శిక్షణ లేని కార్మికులతో బాణసంచా తయారీ - ఎప్పుడు పేలుతాయో తెలియని పరిస్థితి
రాష్ట్రంలో ప్రమాదకరంగా బాణసంచా తయారీ కర్మాగారాలు - కనీస అవగాహన లేనివారితో తయారీ - ఎప్పుడు సామగ్రి పేలుతాయో తెలియని పరిస్థితి - తమిళనాడు శివకాశిలో ఏటా వేల మందికి శిక్షణనిస్తున్న ప్రభుత్వం

By ETV Bharat Andhra Pradesh Team
Published : March 3, 2026 at 12:52 PM IST
Fire Crackers Factory With Unskilled workers: బాణసంచా పేలుడు కర్మాగారంలో పనిచేసే కార్మికులు పొటాషియం నైట్రేట్, బేరియం, మిథైల్ క్లోరైట్, డెస్ట్రిన్ ఈ పేర్లు అసలు తెలీవు. ఆ రసాయనాల లక్షణాలు, వీటిని వేటితో కలిపితే ఏ విధమైన సమ్మేళనాలు ఏర్పడతాయో వీరికి తెలీదు. పదార్ధాల మిశ్రమాన్ని కలిపేటప్పుడు దేని పరిమాణం ఎంతుండాలో, ఆ మోతాదును మించితే ఏం జరుగుతుందో ఓ అంచనా లేదు.
ఈ విధమైన పేలే స్వభావం గల పదార్ధాలతో పని చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో తెలియదు. అరకొర అక్షరజ్ఞానం కలిగిన రోజువారి కార్మికులు. బాణసంచా తయారీ కేంద్రాల్లో పని చేస్తున్నప్పటికీ, అక్కడ పని వాతావరణంపై వీరికి కనీస శిక్షణ లేదు. సీనియర్ కార్మికులను అనుసరిస్తూ వెళ్లడమే. అంతేకాకుండా ఈ పని ఎంత ప్రమాదకరమో వారికి తెలియదు.
కాకినాడ జిల్లా వేట్లపాలెంలో ఇటీవల ఇటీవల సంభవించిన పేలుడులో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎక్కువమంది బాణాసంచా తయారీలో కనీస అవగాహన లేనివారే. ఏపీలో లైసెన్స్ ఉన్న బాణసంచా తయారీ కేంద్రాలు కేవలం 93 మాత్రమే ఉన్నాయి. వీటిలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే 60 ఉండగా, అనకాపల్లి జిల్లాలో 10 ఉన్నాయి. అనధికార బాణసంచా తయారీ కేంద్రాలు దానికి ఐదు లేదా ఆరు రెట్లు ఉంటాయి. ఇవన్నీ ఇప్పుడు పేలుతాయో తెలియని మందుగుండు సామాన్లే. అయితే వీటిని ఇందులో పని చేస్తున్న వేల మంది కార్మికులు జీవితాలు గాలిలో దీపాలే.
ప్రమాదాలకు ప్రధాన కారణాలు: బాణసంచా సామగ్రి మండేందుకు, పేలేందుకు, రంగులను వెదజల్లేందుకు, శబ్దాలు వెలువడేందుకు ఆక్సిడైజర్లు, ఫ్యూయల్స్, కలరెంట్స్, బైండర్స్గా వివిధ రకాల రసాయనాలను వినియోగిస్తారు. ఇవి అత్యంత ప్రమాదకరమైనవి. వీటన్నింటి మిశ్రమాలను కలిపేందుకు, వినియోగించేందుకు సిబ్బందికి ప్రత్యేక నైపుణ్యం, శిక్షణ, పరికరాలు అవసరం. మోతాదులో కొంచెం తేడా వస్తే పేలుళ్లకు కారణమవుతాయి.
- ప్రధానంగా బాణసంచా కేంద్రాల్లో పనిచేసే కార్మికులకు తగినంత శిక్షణ, అనుభవం లేకపోవడం.
