ETV Bharat / state

30న గిరిజన వర్సిటీ స్నాతకోత్సవం - హాజరుకానున్న రాష్ట్రపతి

చివరి దశలో కేంద్రీయ గిరిజన వర్సిటీ భవన నిర్మాణ పనులు - విజయనగరం జిల్లా మర్రివలస సమీపంలో జోరుగా పనులు - ఏయూ ఆవరణలో ఈ నెల 30న సీటీయూ తొలి స్నాతకోత్సవం

First Convocation of the Tribal University in Vizianagaram
First Convocation of the Tribal University in Vizianagaram (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : June 26, 2026 at 10:01 AM IST

2 Min Read
Choose ETV Bharat

First Convocation of the Tribal University in Vizianagaram : విజయనగరంలోని గిరిజన విశ్వవిద్యాలయం (Tribal University) తొలి స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం కోసం ఆమె ఈ నెల 30న రాష్ట్రానికి రానున్నారు. విశ్వవిద్యాలయానికి సంబంధించిన సొంత భవనాలు ఇంకా సిద్ధం కాకపోవడంతో, ఈ స్నాతకోత్సవ కార్యక్రమాన్ని విశాఖపట్నంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేశ్​ పాల్గొంటారు.

ఇంకా సాగుతున్న నిర్మాణ పనులు : రాష్ట్ర విభజన అనంతరం గత టీడీపీ ప్రభుత్వ హయాంలో విజయనగరం జిల్లా కొత్తవలస మండలం రెల్లి వద్ద సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి శంకుస్థాపన జరిగింది. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విశ్వవిద్యాలయ స్థలాన్ని మెంటాడ దత్తిరాజేరు మండలాల సరిహద్దు ప్రాంతానికి మార్చారు అక్టోబర్ 2023లో కొత్తగా శంకుస్థాపన చేశారు. అయితే, ఆ తర్వాత ఎటువంటి నిర్మాణ పనులు చేపట్టలేదు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, జూలై 2024లో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా చినమేడపల్లి మర్రివలస గ్రామాల్లో 519 ఎకరాల విస్తీర్ణంలో రూ.834 కోట్ల వ్యయంతో భవనాలను నిర్మిస్తున్నారు. అకడమిక్ బ్లాక్‌లోని ఐదు భవనాలు పరిపాలనా భవనం (అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్) నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ ఏడాది భవనాలు అప్పగించిన వెంటనే తరగతులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. నాణ్యమైన నిర్మాణం జరిగేలా పర్యవేక్షణ కొనసాగుతోందని, వచ్చే ఏడాది నాటికి ప్రాజెక్ట్ మొత్తం పూర్తవుతుందని అధికారులు పేర్కొన్నారు.

ముఖ్య అతిథిగా రాష్ట్రపతి : సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ భవనాలు ఇంకా వినియోగానికి పూర్తిగా సిద్ధం కానప్పటికీ తొలి స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రారంభ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ నెల 30న విశాఖపట్నం చేరుకుంటున్నారు. విజయనగరంలోని సెంట్రల్ యూనివర్సిటీ భవనాల నిర్మాణం ఇంకా పూర్తి కాకపోవడంతో విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగే స్నాతకోత్సవంలో రాష్ట్రపతి పాల్గొంటారు. రాష్ట్రపతి పర్యటనకు ముందు విశాఖపట్నంలో జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిజిత్ కిషోర్ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ పరిశీలించారు. కార్యక్రమ నిర్వహణ, ప్రోటోకాల్, భద్రత, వాహనాల పార్కింగ్, అతిథుల కోసం సీటింగ్ ఏర్పాట్లు అత్యవసర సేవలపై వారు అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్, ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి కూడా పాల్గొనాల్సి ఉన్నందున, వారు సంబంధిత అంశాలన్నింటినీ క్షుణ్ణంగా సమీక్షించారు.

కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం

ప్రతి విద్యార్థి ఆంగ్లంలో పట్టు సాధించాలి - కూర్లపల్లి బడిలో నారా భువనేశ్వరి సందడి