలు మిన్నంటాయి. ఈ ఘటనపై జిల్లా ఇంఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు, పరిశ్రమలశాఖ మంత్రి టీజీ భరత్ విచారం వ్యక్తం చేశారు.
రేపు ధవళేశ్వరం బ్యారేజీ నుంచి కాల్వలకు నీటి విడుదల: మంత్రి దుర్గేష్

