ETV Bharat / state

ఏసీ బోగీల్లోనే తరచుగా అగ్ని ప్రమాదాలు - నిర్వహణపై నిర్లక్ష్యమే కారణమా?

రైళ్లలోని ఏసీ బోగీల్లోనే తరచుగా అగ్ని ప్రమాదాలు - నిర్వహణపై తొలి నుంచి నిర్లక్ష్యంగా అధికారులు - తగిన సంఖ్యలో నిపుణులు లేకపోవడంతో వాటి నిర్వహణ తీరుపై అనుమానాలు

FIRE ACCIDENTS IN AC TRAINS
FIRE ACCIDENTS IN AC TRAINS (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : December 30, 2025 at 6:39 PM IST

2 Min Read
Choose ETV Bharat

Fire Accidents Frequently Occur in AC Compartments of Trains: రైళ్లలోని ఏసీ బోగీల్లోనే తరచుగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. తగిన సంఖ్యలో నిపుణులు లేకపోవడంతో వాటి నిర్వహణ తీరుపై మొదటి నుంచి అనుమానాలు తలెత్తుతున్నాయి. దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించే రైలులో కనీసం 8 మంది సిబ్బంది ఉంటారు. అందులో ముగ్గురు రైల్వే ఉద్యోగులు కాగా, మిగిలిన వారు పొరుగుసేవల సిబ్బంది ఉంటారు. వీరిలో మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఏసీ టెక్నీషియన్, ఇతర సిబ్బంది ఉంటారు. వారికి ఎక్కువ జీతాలు ఇవ్వాల్సి ఉండటంతో గుత్తేదారు అరకొరగా నియమిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో పూర్తిస్థాయిలో తనిఖీలు చేపట్టలేని పరిస్థితి తలెత్తింది.

  • గత ఏడాది విశాఖ రైల్వే స్టేషన్‌ 4వ నెంబరు ప్లాట్‌ఫామ్‌పై ఉన్న కోర్బా ఎక్స్‌ప్రెస్‌ (18517)లోని బీ7 ఏసీ బోగి అగ్ని ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో ప్రయాణికులు లేకపోవడంతో భారీ ప్రమాదమే తప్పింది.
  • ఇప్పుడు ఎలమంచిలిలో టాటా - ఎర్నాకుళం (18189) ఎక్స్‌ప్రెస్‌లో బీ1, ఎం2 ఏసీ బోగీలు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి.

ఫిర్యాదులొస్తేనే స్పందన: రైళ్లకు సంబంధించి ప్రైమరీ, సెకండరీ తనిఖీలు నిర్వహించాల్సి ఉంది. ప్రైమరీ కింద 30కి పైగా రైళ్లను విశాఖలోనే తనిఖీ చేయాలి. ఇంజిన్‌ నుంచి మరుగుదొడ్ల వరకు అన్నీ పరిశీలించి ఫిట్‌గా ఉన్నాయని నిర్ధారించాకే రైలును పంపాలి. సిబ్బంది కొరతతో ఈ ప్రక్రియ సరిగా జరగడం లేదనే విమర్శలు వస్తున్నాయి. బోగీల్లో ఏసీలు సరిగా పనిచేయడం లేదని ఫిర్యాదులు వస్తే తప్ప తనిఖీలు చేయడం లేదు. దీంతో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని అంటున్నారు.

సిబ్బంది కొరత: గత 2 ఏళ్లుగా రైళ్లలో ఏసీ బోగీల సంఖ్యను పెంచారు. అయితే వాటి నిర్వహణకు అవసరమైన నిపుణులు లేకపోవడం సమస్యగా మారింది. లోకోషెడ్‌లో రైలు చక్రాలు, ఇంజిన్‌ ఇతర మెకానికల్‌ పనులు రైల్వే చూస్తుండగా ఏసీల నిర్వహణ, పారిశుద్ధ్యం, ఎలక్ట్రికల్‌తో పాటు మరికొన్నింటిని పొరుగుసేవల సిబ్బందితో చేయిస్తున్నారు.

రైలు ప్రమాదంపై విచారణ: విజయవాడ డివిజన్‌ పరిధిలోని ఎలమంచిలి రైల్వేస్టేషన్‌ వద్ద రైలు నంబరు 18189 టాటానగర్‌-ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై ఈ నెల 31, జనవరి 1వ తేదీల్లో విజయవాడలోని సత్యనారాయణపురం ఈటీటీసీలో విచారణ జరుగుతుందని రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. సాక్ష్యాలు ఇవ్వాలనుకునే వారు ఫోన్‌ నంబరు 040-27820104లో సంప్రదించవచ్చని తెలిపారు.

బ్రేక్‌లు పట్టేయడంతో మంటలు: విశాఖ జిల్లా దువ్వాడ మీదుగా ఎర్నాకుళం వెళ్లే టాటా-ఎర్నాకుళం(18189) ఎక్స్‌ప్రెస్‌ ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.30 గంటల సమయంలో అగ్నిప్రమాదానికి గురైంది. రైలులోని ప్యాంట్రీ కారును ఆనుకుని ఉన్న బీ1, ఎం2 ఏసీ బోగీల్లో మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని ఎలమంచిలి సమీపంలోని పాయింట్‌ వద్ద లోకో పైలట్లు గుర్తించి స్టేషన్‌లో రైలును నిలుపుదల చేశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే 2 బోగీలకు మంటలు పూర్తిగా వ్యాపించి దగ్ధమయ్యాయి. ఈ ఘటనతో భయాందోళనకు గురైన ప్రయాణికులు బోగీల్లో నుంచి దిగి స్టేషన్‌లోకి పరుగులు పెట్టారు. దట్టమైన పొగ వ్యాపించడంతో అసలు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ రైలు అనకాపల్లికి నాలుగు గంటలు ఆలస్యంగా చేరుకుంది. అక్కడి నుంచి బయలుదేరిన అనంతరం నర్సింగబల్లి వద్ద బీ1 ఏసీ బోగీ బ్రేక్‌లు పట్టేయడంతో అగ్నికీలలు వ్యాపించినట్లు సమాచారం.

ఇప్పటికీ కొలిక్కి రాని చోరీ కేసులు - రైలెక్కాలంటేనే భయపడుతున్న ప్రయాణికులు!

రైలు​ ఢీకొని 7 ఏనుగులు మృతి- పట్టాలు తప్పిన బోగీలు