'ఒక్క ఓటు-వంద లాభాలు' - 'వైఎస్సార్సీపీ నెవర్ ఎగైన్-కూటమి వన్స్ ఎగైన్' : ఆర్థిక మంత్రి పయ్యావుల
అధికారమనేది మాకు ఒక సాధనం మాత్రమే, ప్రజలకు మంచి జరగాలన్నదే మా లక్ష్యమన్న మంత్రి పయ్యావుల - 2026-27 బడ్జెట్ పై మూడు రోజుల పాటు జరిగిన చర్చకు చివరగా పయ్యావుల కేశవ్ సమాధానం

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 19, 2026 at 5:19 PM IST
Minister Payyavula 2026-27 Budget Final Reply in Assembly : 'వైఎస్సార్సీపీ నెవ్వర్ ఎగైన్, కూటమి వన్స్ ఎగైన్' అంటూ ఆర్ధికమంత్రి పయ్యావుల కేశవ్ 2026-27 బడ్జెట్‌పై చర్చకు సమాధానంగా అసెంబ్లీలో ప్రసంగించారు. 'ఒక్క ఓటు - వంద లాభాలు' అంటూ కూటమి ప్రభుత్వం చేసిన పనులను తన సమాధానంలో ప్రస్తావించారు. రాయలసీమ పై ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న చొరవతో పరిశ్రమల్లోనే కాకుండా పొలాల్లో కూడా పెట్టుబడులు పెడుతున్నారని వివరించారు. వైఎస్సార్సీపీ నాయకులను నయా నాజీలతో పోలుస్తూ ఆ తరహాలోనే గత పాలకులు రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారని ధ్వజమెత్తారు.
రాష్ట్రానికి వైఎస్సార్సీపీ హానికరం అనే ప్రమాదకర హెచ్చరిక నిరంతరం ఇస్తూనే ఉండాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ పై మూడు రోజుల పాటు జరిగిన చర్చకు చివరగా పయ్యావుల కేశవ్ తన సమాధానం ఇచ్చారు. ఇజ్రాయెల్ దేశస్థుల తరహాలో ప్రజలు కూడా మన రాష్ట్రం అనే భావనను పెంపొందించుకోవాలని సూచించారు. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే మైనింగ్ శాఖలో 33 శాతం, ఎక్సైజ్ శాఖలో 24 శాతం ఆదాయం పెరిగిందని వివరించారు.
అధిక వడ్డీలతో తెచ్చిన రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించేలా సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించారు. దాదాపు 2 వేల కోట్ల మేర వడ్డీలు తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఏడాదికి రూ.2 వేల కోట్లు ఆదా అయితే చాలా పథకాలు సమర్థవంతంగా అమలు చేయవచ్చని తెలిపారు. గత ప్రభుత్వం గనులు, ఎక్సైజ్ ఆదాయం తాడేపల్లి ప్యాలెస్‌కు వెళ్లిందని వైఎస్సార్సీపీపై పయ్యావుల విమర్శించారు.
పులివెందుల నియోజకవర్గంలోని సమస్యలు : పులివెందుల నియోజకవర్గంలోని సమస్యలను కూడా గత పాలకులు పట్టించుకోలేదని ఆర్ధిక మంత్రి విమర్శించారు. సీఎం చంద్రబాబు నిర్వహిస్తున్న జిల్లాల వారీ సమీక్షల్లో భాగంగా పులివెందుల నియోజకవర్గంలోని పెండింగ్ సమస్యలు వెలుగులోకి వచ్చాయని ఆయన వివరించారు. మల్లెల గ్రామంలో MJPAPBCWR (Mahatma Jyotiba Phule Andhra Pradesh Backward Classes Welfare Residential) Girls Schoolకు నిర్మాణం కోసం రూ.19.62 కోట్లు నిధులను పెండింగులో ఉన్నాయన్నారు.
బనానా ప్రాసెసింగ్ – ప్యాకేజింగ్ హౌస్ నిర్మాణాన్ని గాలికి వదిలేశారని దానిని ప్రారంభించేందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వం తీసుకుంటోందని తెలిపారు. పులివెందుల మున్సిపాల్టీ పరిధిలో సమగ్ర నీటిసరఫరా పథకం నిర్మాణం పూర్తి చేయలేదని విమర్శించిన ఆర్థిక మంత్రి దీని బిల్లులను కూడా పెండింగులో పెట్టిందని వెల్లడించారు. వేంపల్లి నుంచి గండి వరకు రోడ్ విస్తరణ, కాలేటి వాగు రిజర్వాయర్ పనులు వంటివి గత ప్రభుత్వ హాయంలో ఏ మాత్రం పట్టించుకోలేదని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వివరించారు.