- రసాయనాల మిశ్రమాలను కలపే ప్రక్రియలో మెకానికల్ ఫ్రిక్షన్, స్పార్క్స్ తలెత్తడంతో సంభవించే పేలుళ్లు
- అనధికార యూనిట్లలో తగిన వెంటిలేషన్ లేకపోవడం, నివాస గృహాల నుంచి తగినంత దూరాన్ని పాటించకపోవడం
- సిబ్బంది మధ్య తగినంత దూరం పాటించకపోవడం, వ్యక్తిగత రక్షణ పరికరాలను ధరించకపోవడం, ప్రమాదాలు జరిగినప్పుడు అత్యవసర స్పందనకు తగిన యంత్రాగం లేకపోవడం
ప్రమాదం గల రసాయనాలు: బాణసంచా తయారీలో ఆక్సిడైజర్లుగా పొటాషియం నైట్రేట్, పొటాషియం క్లోరేట్, పొటాషియం పెర్‌క్లోరేట్, బేరియం నైట్రేట్, స్ట్రాంటియమ్ నైట్రేట్, సోడియం నైట్రేట్ వంటి రసాయనాలను ఉపయోగిస్తారు. అవి బాణసంచా వేగంగా మండేందుకు అవసరమైన ఆక్సిజన్ సరఫరాకు ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఆక్సిడైజర్లతో కలిసి వేడి, గ్యాస్‌ను ఉత్పత్తి చేసేందుకు ఫ్యూయల్స్‌గా అల్యూమినియం పౌడర్, మెగ్నీషియం, టైటానియం, సల్ఫర్, బొగ్గుపొడిని వినియోగిస్తారు.
రంగులను వెదజల్లేందుకు స్ట్రాంటియం కాంపౌండ్స్, బేరియం, కాపర్, సోడియం, కాల్షియం, ఐరన్ వంటి వాటిని వినియోగిస్తారు. పేలుళ్ల కోసం గన్ పౌడర్ (75% పొటాషియం నైట్రేట్, 15% బొగ్గు, 10% సల్ఫర్) ఉపయోగిస్తారు. ఇంకా కొన్ని ఫ్లాష్ పౌడర్లను సైతం వినియోగిస్తారు. రసాయన పదార్థాల మధ్య బాండేజ్ కోసం డెస్ట్రిన్, గమ్‌అరబిక్ వంటి పదార్థాలు, మిథైల్ క్లోరైడ్ వంటి సాల్వెంట్లు, బేరియం క్రోమేట్ వంటి పదార్థాలను వినియోగిస్తారు.
కాగితాలకే పరిమితమైన నిబంధనలు: ప్రధానంగా బాణసంచా కర్మాగారాల్లో పనిచేసే సిబ్బందికి శిక్షణను ఇవ్వాలనే నిబంధనలను ఆచరణలో అమలు కావడం లేదు. రసాయన పదార్థాలను ఏ విధంగా హ్యాండిల్ చేయాలి?, ఏ విధంగా కలపాలి?, ఎలా నిల్వ చేయాలి?, అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి వంటి అంశాల్లో విధిగా శిక్షణను ఇచ్చిన తర్వాతే పనిలో చేర్చుకోవాలి. అగ్ని ప్రమాదాల నివారణ, ప్రథమ చికిత్స, వ్యర్థాలను సురక్షిత పద్ధతులలో డిస్పోజ్ చేయడంపై ప్రతి మూడు నెలలకు రిఫ్రెషర్ కోర్సులను నిర్వహించాలి.
