ETV Bharat / state

టాటా-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం - వృద్ధుడు సజీవ దహనం

దువ్వాడ మీదుగా ఎర్నాకుళం వెళ్లే టాటా-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం - బీ1, ఎం2 ఏసీ బోగీలు పూర్తిగా దగ్ధం - రెండు గంటల పాటు శ్రమించి మంటలార్పిన ఫైర్​ సిబ్బంది

Fire Accident in Ernakulam Train
Fire Accident in Ernakulam Train (Eenadu)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : December 29, 2025 at 6:45 AM IST

|

Updated : December 29, 2025 at 2:31 PM IST

5 Min Read
Choose ETV Bharat

Fire Accident in Ernakulam Train: విశాఖ జిల్లా దువ్వాడ మీదుగా ఎర్నాకుళం వెళ్లే టాటా-ఎర్నాకుళం(18189) ఎక్స్‌ప్రెస్‌ ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.30 గంటల సమయంలో అగ్నిప్రమాదానికి గురైంది. రైలులోని ప్యాంట్రీ కారును ఆనుకుని ఉన్న బీ1, ఎం2 ఏసీ బోగీల్లో మంటలు చెలరేగాయి.

బ్రేక్‌లు పట్టేయడంతో మంటలు: ఈ విషయాన్ని ఎలమంచిలి సమీపంలోని పాయింట్‌ వద్ద లోకో పైలట్లు గుర్తించి స్టేషన్‌లో రైలును నిలుపుదల చేశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే రెండు బోగీలకు మంటలు పూర్తిగా వ్యాపించి దగ్ధమయ్యాయి. ఈ ఘటనతో భయాందోళనకు గురైన ప్రయాణికులు బోగీల్లో నుంచి దిగి స్టేషన్‌లోకి పరుగులు పెట్టారు. దట్టమైన పొగ వ్యాపించడంతో అసలు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ రైలు అనకాపల్లికి నాలుగు గంటలు ఆలస్యంగా చేరుకుంది. అక్కడి నుంచి బయలుదేరిన అనంతరం నర్సింగబల్లి వద్ద బీ1 ఏసీ బోగీ బ్రేక్‌లు పట్టేయడంతో అగ్నికీలలు వ్యాపించినట్లు సమాచారం.

టాటా-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం - వృద్ధుడు సజీవ దహనం (ETV)

అనకాపల్లి, ఎలమంచిలి, నక్కపల్లి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పడానికి శ్రమించారు. రెండు బోగీల్లోని ప్రయాణికుల సామగ్రి మొత్తం కాలిపోయింది. అనంతరం ప్రమాదంపై రైల్వే ఉన్నతాధికారులు స్టేషన్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. హుటాహుటిన అంబులెన్స్‌లను ప్రమాద స్థలానికి రప్పించారు. చలిలో సుమారు 2,000 వేల మంది ప్రయాణికులు స్టేషన్‌లో పడిగాపులు పడ్డారు. ఈ నేపథ్యంలో విశాఖ-విజయవాడ మార్గంలో రైళ్లన్నీ నిలుపుదల చేశారు. 3.30 గంటలు దాటిన తర్వాత రైల్వే అధికారులు కాలిపోయిన రెండు బోగీలను తొలగించి, ఆయా బోగీల్లోని ప్రయాణికులను మిగతా బోగీల్లో సర్దుబాటు చేసి రైలును పంపించారు.

సామర్లకోట రైల్వే స్టేషన్​కు తరలింపు: అనకాపల్లి జిల్లా యలమంచిలి రైల్వే స్టేషన్లో టాటా నగర్ రైలు ప్రమాదం జరిగిన బోగీలోని 124 మంది ప్రయాణికులను రైల్వే అధికారులు సామర్లకోట రైల్వే స్టేషన్​కు తరలించారు. ఎం-1, బీ-2 బోగీల్లో ప్రయాణిస్తున్న వీరిని ఆర్టీసీ బస్సులలో సామర్లకోట రైల్వే స్టేషన్​కు తరలించి వారికి అల్పాహారం, మంచినీళ్లు వసతి ఏర్పాట్లను చేశారు.

