ETV Bharat / state

వర్సిటీ యూనిట్‌గా అధ్యాపకుల నియామకాలు - తొలి విడతగా 1,500 పోస్టుల భర్తీ

వర్సిటీల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ దిశగా ప్రభుత్వం కార్యాచరణ - రిజర్వేషన్ నిబంధనలను పటిష్టంగా అమలు చేసేందుకు చర్యలు - యూనివర్సిటీల్లో భారీగా అధ్యాపక పోస్టులు ఖాళీలున్నాయన్న లోకేశ్‌

First Phase of the Job Calendar 1500 Faculty Posts
First Phase of the Job Calendar 1500 Faculty Posts (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 20, 2026 at 10:06 AM IST

3 Min Read
Choose ETV Bharat

First Phase of the Job Calendar 1500 Faculty Posts : రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయడంతో పాటు రిజర్వేషన్ నిబంధనలను పటిష్టంగా అమలు చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ రిజర్వేషన్ ఇన్ టీచర్స్ క్యాడర్ బిల్-2026ను మంత్రి లోకేశ్‌ బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. యూనివర్సిటీల్లో భారీగా అధ్యాపక పోస్టులు ఖాళీలున్నట్లు మంత్రి చెప్పారు. ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌లో తొలి విడతగా 15 వందల అధ్యాపక పోస్టులు భర్తీ చేసే లక్ష్యాన్ని నిర్దేశించినట్లు వివరించారు.

రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల అధ్యాపక నియామకాల్లో రిజర్వేషన్, యూజీసీ మార్గదర్శకాలు, గత నియామకాలకు సంబంధించి న్యాయపరమైన వివాదాలను దృష్టిలో పెట్టుకుని కొత్త సవరణలు చేస్తున్నట్లు మంత్రి లోకేశ్‌ తెలిపారు. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ రిజర్వేషన్ ఇన్ టీచర్స్ క్యాడర్ బిల్-2026ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. సవరణల్లో భాగంగా విశ్వవిద్యాలయాన్ని యూనిట్‌గా పరిగణిస్తూ నియామకాల నిర్వహణ, అవసరమైనప్పుడు ఉన్న ఫ్యాకల్టీని అడ్జస్ట్ చేసేందుకు ప్రత్యేక విధానం తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.

వర్సిటీ యూనిట్‌గా అధ్యాపకుల నియామకాలు - తొలి విడతగా 1,500 పోస్టుల భర్తీ (ETV Bharat)

వర్టికల్, హారిజంటల్ విధానాలు రెండింటినీ సమన్వయంతో అమలు చేయాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని చట్టపరమైన స్పష్టత తీసుకొస్తున్నట్లు మంత్రి లోకేశ్‌ చెప్పారు. అధ్యాపక ఖాళీల భర్తీ, రిజర్వేషన్‌కు న్యాయం, నాణ్యమైన ఉన్నత విద్య ఈ 3 లక్ష్యాలను కలిపేలా, కొత్త నియామక వ్యవస్థను ఏర్పాటు చేయడం ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని వివరించారు.

"రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీల్లో చాలా కాలంగా భారీగా అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనివల్ల ఉన్నత విద్య నాణ్యత దెబ్బతింటోంది. అందుకే మా ప్రభుత్వం విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌లో తొలి విడత కింద 1,500 అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించాం.గతంలో జరిగిన నియామకాల వల్ల అనేక న్యాయపరమైన వివాదాలు వచ్చాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని, యూజీసీ నిబంధనలకు లోబడి కొత్త సవరణలు తీసుకొస్తున్నాం. ఇకపై ప్రతి విశ్వవిద్యాలయాన్ని ఒక యూనిట్‌గా పరిగణిస్తూ నియామకాలు చేపడతాం. అవసరమైనప్పుడు ఫ్యాకల్టీని అడ్జస్ట్ చేసేందుకు ఒక ప్రత్యేక విధానాన్ని కూడా తెస్తున్నాం" - లోకేశ్, మంత్రి

వర్సిటీల్లో రిజర్వేషన్‌ ప్రాతినిధ్యానికి ప్రాధాన్యం: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియలో రిజర్వేషన్ల విధానాన్ని మరింత పటిష్ఠం చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర విద్యా సంస్థల చట్టం-2019 మార్గదర్శకాలకు అనుగుణంగా గతంలో తెచ్చిన ‘రాష్ట్ర విద్యా సంస్థల చట్టం-2021’కి కొన్ని స్వల్ప మార్పులు చేస్తూ ప్రభుత్వం సవరణ బిల్లును తీసుకువచ్చింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ శాసనసభలో బిల్లును ప్రవేశపెట్టారు.

ప్రత్యక్ష నియామకాల భర్తీలో విశ్వవిద్యాలయాన్నే ఒక యూనిట్‌గా కొనసాగిస్తారు. దీనివల్ల అన్ని విభాగాల్లోనూ రిజర్వేషన్ల ప్రాతినిధ్యం స్పష్టంగా అమలు అవుతుంది. ఏదైనా విభాగంలో కేటాయించిన రిజర్వేషన్ల ఆధారంగా ప్రస్తుతం పని చేస్తున్న అధ్యాపకులను సర్దుబాటు చేయడం వీలుకాకపోతే, వారికి తగిన పోస్టు వచ్చే వరకు ‘సూపర్‌న్యూమరరీ’ (తాత్కాలిక అదనపు పోస్టు) కింద చూపుతారు. వర్సిటీ పోస్టుల భర్తీ కోసం 2023లో ఇచ్చిన నోటిఫికేషన్‌పై కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఆ విచారణ సమయంలో న్యాయస్థానం వ్యక్తం చేసిన సందేహాలు, లేవనెత్తిన సాంకేతిక అంశాలను క్లియర్ చేస్తూ, భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకే ప్రభుత్వం ఈ మార్పులు చేపట్టింది.

నేడు సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశం - హాజరుకానున్న సీఎం చంద్రబాబు

ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన అడ్మిషన్లు - శాసనమండలిలో ప్రకటించిన మంత్రి నారా లోకేశ్