ఇవాళే గ్రామ, వార్డు సభలు - ముసాయిదా ఓటర్ల జాబితాను వినిపించనున్న బీఎల్వోలు
నేడు రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు, వార్డు సభలు - 36,353 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు - తొలగించిన ఓటర్ల వివరాలు చదివి వినిపించనున్న బీఎల్వోలు - నోటీసులు అందిన ఓటర్లు నుంచి వివరాల సేకరణకు ఏర్పాట్లు

Published : August 27, 2026 at 7:13 AM IST
|Updated : August 27, 2026 at 10:23 AM IST
Gram Sabha On SIR : ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా నేడు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సభలు జరగనున్నాయి. వివిధ కారణాలతో ఇప్పటికే తొలగించిన ఓటర్లలో అర్హులుంటే గుర్తించనున్నారు. కొత్త ఓటర్ల నమోదు, అడ్రస్, ఇతర వివరాల మార్పుపై అవగాహన కల్పించనున్నారు. ఎస్‌ఐఆర్‌లో భాగంగా అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేసి వివరణలు నమోదు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 92 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జనరేట్ చేసి పంపిణీ చేస్తున్నారు.
బోగస్ ఓటర్లపై అభ్యంతరాల స్వీకరణ : ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీల్లో గ్రామసభలు అలాగే పట్టణాలు, నగరాల్లో వార్డు సభలు జరగనున్నాయి. రాష్ట్రంలోని 36,353 పోలింగ్ కేంద్రాల పరిధిలో ఈ సభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. గ్రామ, వార్డు సభల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌వోలపై సీఈవో సుదర్శన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మార్గదర్శకాలపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 3.38 కోట్ల ఓటర్లు ఉండగా ఇటీవల ఎన్యుమరేషన్ ప్రక్రియ తర్వాత 73.39 లక్షల ఓట్లు తొలగించారు.
మరణించిన, చిరునామా మార్చిన డూప్లికేట్, అందుబాటులో లేని ఓటర్లను తొలగించినట్లు సీఈవో కార్యాలయం ప్రకటించింది. అలా తొలగించిన ఓటర్ల పేర్లను గ్రామసభల్లో చదివి వినిపిస్తారు. తొలగించిన ఓటర్లలో అర్హులుంటే గుర్తించి తిరిగి చేర్చే ప్రక్రియ చేపడతారు. ముసాయిదా జాబితాలో అనర్హులు, బోగస్ ఓటర్లున్నా స్థానికుల నుంచి అభ్యంతరాలు, వివరాలు నమోదు చేస్తారు.
రద్దీ కాకుండా రోజూ కొద్ది మందికి నోటీసులు : అక్టోబరు 1 నాటికి 18 ఏళ్లు నిండే యువతకు ఓటు నమోదు చేసేందుకు ఫారం 6, డిక్లరేషన్ ఇస్తారు. కొత్త ఓటు లేదా వివరాల మార్పు కోసం గ్రామసభల్లోనే ఫారం నింపి ఇవ్వొచ్చు. గ్రామ, వార్డు సభల్లో జరిగిన విషయాలన్నీ బీఎల్వోలు నమోదు చేయనున్నారు. నోటీసుల ప్రక్రియను వివరించి అవసరమైన ఫారాలు అందుబాటులో ఉంచుతారు. ముసాయిదా జాబితాలో ఉన్న 92.87 లక్షల ఓటర్లకు నోటీసులు జనరేట్ చేశారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో నోటీసులు ఇచ్చి వాటికి సమాధానాలు సేకరిస్తున్నారు. ఒకేసారి ఇస్తే రద్దీ ఏర్పడుతుందన్న ఉద్దేశంతో రోజూ కొద్ది మందికి ఇచ్చేలా జిల్లా కలెక్టర్లు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో 2002లో జరిగిన ఎస్‌ఐఆర్ వివరాలు ప్రస్తావించని వారితో పాటు వివరాల్లో స్పష్టత లేని వారికి కూడా నోటీసులు జారీ చేస్తున్నారు.
వెంటనే ఆన్లైన్ జాబితాలో చేరుస్తారు : అన్‌మ్యాపింగ్, అనామలిస్ ఓటర్లుగా పేర్కొంటూ నోటీసులు ఇస్తున్నారు. నోటీసు ఎందుకు వచ్చింది? ఆధారాలు ఎప్పుడు? ఎక్కడ? ఎవరికి? సమర్పించాలో కూడా అందులో వివరిస్తున్నారు. ఎన్నికల కమిషన్ ప్రకటించిన 12 డాక్యుమెంట్లలో అవసరమైనవి తీసుకొని నమోదు చేసే ప్రక్రియ కొనసాగుతోంది. సరైన ఆధారాలు ఇచ్చిన వారి ఓటు వెంటనే ఆన్‌లైన్‌లో తుది జాబితాలో చేరుస్తున్నారు. అక్టోబరు 15 నాటికి నోటీసులు, అభ్యంతరాలన్నీ పరిష్కరించి అక్టోబరు 19న తుది ఓటర్ల జాబితాను సీఈవో కార్యాలయం వెల్లడించనుంది.
SIR : రేపు రాష్ట్రవ్యాప్త గ్రామ సభలు - ప్రజల సమక్షంలో ఓటర్ల జాబితాను చదివి వినిపించనున్న బీఎల్వోలు
తెలంగాణ 'సర్' ముసాయిదా జాబితా విడుదల - మీ పేరుందో లేదో చెక్ చేసుకోండిలా