ఈ రైలు సామర్లకోటకు రాత్రి 10:15 నిమిషాలకు చేరాల్సి ఉండగా ఉదయం 9:30 గంటలకు సామర్లకోటకు చేరుకుంది. రెండో నెంబర్ ప్లాట్​ఫాం ఉంచి అప్పటికే సిద్ధం చేసిన ఏసీ కోచ్​లను జతపరిచి విశ్రాంతి గదుల్లో ఉన్న ప్రయాణికులను రైల్వే పోలీస్ అధికారులు దగ్గరుంటే వారిని రిజర్వేషన్ బోగీల వద్దకు తీసుకువచ్చి రైలు ఎక్కించారు.

ఇబ్బందులను ఎదుర్కొన్న రైతులు: రెండో నెంబరు ప్లాట్​ఫాం సిద్ధం చేసిన టాటా నగర్ ఎర్నాకులం 18189 నంబరు గల రైలుకు మూడు ఏసీ బోగిలను ఏర్పాటు చేసి ప్రయాణికులకు వారి రిజర్వేషన్ల ప్రకారం సీట్లను కేటాయించి గమ్యస్థానాలకు చేర్చేందుకు తరలించారు. అనంతరం 10:55 నిమిషాలకు రైలు సామర్లకోట నుంచి బయలుదేరి వెళ్ళింది. సుమారు 12 గంటలు రైలు ఆలస్యంగా నడవటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే ఘటనకు చెందిన లగేజీలు, బ్యాగులు ,సెల్ ఫోన్లు పోయాయని ప్రమాదం జరిగిన బోగీలలోని ప్రయాణికులు వాపోయారు.

ప్రమాదంలో ఒకరి మృతి: బోగీల్లో మంటలు అదుపులోకి వచ్చాయి. అయితే B1 బోగీలో ఒకరు సజీవ దహనమైనట్లు అధికారులు తెలిపారు. మృతుడిని విజయవాడకు చెందిన చంద్రశేఖర్ సుందర్(70)గా గుర్తించారు. మరోవైపు రెండు బోగీల్లోని ప్రయాణికులను సామర్లకోట స్టేషన్‌కు 3 ఆర్టీసీ బస్సుల్లో తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. సామర్లకోటలో 2 ఏసీ బోగీలను జత చేసి అక్కడి నుంచి ఎర్నాకుళానికి తరలించనున్నారు.

ఆ రైళ్లు ఆలస్యం: రెండు బోగీల్లోని ప్రయాణికులను ఎర్నాకుళం తరలించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రెండు బోగీల ప్రయాణికులను ప్రత్యేక బస్సుల్లో తరలించేందుకు సైతం ఏర్పాట్లను చేశారు. ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌ బీ1 బోగీలో 75 మంది, ఎం2 బోగీలో 82 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మంటల వ్యాప్తికి ప్రయాణికుల సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. విశాఖ నుంచి విజయవాడ వైపు వెళ్లే పలు రైళ్లు ఆలస్యం కానున్నాయి. అనకాపల్లి, విశాఖ, తుని రైల్వేస్టేషన్లలో పలు రైళ్లు నిలిచాయి.

సేఫ్టీ అధికారులు పరిశీలన: అగ్ని ప్రమాదానికి గురైన రైలులోని మిగిలిన బోగీలను సేఫ్టీ అధికారులు పరిశీలించారు. సేఫ్టీ అధికారులు క్లియరెన్స్‌ అనంతరం ఎలమంచిలి నుంచి రైలు బయలుదేరనుంది. ముఖ్యంగా ఎం2, బీ1 బోగీల్లో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదానికి గల కారణాలపై అంచనా వేస్తున్నామని అధికారులు ఈ సందర్భంగా తెలిపారు.

