20న 'పుర' ఎన్నికల నోటిఫికేషన్! - 12న మున్సిపాలిటీల ఓటర్ల తుది జాబితా
ఎన్నికలకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్న ఎన్నికల సంఘం - రిజర్వేషన్ల ఖరారు దిశగా అధికారుల కసరత్తు - 117 మున్సిపాల్టీలు, 6 కార్పొరేషన్ల ఎన్నికలకు రంగం సిద్ధం

Published : January 8, 2026 at 7:37 AM IST
|Updated : January 8, 2026 at 8:36 AM IST
Municipal Elections In Telangana : తెలంగాణ రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల కోసం పురపాలక శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. రిజర్వేషన్లు ఖరారైన తర్వాతే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే రంగంలోకి దిగడంతో పురపాలక శాఖ అధికారులు కూడా వేగం పెంచారు. జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. మొత్తం ఎన్నికల పర్వంలో రిజర్వేషన్ల ప్రక్రియ అత్యంత కీలకం కావడంతో అధికారులు దీనిని సకాలంలో పూర్తి చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో గడువు ముగిసిన 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్ల ఎన్నికలకు రంగం సిద్ధమైన విషయం తెలిసిందే.
ఇంకా గడువు ముగియని 4 మున్సిపాలిటీలతో పాటు జీహెచ్‌ఎంసీని కూడా ప్రస్తుతం జరుగబోయే ఎన్నికల నుంచి మినహాయించారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని మున్సిపాలిటీలను విలీనం చేయడం వల్ల జీహెచ్‌ఎంసీ పరిధి విస్తారంగా పెరగగా, దీన్ని మూడుగా విభజించాలన్న ప్రతిపాదన నేపథ్యంలోనే ఇక్కడ కూడా ఎన్నికలు వాయిదా వేశారు. దాంతో మిగతా పట్టణ స్థానిక సంస్థల్లో తుది ఓటర్ల జాబితా సిద్ధం చేసే పని వేగం అందుకుంది. ఈ నెల ఒకటో తేదీనే ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించగా, ప్రస్తుతం అభ్యంతరాల పరిశీలనకు సంబంధించిన పనులు నడుస్తున్నాయి. ఈ నెల 12న మున్సిపాలిటీల ఓటర్ల తుది జాబితా ప్రచురించనున్నారు. 20న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుందని అంతా భావిస్తున్నారు. ప్రభుత్వం దీనిపై ఇప్పటికే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలను ఎలాగైనా ఫిబ్రవరి రెండో వారంలో నిర్వహించే అవకాశం ఉంది.
రిజర్వేషన్లు ఇలా : 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను, రాష్ట్రంలో కులగణన కోసం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ ప్రతిపాదనల ఆధారంగా బీసీ రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేయనున్నారు. పట్టణ స్థానిక సంస్థల్లో సాధారణంగా ఎస్సీ, ఎస్టీ జనాభా తక్కువగా ఉంటుంది. మొత్తం జనాభాలో వీరి వాటా ప్రకారం రిజర్వేషన్లు కేటాయిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత బీసీ రిజర్వేషన్లు పూర్తి చేస్తారు. 2020లో జరిగిన పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 13.82 శాతం ఎస్సీలు, 3.25 శాతం ఎస్టీలు, 32.52 శాతం బీసీ జనాభా ఉన్నట్లు గుర్తించి దాని ఆధారంగానే తుది రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఎస్సీ, ఎస్టీలకు నిర్ణయించిన తర్వాత మిగతా వాటిని మొత్తం రిజర్వేషన్లు 50 శాతం పరిమితికి లోబడి బీసీలకు కేటాయిస్తారు. మొత్తం స్థానాల్లో 50 శాతం మహిళలకు కేటాయిస్తారు. రిజర్వేషన్ ప్రకారం ఏ సామాజిక వర్గానికి కేటాయించినప్పటికీ, అందులో మళ్లీ సగం స్థానాలు మహిళలకే దక్కనున్నాయి.
ఏర్పాట్లు పూర్తి చేయాలి : మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయా జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపాలిటీ, కార్పొరేషన్ల కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ నెల 12న తుది ఓటర్ల జాబితా, 13న పోలింగ్ స్టేషన్ల వివరాల ముసాయిదా జాబితా ప్రచురించి, వాటిని ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టి-పోల్ యాప్‌లో అప్‌లోడ్ చేయాలని ఆమె స్పష్టం చేశారు. 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతో పాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితా ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని కమిషనర్ పేర్కొన్నారు. అవసరమైన బ్యాలెట్ బాక్సుల అంచనా, రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్, జోనల్ అధికారుల నియామకానికి ఉద్యోగుల వివరాలను టి-పోల్‌లో వేగంగా అప్‌డేట్ చేయాలని రాణి కుముదిని ఆదేశించారు.
మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్ - ఈ నెలలోనే నోటిఫికేషన్!

