ETV Bharat / state

జూబ్లీహిల్స్​లో భారీ అగ్ని ప్రమాదం - ప్రాణాలతో బయటపడిన ఆ నలుగురు

జూబ్లీహిల్స్ మెట్రోస్టేషన్‌ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం - వస్త్ర దుకాణంలో భారీగా ఎగిసిపడిన మంటలు - ఫైరింజన్లతో మంటలు ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది - ఖాళీగా ఉన్న వస్త్రదుకాణం స్టోర్

Fire Accident in Jubilee Hills
Fire Accident in Jubilee Hills (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : February 26, 2026 at 6:45 PM IST

3 Min Read
Choose ETV Bharat

Fire Accident in Jubilee Hills : హైదరాబాద్‌ నగరంలో అగ్నిప్రమాదాలు జరగడం, కొన్ని సార్లు ప్రజలు ప్రాణాలు కోల్పోవడం, మరికొన్నిసార్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటపడటం కొత్తేమీ కాదు. జనవరి నెలలో నాంపల్లిలోని ఫర్నిచర్‌ దుకాణంలో జరిగిన అగ్నిప్రమాద ఘటన ఐదుగురు మృతి చెందారు. ఈ విషాధ ఘటన మరువక ముందే ఫిబ్రవరి 20న అమీర్‌పేట మైత్రీవనం చౌరస్తాలోని ఆదిత్య ఎన్‌క్లేవ్‌ భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చిక్కుకున్న ప్రాణాలతో బయటపడ్డారు. తాజాగా జూబ్లీహిల్స్​లోని ఓ వస్త్రదుకాణంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

ప్రాణాలతో బయటపడిన ఆ నలుగురు : జూబ్లీహిల్స్ రోడ్‌ నంబర్ 36లోని ఓ వస్త్రదుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదం కలకలం సృష్టించింది. చెక్‌పోస్ట్ మెట్రో స్టేషన్ సమీపంలోని ఓ వస్త్ర దుకాణం వెలపల అంటుకున్న మంటలు క్రమంగా నాల్గో అంతస్తు వరకూ వ్యాపించాయి. భవనానికి ముందు భాగంలో ప్లాస్టర్‌ ఆఫ్ పారిస్​తో చేసిన దేవాలయ నమూనా పూర్తిగా దగ్దమైంది. గత కొంత కాలంగా స్టోర్ మూసి వేసి లోపల ఆధునీకరణ పనులు చేస్తున్నారు. వారం రోజులుగా నలుగురు అక్కడ పని చేస్తున్నారు. వారంతా మంటలు గమనించి అతి కష్టంమీద బయటకు వచ్చారు.

వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం : మొదటి అంతస్తు నుంచి వ్యాపించిన మంటలు నాల్గో అంతస్తు వరకూ వ్యాపించడం గమనించిన స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందిచారు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పివేశారు. ఘటనాస్థలంలో డీఆర్‌ఎఫ్‌, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు సైతం చేరుకుని ఫైర్‌ సిబ్బందికి ఆటంకం కలగకుండా చూశారు.

చనిపోతామని భయమేసింది : వారం రోజులుగా లోపల వెల్డింగ్ సహా ఇతర పనులు చేస్తున్న నలుగురు పనివాళ్లు ఈ ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. మొదటి అంతస్తులో పని చేస్తుండగా తొలుత మంటలు కింద అంటుకోగా, క్రమంగా నాల్గో అంతస్తు వరకూ వ్యాపించాయి. మంటలు చూసి వెంటనే అక్కడి నుంచి పై అంతస్తులకు వెళ్లారు. పొగలు దట్టంగా ఉండటంతో ఊపిరాడక ఇబ్బందులు పడ్డారు. చివరకు మొదటి అంతస్తులో భవన అద్దాలను పగలకొట్టి బయటపడ్డారు. మంటలు వచ్చిన వెంటనే తమతో పాటు ఉన్న ఓనర్ బయటకు వెళ్లిపోయాడని, తమను అప్రమత్తం చేసి ఉంటే ఇంకా ముందే బయటకు వచ్చేవాళ్లమని పని వాళ్లు చెబుతున్నారు. ఓ దశలో శ్వాస ఆడక చనిపోతామని భయమేసిందని వెల్లడించారు. మరోవైపు ఘటనాస్థలాన్ని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ పరిశీలించారు. ఘటనపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునారావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

దర్యాప్తులో తెలుస్తుంది : 11.20 ఫైర్ కాల్ వచ్చిందని, మూడు ఫైర్ ఇంజన్లుతో మంటలు ఆర్పివేశామని ఘటనపై దర్యాప్తు చేస్తామని సికింద్రాబాద్‌ అగ్నిమాపక అధికారి శ్రీరాజు తెలిపారు. భవనానికి అగ్నిమాపక శాఖ అనుమతులు ఉన్నాయో లేదో అని దర్యాప్తులో తెలుస్తుందని అన్నారు. మంటలను ఆర్పేందుకు సుమారు 30మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారని అయన వెల్లడించారు.

"11.20 ఫైర్ కాల్ వచ్చింది. లోపల ఎలాంటి మెటీరియల్ లేదు. మూడు ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పేశాం. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తాం. లోపల ఉన్నావారు ఘటన జరిగిన వెంటనే బయటకు వచ్చేశారు. ఎలాంటి ప్రాణ నష్టం లేదు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తాం. " - శ్రీరాజు, సికింద్రాబాద్‌ అగ్నిమాపక అధికారి

భద్రత కాగితాలకే : హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం జరిగినప్పుడే నిబంధనల ఉల్లంఘనలు వెలుగులోకి వస్తుండడం విచిత్రం. ప్రమాదం జరిగిన తర్వాత సీజ్ చేయడం, కేసులు, కమిటీలు ఇవన్నీ పరిపాటిగా మారాయి. ప్రమాదం జరగడానికంటే ముందే నిరంతరం విస్తృత తనిఖీలు ఎందుకు లేవనేది సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోతుంది. ఎన్ని భవనాల సెల్లార్లలో నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు సాగుతున్నాయో? స్పష్టమైన డేటా లేకపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. నగరం అభివృద్ధి చెందుతున్న కొద్దీ భవనాలు ఎత్తు కూడా పెరుగుతోంది. కానీ భద్రత మాత్రం కాగితాలకే పరిమితమవుతోంది. ఎంత మంది మరణించినా ప్రభుత్వ విభాగాలకు మాత్రం కనువిప్పు కలగడం లేదు.

కోచింగ్ సెంటర్​ ఉన్న బిల్డింగ్‌లో భారీ అగ్నిప్రమాదం - సకాలంలో గుర్తించడంతో తప్పిన పెనుముప్పు

వేసవి కంటే ముందే భగ్గుమన్న భాగ్యనగరం - రెండు నెలల్లో 100కు పైగా అగ్నిప్రమాదాలు