ప్రమాదంపై స్పందించిన రైల్వే సిబ్బంది: అగ్నిప్రమాదంపై రైల్వే సిబ్బంది మాట్లాడుతూ అగ్నిప్రమాదంలో బీ1 బోగీలో ఒకరు మృతి చెందారని అధికారులు తెలిపారు. మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చామని పేర్కొన్నారు. ఇతర ప్రయాణికుల బంధువులు ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పారు. రెండు బోగీల్లో ఉన్న ప్రయాణికులకు ప్రత్యేక బస్సు ఏర్పాట్లు చేశామని భరోసా ఇచ్చారు. మంటలు అదుపు చేయడానికి 2 గంటల సమయం పట్టిందని వివరించారు. త్వరగా స్పందించి మంటలు అదుపు చేసేందుకు సహకరించిన అందరికీ రైల్వే సిబ్బంది అభినందనలను తెలియజేశారు.

హెల్ప్‌లైన్​ నంబర్లు ఏర్పాటు: ఎలమంచిలి రైలు ప్రమాదం దృష్ట్యా ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లను రైల్వే అధికారులు ఏర్పాటు చేశారు. దీని ద్వారా ప్రయాణికులకు రైళ్ల సమాచారం, ఇతర రకాలైన మౌలిక సౌకర్యాలను తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది.

స్టేషన్ల వారీగా హెల్ప్‌లైన్​ నంబర్లు

  • ఎలమంచిలి 78159 09386,
  • అనకాపల్లి 75693 05669
  • తుని 78159 09479,
  • సామర్లకోట 738262 9990
  • రాజమహేంద్రవరం 0883-2420541, 2420543
  • ఏలూరు 75693 05268
  • విజయవాడ 0866-2575167

స్పందించిన హోం మంత్రి అనిత: యలమంచిలి రైలు ప్రమాదంపై హోంమంత్రి అనిత స్పందించారు. అధికారులతో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైలు ప్రమాదం ఘటనలో ఒకరు చనిపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రైళ్ల రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఈ సందర్భంగా కోరారు.

పల్లా శ్రీనివాసరావు దిగ్భ్రాంతి: యలమంచిలి రైలు ప్రమాదంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రైలు ప్రమాదం ఘటనలో ఒకరు మృతి చెందడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది వేగంగా స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు.

ఘటనపై ఎఫ్‌ఎస్‌ఎల్‌ బృందాల దర్యాప్తు: ఎలమంచిలి రైలు ప్రమాద ఘటనపై రెండు ఎఫ్‌ఎస్‌ఎల్‌ బృందాల దర్యాప్తు చేస్తున్నాయి. అగ్నికి ఆహుతైన బోగీలను అనకాపల్లి ఎస్పీ తుహిన్‌ సిన్హా, దక్షిణ మధ్య రైల్వే సేఫ్టీ కమిషనర్‌ పరిశీలించారు.

"ఎలమంచిలి వద్ద ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌ ఎం2, బీ1 బోగీల్లో ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి 12.40 గం.కు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఫైర్‌ సిబ్బంది స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మంటలు అదుపు చేయడానికి 2 గంటల సమయం పట్టింది. ప్రమాదానికి గల కారణాలపై అంచనా వేస్తున్నాం. అగ్నిప్రమాదంలో బీ1 బోగీలో ఒకరు మృతి చెందారు. మృతుడి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చాం. ఇతర ప్రయాణికుల బంధువులు ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. రెండు బోగీల్లో ఉన్న ప్రయాణికులకు ప్రత్యేక బస్సు ఏర్పాట్లు చేశాం." -తుహిన్‌ సిన్హా, ఎస్పీ అనకాపల్లి

విశాఖ కార్ల షోరూమ్‌లో అగ్నిప్రమాదం - ఎగసిపడిన మంటలు

ఏపీలో మరో భారీ అగ్ని ప్రమాదం - రూ. 500 కోట్ల ఆస్తి నష్టం

Last Updated : December 29, 2025 at 2:31 PM IST