ప్రఖ్యాత ప్లాస్టిక్ సర్జన్ డీఎల్‌ఎన్ ప్రసాద్ కన్నుమూత - శుక్రవారం మహాప్రస్థానంలో అంత్యక్రియలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైద్య రంగానికి విశేష సేవలు - బోన్సాయ్ మొక్కల పెంపకంలోనూ ప్రత్యేక గుర్తింపు - ఈ నెల 9న హైదరాబాద్‌లోని మహా ప్రస్థానంలో అంత్యక్రియలు

Published : January 7, 2026 at 8:44 PM IST
Plastic Surgeon DLN Prasad Died : దక్షిణ భారతదేశంలో ప్రఖ్యాత ప్లాస్టిక్ సర్జరీ నిపుణులుగా పేరొందిన డాక్టర్ దొడ్డపనేని లక్ష్మీ నారాయణ ప్రసాద్ (96) బుధవారం కన్నుమూశారు. కొంతకాలంగా వయోభారంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. డీఎల్‌ఎన్ ప్రసాద్‌గా సుపరిచితులైన ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో విశేషమైన వైద్య సేవలు అందించారు. శుక్రవారం ఉదయం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
డీఎల్‌ఎన్ ప్రసాద్ 1930 డిసెంబరు 8న ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలిలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. చెన్నైలోని ఆద్యార్ బెసంట్ థియోసాఫికల్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో ఎస్‌ఎస్‌ఎల్‌సీ విద్య పూర్తి చేశారు. బయోలజీపై ఆసక్తి ఉన్నప్పటికీ కుటుంబ పరిస్థితుల దృష్ట్యా 1952లో చెన్నైలోని పాచయ్యప్పాస్ కాలేజీలో బీఏ (గణిత శాస్త్రం)లో చేరారు. కుటుంబసభ్యులను ఒప్పించి రామకృష్ణ మిషన్ వివేకానంద కళాశాలలో 1955లో బీఎస్సీ జీవశాస్త్రం పూర్తి చేశారు.
అదే ఏడాది మాజీ మంత్రి ఆలపాటి వెంకట్రామయ్య కుమార్తె ఇందిరను వివాహం చేసుకున్నారు. అనంతరం విశాఖపట్టణంలోని ఆంధ్రా మెడికల్ కాలేజీలో 1961లో ఎంబీబీఎస్, 1964లో ఎం.ఎస్.జనరల్ సర్జరీ చదివారు. హైదరాబాద్‌లోని గాంధీ మెడికల్ కళాశాలలో చేరి, 1969 వరకు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తించారు. తర్వాత దిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో ఎంసీహెచ్ ప్లాస్టిక్ సర్జరీలో చేరి డాక్టర్ జె.ఎల్.గుప్తా పర్యవేక్షణలో ఉద్యోగం చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో తొలి ప్లాస్టిక్ సర్జరీ విభాగం : తర్వాత కొంతకాలానికి హైదరాబాద్‌కు వచ్చిన ప్రసాద్, ఉస్మానియా మెడికల్ కళాశాల, ఆసుపత్రిలో ఉమ్మడి రాష్ట్రంలోనే తొలి ప్లాస్టిక్ సర్జరీ విభాగం ఏర్పాటుకు రకరకాల సన్నాహాలు చేశారు. ఎన్నో సంక్లిష్టతలను అధిగమించి 1972 కల్లా ఆ విభాగానికి ఒక సరికొత్త రూపాన్ని తీసుకొచ్చారు. గుంటూరు, కర్నూలు మెడికల్ కళాశాలలు, ఆసుపత్రుల్లో ప్లాస్టిక్ సర్జరీ విభాగాలను ఏర్పాటు చేయడంలో ప్రముఖ పాత్ర పోషించారు. గ్రహణం మొర్రి, చీలిన అంగిలి, కాలిన గాయాలకు అరుదైన ప్లాస్టిక్ శస్త్ర చికిత్సలు నిర్వహించారు. పేదరికంలోని రోగులకు కొత్త జీవితాలను ప్రసాదించారు. మరో డాక్టర్ రాఘవ రెడ్డితో కలిసి ఉస్మానియాలో ప్లాస్టిక్ సర్జరీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు ప్రారంభించడానికి విశేష కృషి చేశారు. దీని ఫలితంగా 1986లో ఎంసీహెచ్ ప్లాస్టిక్ సర్జరీ అందుబాటులోకి వచ్చింది. 1993లో ఉస్మానియాలో ప్లాస్టిక్ సర్జరీ ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేశారు.
డీఎల్‌ఎన్ ప్రసాద్ సతీమణి ఇందిర తెనాలి ఎమ్మెల్యేగా, గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌గానూ సేవలు అందించారు. ఆమె గతంలోనే పరమపదించారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె గైనకాలజిస్ట్ గోగినేని ఉమ గతంలో తెనాలి నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. చిన్న కుమార్తె ఆలపాటి ఉష హైదరాబాద్ నగరంలో స్థిరపడ్డారు.
ఎన్టీఆర్‌కు శస్త్రచికిత్స చేసి : సీనియర్ ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆయనపై ఓ ఆగంతకుడు కత్తితో దాడి చేశాడు. దీంతో ఆయన చేతి వేలు చీరుకుపోయి గాయాలయ్యాయి. ఆ వేలుకు ప్రసాద్ అరుదైన ప్లాస్టిక్ సర్జరీ చేశారు. సతీమణి ఇందిర చనిపోయాక ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్లేందుకు ఉద్యోగానికి రాజీనామా చేయగా, ప్రసాద్ వైద్య సేవలు ప్రజలకు ఎంతో అవసరమని ఎన్టీఆర్, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆయనను తీవ్రంగా వారించారు.
వైద్య సేవతో పాటు ఆరోగ్యకర హాబీలు ఉండాలనేది ప్రసాద్ ప్రథమ సిద్ధాంతం. అందుకే బోన్సాయ్ మొక్కల పెంపకంపై ఎక్కువగా ఆసక్తి పెంచుకున్నారు. హైదరాబాద్‌లో బోన్సాయ్ పెంపకాన్ని ప్రారంభించిన మొదటి వ్యక్తిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన వద్ద సుమారు 200లకు పైగా బోన్సాయ్ మొక్కలు ఉన్నాయి. రామోజీ ఫిల్మ్‌సిటీలో బోన్సాయ్ గార్డెన్ అభివృద్ధికి సైతం కృషి చేశారు. రామోజీ గ్రూపు సంస్థల వ్యవస్థాపక ఛైర్మన్ రామోజీరావు, ప్రసాద్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది.
"డీఎల్‌ఎన్ ప్రసాద్ పేరుగాంచిన ప్లాస్టిక్ సర్జన్. 1993లో ఉస్మానియా నుంచి రిటైర్ అయ్యారు. దాని తర్వాత కూడా ఎంతో మందికి వైద్య సేవలందించారు. ఇతర ఆసుపత్రుల్లోనూ పని చేశారు. రోస్ సొసైటీ, బోన్సై సొసైటీకి వ్యవస్థాపకులుగా ఉన్నారు. ఆయన తుది శ్వాస వరకు మొక్కలతోనే అధిక సమయం గడిపారు. ఈరోజు ఉదయం సుఖంగా తుదిశ్వాస విడిచారు. సందర్శకుల కోసం మృతదేహాన్ని శుక్రవారం వరకూ హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఆయన స్వగృహంలోనే ఉంచుతాం. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో శుక్రవారం అంత్యక్రియలు నిర్వహిస్తాం." - డాక్టర్ స్వాతి, మనవరాలు