అంతేకాకుండా సూపర్‌వైజర్లు, ఫోర్‌మెన్‌కు పర్యవేక్షణ, ప్రమాదాల అంచనా, భద్రతా చర్యల అమలులో ప్రత్యేక శిక్షణను అందించాలి. బాణసంచా తయారీ కేంద్రాల్లో కార్మికులకు ప్రత్యేక రక్షణ పరికరాలను ధరించాలి. కానీ ఏపీలో లైసెన్స్ ఉన్న కేంద్రాల్లోనే ఒట్టి చేతులతో రసాయనాలను కలిపేస్తున్నారు. చాలా మందికి కనీసం కాళ్లకు చెప్పులు సైతం ఉండవు. అనధికారిక కేంద్రాల్లో పరిస్థితిని చెప్పాల్సిన అవసరం లేదు. బాణాసంచా కేంద్రాల్లో పేలుళ్లు, మంటలు, శబ్దాల నుంచి రక్షణకు వ్యక్తిగత రక్షణ పరికరాలను తప్పనిసరిగా వినియోగించాలి.
రక్షణ పరికరాలు తప్పనిసరి: మంటలు, వేడి నుంచి రక్షణనిచ్చే మెటీరియల్‌తో తయారైన పొడవు చేతుల చొక్కాలు, ప్యాంట్‌లు, మెరుపుల నుంచి రక్షణనిచ్చే బూట్లు, గ్లోవ్స్, గట్టి టోపీలు ధరించాలి. కళ్లు, ముఖాన్ని రక్షణ కోసం సైడ్ షీల్డ్స్ ఉన్న కళ్లజోళ్లు, రసాయనాల మిక్సింగ్ పనులను చేసేవారు ముఖం మొత్తాన్ని కప్పుకునే విధంగా ఫుల్‌షీల్డ్‌లను ధరించాలి. వీటితోపాటు దుమ్ము, రసాయన వాయువుల నుంచి రక్షణకు శ్వాసకోశ రక్షణ వ్యవస్థలు ఉండాలి. అగ్నిమాపక పరికరాలు, స్ప్రింక్లర్లు, స్మోక్ డిటెక్టర్ వంటి పరికరాలుండాలి.
శివకాశిలో ప్రత్యేక కార్యక్రమాలు: తమిళనాడులోని విరుధ్‌నగర్ జిల్లా శివకాశిలో దాదాపు గత శతాబ్ద కాలంగా బాణసంచాను తయారు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా వినియోగించే బాణసంచాలో 80-90 శాతం అక్కడే ఉత్పత్తవుతుండటం గమనార్హం. తమిళనాడులోని సుమారు 1,500 లైసెన్స్‌డ్ యూనిట్‌లలో అత్యధికం శివకాశి, దాని చుట్టుపక్కల చుట్టే ఉన్నాయి. అక్కడ అనధికారికంగా 8,000 యూనిట్‌లు ఉంటాయని ఓ ప్రాథమిక అంచనా. ఇక్కడ ఒకప్పుడు ప్రమాదాలు తరచూ జరిగేవి. కానీ ప్రభుత్వం తగిన నియంత్రణ చర్యలు చేపట్టడం, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో కొంతకాలంగా ప్రమాదాలనేవి అదుపులోకి వచ్చాయి.
ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి, ఇప్పటికే వేల మందికి శిక్షణను అందించింది. ఒక్క 2024వ సంవత్సరంలోనే మొత్తం 7,500 మంది శిక్షణ పొందారు. అదే విధంగా పెసో, ఇతర సంస్థలతో కలిసి సూపర్‌వైజర్లు, ఫోర్‌మెన్‌కి ప్రత్యేక శిక్షణను ఇస్తోంది. మదురై, శివగంగ , థేని, దిండిగల్ జిల్లాల్లోనూ ప్రత్యేక శిబిరాలు, అవుట్‌రీచ్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
పేలిన పార్సిల్‌లో ఉన్నవి అవే - పార్వతీపురం ఘటనపై దర్యాప్తులో నిజాలు
చిన్నపాటి నిర్లక్ష్యమే నిప్పురవ్వై - శ్మశానంలా మారిన సూర్యశ్రీ ఫైర్‌వర్క్స్ ప్రాంగణం