దిల్లీ నుంచి వచ్చి పొలాలను కొంటున్నారు : రాయలసీమ హార్టీ కల్చర్ హాబ్‌కు ప్రకటించిన ప్రత్యేక పాకేజీ వల్ల దిల్లీ నుంచి వచ్చి కళ్యాణ దుర్గం నియోజకవర్గంలోని పొలాలను కొంటున్నారని దానిమ్మలు పండిస్తున్నారని వెల్లడించారు. చంద్రబాబు చొరవతో రాయలసీమ ఉత్పత్తులకు అరకు తరహాలో అంతర్జాతీయ బ్రాండింగ్ రాబోతోందంటూ సంతోషం వ్యక్తం చేశారు. రాయలసీమ ప్రాజెక్టులకు జగన్ మోహన్ రెడ్డి చేసిన ద్రోహాన్ని పయ్యావుల కేశవ్ వివరించారు. 102 రాయలసీమ ప్రాజెక్టులను ఒక్క సంతకంతో జగన్ రద్దు చేశారని ధ్వజమెత్తారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిర్మించడం లేదని నాడు కేంద్రానికి అప్పటి ఇరిగేషన్ స్పెషల్ సీఎస్‌గా ఉన్న ఆదిత్యనాధ్ దాస్ స్పష్టం చేశారంటూ ఆ డాక్యుమెంట్లను మంత్రి సభలో ప్రవేశపెట్టారు.
గోబెల్స్ తరహాలో ప్రచారం చేయడానికి సాక్షి మీడియాను అడ్డం పెట్టుకుని నయా నాజీల తరహాలో వైఎస్సార్సీపీ తయారయ్యిందని మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. బడ్జెట్ ప్రసంగంలో వైఎస్సార్సీపీ గురించి 16సార్లు, చంద్రబాబు గురించి 13సార్లు ప్రస్తావించారని సాక్షి రాసిందని, వాస్తవానికి చంద్రబాబు చేసిన మంచి పనుల గురించి ప్రతి పేజీలోనూ వైఎస్సార్సీపీ చేసిన ఘోరాలను ప్రతి పేరాలో ప్రస్తావించాలంటూ పయ్యావుల వ్యాఖ్యానించారు. కూటమి జరిపిన భూ కేటాయింపుల వల్ల కలిగిన లాభాలను వైఎస్సార్సీపీ, వైఎస్ హయాంలో జరిపిన భూ కేటాయింపులు కలిగిన నష్టాలను ఆయన ఏకరువు పెట్టారు.
వైఎస్ హయాంలో ఒక్క కంపెనీ కూడా రాలేదు : చంద్రబాబు హయాంలో భూములు కేటాయిస్తే కియా, HCL, అశోక్ లేలాండ్, హీరో కంపెనీ, టీసీఎస్, కాగ్నిజెంట్, గూగుల్ ఏఐ డేటా సెంటర్ వంటి సంస్థలు వచ్చాయని తెలిపారు. వైఎస్ హయాంలో ఇచ్చిన భూముల్లో ఒక్క కంపెనీ కూడా రాలేదని గుర్తు చేశారు. లేపాక్షి నాలెడ్జ్ హబ్, ఓ వ్యాన్ పిక్, ఓ బ్రాహ్మణి స్టీల్స్‌కు భూములిచ్చినా ఒక్క ఎంఎస్ఎంఈ కూడా రాలేదని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు.
ఒక్క ఓటు - వంద లాభాలు అంటూ, అమరావతికి రూ.12 వేల కోట్లు, పోలవరానికి రూ.15 వేల కోట్లు, విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్దరణకు రూ.11 వేల కోట్లు, విశాఖకు గూగుల్ డేటా సెంటర్, విశాఖకు రైల్వే జోన్ సాధించామని కేశవ్ వివరించారు. ఒక్క ఓటు - రాయలసీమ హర్టీకల్చర్ హబ్, అమరావతికి క్వాంటం వ్యాలీ, విద్యుత్ ఛార్జీల తగ్గింపు, నేషనల్ హైవే ప్రాజెక్టులు, రైల్వే లైన్లు తీసుకువచ్చిందన్నారు.
ఒక్క ఓటుతో ఆడబిడ్డలకు భద్రత, రాయలసీమకు హంద్రీ-నీవా కాల్వల ద్వారా కృష్ణా జలాలు తీసుకువచ్చాయన్నారు. ఒక్క ఓటు–రాజముద్రతో పట్టాదార్ పాస్ పుస్తకాలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, టీచర్ రిక్రూట్మెంట్, పోలీస్ కానిస్టేబుళ్ల నియామకం, గుంతల్లేని రోడ్లు తీసుకువచ్చాయని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం గత 20 నెలల్లో చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలను వివరిస్తూ ఆకట్టుకునేలా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రసంగం సాగింది.
రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసేలా బడ్జెట్ - అసెంబ్లీలో సభ్యుల ప్రశంసలు
రాష్ట్రంలో ప్రస్తుతమున్న పరిస్థితుల్లో మెరుగైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టాం: సీఎం చంద్రబాబు

