ETV Bharat / state

దద్దరిల్లిన శాసన మండలి - పోడియం చుట్టుముట్టి వైఎస్సార్సీపీ సభ్యుల ఆందోళన

ఇందాపూర్ డెయిరీ పేరుతో టీటీడీకి హెరిటేజ్ నెయ్యి సరఫరా అంశంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆందోళన - పోడియం వద్దకు వెళ్లి ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ ఆందోళన - సభ రేపటికి వాయిదా

Fifth Day of Legislative Council
Fifth Day of Legislative Council (ETV)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 18, 2026 at 4:51 PM IST

|

Updated : February 18, 2026 at 5:05 PM IST

3 Min Read
Choose ETV Bharat

Fifth Day of Legislative Council : ఇందాపూర్ డెయిరీ అంశంపై వరుసగా రెండో రోజూ శాసన మండలి దద్దరిల్లింది. ఇందాపూర్ డెయిరీ పేరుతో టీటీడీకి హెరిటేజ్ సంస్థ నెయ్యి సరఫరా చేస్తోన్న అంశంపై చర్చించాలంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు పట్టుబట్టి ఆందోళన చేశారు. సభా కార్యకలాపాలను పూర్తిగా అడ్డుకున్నారు. వైఎస్సార్సీపీ సభ్యుల తీరుపై మంత్రులు మండిపడ్డారు. సభ్యుల ఆందోళనతో కార్యకలాపాలు ఏవీ జరగకుండానే సభ గురువారానికి వాయిదా పడింది.

దద్దరిల్లిన శాసన మండలి - పోడియం చుట్టుముట్టి వైఎస్సార్సీపీ సభ్యుల ఆందోళన (ETV)

ఐదో రోజున శాసన మండలి సమావేశాలకు వైఎస్సార్సీపీ సభ్యులు ర్యాలీగా వచ్చారు. ఇందాపూర్ డెయిరీ పేరుతో టీటీడీకి హెరిటేజ్ సంస్థ నెయ్యి సరఫరా చేసిన అంశాలపై సభలో చర్చ జరపాలంటూ ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకుని సభా ప్రాంగణంలోకి అడుగు పెట్టారు. సంతాప తీర్మానంలో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీలు ఐలాపురం వెంకయ్య, టి రత్నాభాయి మృతిపై మండలి ఛైర్మన్ కొయ్యే మోషేను రాజు సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మృతి చెందిన మాజీ ఎమ్మెల్సీలకు శాసన మండలి ప్రగాఢ సంతాపం తెలిపింది. వారి మృతితో శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపింది.

వారికి సంతాపం తెలిపిన మండలి : ఐదో రోజైన ఇవాళ సభ సమావేశం కాగానే సంతాప ప్రతిపాదనను సభాపతి స్థానం నుంచి మండలి ఛైర్మన్ కొయ్యె మోషేను రాజు ప్రతిపాదించారు. మాజీ ఎమ్మెల్సీలు ఐలాపురం వెంకయ్య, టి రత్నాభాయి చేసిన సేవలను కొనియాడారు. ప్రజల కోసం తమ జీవితాన్ని అర్పించారని కీర్తించారు. అనంతరం వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని శాసన మండలి కోరుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం సభలో సభ్యులంతా లేచి నిలబడి 2నిముషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు.

తీర్మానాన్ని తిరస్కరించిన మండలి ఛైర్మన్ : అనంతరం ఇందాపూర్ డెయిరీ పేరుతో టీటీడీకి హెరిటేజ్ సంస్థ నెయ్యి సరఫరా చేస్తోన్న అంశంపై చర్చించాలంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు రమేశ్ యాదవ్, ఆర్.జె భరత్, సిపాయి సుబ్రమణ్యం ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు మండలి ఛైర్మన్ ప్రకటించారు. తిరుమల కల్తీ లడ్డూపై చర్చించాలని ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి ఇచ్చిన మరో వాయిదా తీర్మానాన్నీ తిరస్కరిస్తున్నట్లు ఛైర్మన్ ప్రకటించారు.

నిబంధనల ప్రకారం ప్రశ్నోత్తరాలను చేపట్టారు. సభా కార్యకలాపాలను నిలిపివేసి తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై సభలో చర్చించాలని వైఎస్సార్సీపీ సభ్యుల ఆందోళనకు దిగారు. పోడియం వద్దకు వెళ్లి ప్లకార్డులు పట్టుకుని, నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. వైఎస్సార్సీపీ సభ్యులు పట్టువీడకుండా ఆందోళన చేయడంతో సభను కాసేపు వాయిదా వేస్తున్నట్లు మండలి ఛైర్మన్ ప్రకటించారు.

పోడియం వద్ద ప్లకార్డులు పట్టుకుని నినాదాలు : అనంతరం సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలు ముగిసినట్లు మండలి ఛైర్మన్ ప్రకటించారు. తరువాత సభ్యులకు ప్రత్యేక అంశాల ప్రస్తావనకు అవకాశం ఇచ్చారు. దీన్ని కూడా వైఎస్సార్సీపీ సభ్యులు అడ్డుకున్నారు. పోడియం వద్దకు వెళ్లి ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగించారు. ఇందాపూర్ డెయిరీపై చర్చ జరపాల్సిందేనంటూ పట్టుబట్టారు. వైఎస్సార్సీపీ సభ్యుల తీరుపై హో మంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. దేవుడినీ రాజకీయాల కోసం వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తిరుమల నెయ్యిలో కల్తీ జరిగిందని సీబీఐ చార్జీషీట్​లో స్పష్టంగా చెప్పిందని, కల్తీ లడ్డూ తయారు చేసి రూ.240 కోట్లు జేబుల్లో నింపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చర్చ లేకుండానే రేపటికి వాయిదా : పోడియంను చుట్టుముట్టి ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆందోళన చేశారు. సభ్యుల ఆందోళనతో శాసన మండలి సమావేశాలు రేపటికి వాయిదా వేస్తూ ఛైర్మన్ నిర్ణయం ప్రకటించారు. వైఎస్సార్సీపీ సభ్యుల ఆందోళనతో ప్రశ్నోత్తరాలు, ప్రత్యేక ప్రస్తావన, బడ్డెట్ పై చర్చ లేకుండానే సభ కార్యకలాపాలు రేపటికి వాయిదా పడ్డాయి.

బొత్స Vs లోకేశ్ - ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ బకాయిలపై మండలిలో వాడీవేడి చర్చ

లడ్డూ కల్తీ వ్యవహారంపై అట్టుడికిన మండలి - ఇరువురి వాదోపవాదాలతో గందరగోళం

Last Updated : February 18, 2026 at 5:05 PM IST