సామాజిక న్యాయానికి బడ్జెట్‌లో పెద్దపీట - సంక్షేమానికే ఏకంగా 17శాతం నిధులు కేటాయింపు
బీసీ సంక్షేమానికి రూ. 51వేల కోట్లు కేటాయించిన ఆర్థికమంత్రి - ఎస్సీ సంక్షేమానికి రూ. 20, 644కోట్లు - ఎస్టీ సంక్షేమానికి రూ.9, 190 కోట్లు కేటాయింపు

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 14, 2026 at 7:28 PM IST
Funds Allocation for Welfare in 2026 : విధ్వంసం నుంచి వికాసం దిశగా కూటమి ప్రభుత్వం సరికొత్త సమున్నత లక్ష్యాలు నిర్దేశించుకుంది. ఈ దిశలో ఇప్పుడెక్కడున్నాం? ఇంకెంత వేగంతో వెళ్లాలని మదించుకుని స్పష్టమైన దృక్పథంతో 2026-27 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టింది. కేంద్రం ఆలంబనతో స్వయం స్వావలంబన సాధిస్తామని విశ్వాసం ప్రకటించింది. ఎన్నిసవాళ్లు ఎదురైనా సంక్షేమం, అభివృద్ధి సవారీ చేస్తామని భరోసా ఇచ్చింది. ఎకనమిక్ రీజియన్ కారిడార్ల ద్వారా మూడుప్రాంతాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామని ప్రకటించింది. సంపద సృష్టి కోసం రూ.వందకోట్ల కార్పస్‌తో ఏపీ వెల్త్ ఫండ్ ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. ఆర్థిక క్రమశిక్షణతో, రాష్ట్రాన్ని అగ్రపథంలో నిలుపుతామని హామీ ఇచ్చింది.
రూ.3లక్షల 32వేల 205 కోట్ల రూపాయలతో 2026-27 వార్షిక పొద్దు పొడిచింది. రాష్ట్రంలో సంపద సృష్టించే క్రమంలో మూలధన వ్యయాన్ని గతం కంటే ప్రభుత్వం పెంచింది. అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక రథం సరైన దశదిశలో వెళ్తోందని, రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. కేంద్రం నుంచి మరిన్ని నిధులు వస్తాయని ఆశించింది. క్రమశిక్షణ, సాహసోపేత నిర్ణయాలు, సమష్టి కృషితో ప్రజల కలలు సాకారం చేసేందుకు రేయింబవళ్లు శ్రమిస్తామని ప్రకటించింది.
బీసీ సంక్షేమానికి రూ.51వేల కోట్లు : సామాజికన్యాయం పట్ల ప్రభుత్వానికున్న అంకితభావాన్ని బడ్డెట్ కేటాయింపుల్లో ప్రస్ఫుటం చేశారు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్. అభివృద్ధి అంటేకేవలం భవనాలే కాదని గౌరవప్రద జీవనమే అసలైన అభివృద్ధి అన్న పయ్యావుల ఇందుకు తగ్గట్లుగా బడ్జెట్‌లో సంక్షేమానికి పెద్దపీట వేశారు. 2047 స్వర్ణాంధ్ర లక్ష్యం సాకరం కోసం సంక్షేమానికి బడ్జెట్‌లో ఏకంగా 17శాతం నిధులు కేటాయించారు. బీసీ సంక్షేమానికి రూ.51వేల కోట్లు, SC సంక్షేమానికి రూ.20వేల 644కోట్లు, ST సంక్షేమానికి రూ.9వేల 190 కోట్లు కేటాయించారు.
గిరిజన, బీసీ, మైనారిటీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం : లక్షలాది కుటుంబాలకు పెద్ద కొడుకులా ప్రతినెల 1వ తేదీన పేదలకు అందజేస్తూ సామాజిక సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వేసిన బాటను బలపరిచేలా సామాజిక సంక్షేమంతో పాటు గిరిజన, బీసీ, మైనారిటీల సంక్షేమానికి బడ్జెట్‌లో ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అధిక ప్రాధాన్యం ఇచ్చారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా, గత 19 నెలల్లో రూ.58వేల కోట్ల రూపాయల్ని లబ్ధిదారులకు పంపిణీ చేశామని పయ్యావుల కేశవ్ వెల్లడించారు. ఎన్టీఆర్ భరోసా పథకానికి ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.27వేల 719 కోట్లు కేటాయించారు. దీపం 2.0 పథకానికి రూ.2వేల 601 కోట్లు, స్త్రీశక్తి పథకానికి రూ.1,420 కోట్లు, వెనుకపడిన వర్గాలకు రాయితీ, ఉచిత విద్యుత్‌కు రూ.600 కోట్లు, ఆటో డ్రైవర్ల సేవలో పథకానికి రూ.450 కోట్లు, తల్లికి వందనం పథకానికి రూ.9వేల668 కోట్లు, స్త్రీ,శిశు సంక్షేమం పథకానికి రూ.4,581 కోట్లు ఉపకార వేతనాలకు రూ.3,836 కోట్లు కేటాయించారు.
ఉద్యోగుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యం : మైనార్టీల సంక్షేమ నిధులు దాదాపుగా 50శాతం పెంచారు. 2025-2026 మధ్య మైనారిటీల సంక్షేమానికి రూ.3,766కోట్ల ఖర్చుచేయగా ఈ బడ్జెట్‌లో రూ.6,090కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. రాష్ట్రవ్యాప్తంగా మైనారిటీ వర్గాల విద్యా పురోగతి, ఆర్థిక సాధికారత, సామాజిక అంశాలపై దృష్టి సారించినట్లు ప్రకటించారు. ఉన్నత విద్య, వృత్తి విద్యను అభ్యసించే BC విద్యార్థులకు పూర్తి ట్యూషన్ ఫీజు రీయింబర్స్మెంట్, పోస్ట్-మెట్రిక్ విద్యార్థులకు నిర్వహణ భత్యం ఇస్తామని పయ్యావుల కేశవ్ వెల్లడించారు. 15శాతం వృద్ధి రేటు సాధించేందుకు ఆర్థిక కార్యకలాపాల్లో మహిళల భాగస్వామ్యం పెంచేలా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. మొత్తం మీద ఈ బడ్జెట్‌లో బీసీ సంక్షేమానికి ఈ బడ్జెట్‌లో రూ.51వేల 21కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు పయ్యావుల కేశవ్ ప్రతిపాదించారు.
ఉద్యోగుల సంక్షేమానికి ఈ బడ్జెట్‌లో ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. ఉద్యోగుల భవిష్య నిధి, పెన్షన్ ప్రక్రియలను సజావుగా కాగిత రహితంగా చేస్తున్నామని పయ్యావుల కేశవ్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న బకాయిలను కూడా చెల్లించడం ప్రారంభించామని రూ.1,100 కోట్ల రూపాయల DA, DR బకాయిలను విడుదల చేశామని చెప్పారు.
మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి అనిత - సభా వేదికగా కేటాయింపుల వివరణ
ప్రజల రాజధాని 'అమరావతి'ని నిర్మించాలనే నిబద్ధతతో ప్రభుత్వం పనిచేస్తోంది: ఆర్థికశాఖ మంత్రి

