ఉషోదయాన ఉల్లాసంగా, ఉత్సాహంగా! - "యోగా, జుంబా డ్యాన్స్ ఫిట్‌నెస్"
ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో 'ఫిట్ హోగా భారత్' - తొలి సంధ్య వేళలో ఆనందోత్సాహల మధ్య వేడుకలా! - ఉదయం 6 నుంచి 8 వరకు ఉత్సాహంగా సాగిన గ్రౌండ్ ఈవెంట్

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 8, 2026 at 5:54 PM IST
Fit Hoga Bharat Yoga Zumba Dance Fitness : ఉషోదయాన 'యోగా, జుంబా, డ్యాన్స్ ఫిట్‌నెస్' ఆద్యంతం ఉల్లాసంగా, ఉత్సాహభరితంగా జరిగాయి. దాదాపు 2 గంటల పాటు పచ్చని ప్రకృతి ఒడిలో పచ్చిక నేలపై యోగాసనాలు, ఆకాశమే హద్దుగా జుంబా డ్యాన్స్ జోరు కొనసాగింది. 'ఫిట్ హోగా భారత్ - 30 రోజుల హెల్త్ ఛాలెంజ్' పేరుతో ఈటీవీ భారత్ ఆదివారం చేపట్టిన ఈ కార్యక్రమానికి హైదరాబాద్ బేగంపేటలోని మయూరి కార్యాలయం వేదికైంది. ఎందరో ఆరోగ్యాభిలాషులు అమితాసక్తితో ఇందులో పాల్గొని ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. ఉదయం 6 నుంచి 8 వరకు జరిగిన ఈ ఆన్ గ్రౌండ్ ఈవెంట్లో ప్రముఖ వైద్య నిపుణులు సైతం పాల్గొని విలువైన సందేశాన్ని అందించారు.
'ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎప్పటికీ మర్చిపోలేను' అని ఓ యువతి సంతోషాన్ని పంచుకోగా, 'జుంబా డ్యాన్స్ ప్రాక్టీస్ చేయాలన్న నా కోరిక ఇవాళ్టికి తీరింది' అని 60 ఏళ్ల వ్యక్తి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి హెల్తీ కార్యక్రమాలు తరచూ నిర్వహించాలని ఒకరు, హాస్పిటళ్ల చుట్టూ తిరగడం కంటే రోజూ ఇలా సమయం కేటాయిస్తే చాలంటూ మరొకరు అభిప్రాయపడ్డారు.
ఈటీవీ భారత్ "30 రోజుల సంకల్పం" : ఆరోగ్యంపై కనీస అవగాహన, జీవన శైలి వ్యాధుల నియంత్రణ, మానసిక, శారీరక ఫిట్‌నెస్ లక్ష్యంగా ఈటీవీ భారత్ 'ఫిట్ హోగా భారత్ - 30 రోజుల హెల్త్ ఛాలెంజ్' కార్యక్రమాన్ని రూపొందించింది. 'ఫ్రీడమ్' హెల్తీ కుకింగ్ ఆయిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న ఈ హెల్తీ ప్రోగ్రామ్ జనవరి 19న ప్రారంభమైంది. నిత్యం ఆన్లైన్లో శిక్షణ తరగతులు కొనసాగుతుండగా, వందలాది మంది రిజిస్ట్రేషన్ చేసుకుని పాల్గొంటున్నారు. ఇందులో భాగంగానే ప్రతి ఆదివారం హైదరాబాద్ బేగంపేటలోని మయూరి కార్యాలయంలో ఆన్ గ్రౌండ్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. ఇప్పటికి రెండు సెషన్స్ పూర్తి కాగా, ఈ నెల 15, 22న ఆన్‌గ్రౌండ్ మీటప్స్ కొనసాగనున్నాయి. యోగా నిపుణులు రషీదా సిధ్పూర్వాలా, జుంబా, డ్యాన్స్ ఫిట్‌నెస్ నిపుణులు విజయ తుపురానీ, వనశ్రీ శర్మ శిక్షణ ఇస్తున్నారు.
ప్రశాంత వాతావరణలో, ప్రోత్సాహక బహుమతులతో : వాహనాల రాకపోకలు, ట్రాఫిక్ రద్దీ ఉండే ప్రాంతమే అయినప్పటికీ తెల్లవారుజామున ప్రశాంత వాతావరణంలో యోగా శిక్షణ కొనసాగింది. కొత్తగా, ఇప్పుడిప్పుడే యోగా నేర్చుకునే వారికి సులభమైన పద్ధతుల్లో శిక్షణ ప్రారంభించి ఆసనాలు నేర్పించారు. శరీరంలో పేరుకున్న అధిక కొలెస్ట్రాల్ తగ్గించుకోవడంపై యోగా నిపుణులు రషీదా సిధ్పూర్వాలా పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా 42 ఏళ్లుగా యోగా సాధన చేస్తున్న వ్యక్తితో పాటు మొదటి రోజు యోగా సాధనకు వచ్చిన మరొకరిని అభినందిస్తూ ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.
"ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంపై అవగాహన కల్పించేలా ఈటీవీ భారత్ మంచి కార్యక్రమం చేపట్టింది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు, ఉద్యోగులు ఇంత యాక్టివ్‌గా పాల్గొనడం చాలా బాగుంది." - డాక్టర్ రాగసుధ, గైనకాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్స్
జుంబా డ్యాన్స్ కోలాహలం : వనశ్రీ శర్మ ఆధ్వర్యంలో జుంబాడ్యాన్స్ శిక్షణ ప్రతి ఒక్కరిలో ఉత్సాహాన్ని రేకెత్తించింది. ఉర్రూతలూగించే సంగీతం, తేలిక పాటి అడుగులతో ప్రతి ఒక్కరూ శరీరం మొత్తాన్ని కదిలిస్తూ స్టెప్పులు వేశారు. చిన్నారులు, యువతీ యువకులు, వృద్ధులు ఉత్సాహంగా పాల్గొని డ్యాన్స్ ప్రాక్టీస్ చేశారు. ఔత్సాహికులను ప్రోత్సహించేలా ఈ సందర్భంగా ముగ్గురికి బహుమతులు అందించారు. అందరికీ ఆరోగ్యం అనే లక్ష్యంతో చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా ఫ్రీడం ఆయిల్ బ్రాండ్ మేనేజర్ జయ్ మెహతా కోరారు.
"ఇక్కడ యోగా, జుంబా డాన్స్ శిక్షణలో పాల్గొనడం చాలా ఉత్సాహంగా అనిపించింది. మా చిన్నతనంలో చేసిన సందడి గుర్తొచ్చింది. చాలా బాగా ఎంజాయ్ చేశాం. యోగా మాకు అలవాటే కానీ, ఇక్కడ అందరిలో కలిసి పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ హెల్త్ కోసం టైం కేటాయించాలి." - మహిళా ఉద్యోగి, బేగంపేట
అవగాహన తప్పనిసరి : మెడికవర్ హాస్పిటల్స్ గైనకాలజిస్ట్ డాక్టర్ రాగ సుధ మాట్లాడుతూ, జీవనశైలి వ్యాధులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఉద్యోగాల్లో ఒత్తిడి సహజమే అయినా తగ్గించుకునే ప్రయత్నాలు చేయాలని, నిత్యం యోగా, వ్యాయామాల్లో పాల్గొనాలని సూచించారు. మహిళా ఉద్యోగుల్లో సహజంగా కనిపించే రుగ్మతలను వివరిస్తూ వాటికి ఎలా అడ్డుకట్ట వేయాలో తెలిపారు. ఆహారంలో కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలని, జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలని వివరించారు.
"నేను రెగ్యులర్‌గా ఈటీవీ భారత్ ఫాలో అవుతుంటాను. ఫిట్ హోగా భారత్ ఆన్లైన్ సెషన్స్ చూసి ఇక్కడికి వచ్చాను. నాలుగు గోడల మధ్య కాకుండా ఇలా ఓపెన్ గ్రౌండ్లో ప్రకృతి ఒడిలో యోగా, జుంబా డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది." - సుబ్రహ్మణ్యం, ఉద్యోగి, ఆల్ ఇండియో రేడియో
మరో రెండు ఆదివారాల్లోనూ : 'ఫిట్ హోగా భారత్ మాకు బాగా నచ్చింది. 30 రోజుల పాటు ఆన్లైన్ సెషన్స్ ఉచితంగా అందించడం చక్కని అవకాశం. రోజూ ఆన్లైన్ క్లాసులతో పాటు గ్రౌండ్ ఈవెంట్లో నేరుగా పాల్గొనే అవకాశం రావడం సంతోషంగా ఉంది' అని పలువురు పేర్కొన్నారు. మరో రెండు ఆదివారాల్లో నిర్వహించే ఈవెంట్లకు కూడా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి హాజరవుతామని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరుతూ బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న తమకు ఈ అవకాశం కల్పించడంపై కృతజ్ఞతలు తెలిపారు.
మళ్లీ ఎప్పుడు, ఎక్కడ, ఎలా పాల్గొనాలంటే? :
ఈటీవీ భారత్ ఫిట్ హోగా భారత్ ఆన్ గ్రౌండ్ ఫిట్‌నెస్ కార్యక్రమాలు మరో రెండు ఆదివారాలు (ఫిబ్రవరి 15, 22) కొనసాగనున్నాయి.
వేదిక : మయూరి ఆఫీస్, బేగంపేట (తాజ్ వివాంతా ముందు, హెచ్‌పీఎస్ స్కూల్ ఎదురుగా), హైదరాబాద్
అందరికీ ఉచితం : ఈ 30 రోజుల హెల్త్ సంకల్పంలో ప్రతి ఒక్కరూ పాల్గొనే అవకాశాన్ని ఈటీవీ భారత్ కల్పిస్తోంది. ఆన్లైన్ సెషన్స్ కోసం https://www.etvbharat.com/fit-hoga-bharat ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలి. గ్రౌండ్ ఈవెంట్లలో పాల్గొనాలనుకునే వారు నేరుగా సకాలంలో హాజరై పేరు నమోదు చేసుకోవచ్చు.
ఉల్లాసంగా ఉత్సాహంగా "ఈటీవీ భారత్ - ఫిట్ హోగా భారత్"
ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఉచిత శిక్షణ 'ఈటీవీ భారత్ - ఫిట్ హోగా భారత్'

