ETV Bharat / state

NH-44పై ఆ 10 కిలోమీటర్ల మేర ఫెన్సింగ్ - 6 అడుగుల ఎత్తుతో ఇరువైపులా

తరచూ జనావాసాల్లోకి వన్యప్రాణులు - రహదారులపై సంచరిస్తూ వాహనాలు ఢీకొని మృత్యువాతపడుతున్న అడవి జంతువులు - మూగజీవుల రక్షణ కోసం నిజామాబాద్​లోని 44వ జాతీయ రహదారికి కంచె ఏర్పాటు

Fences On National Highways In Nizamabad
Fences On National Highways In Nizamabad (ETV)
author img

By ETV Bharat Telangana Team

Published : October 16, 2025 at 9:50 AM IST

3 Min Read
Choose ETV Bharat

Fences On National Highways In Nizamabad : అడవుల్లో సంచరించాల్సిన వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయి. రాత్రి సమయాల్లో రహదారులపై తిరుగుతూ ప్రమాదాల బారినపడుతున్నాయి. భారీ వాహనాలు ఢీకొని ఒక్కొక్కటిగా మృత్యువాతపడుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్న నేపథ్యంలో ఎన్​హెచ్​ఏఐ​, అటవీ శాఖ అధికారులు వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు చేపట్టారు. దట్టమైన అడవి ఉన్న ప్రాంతాల్లో రక్షణ కోసం ప్రత్యేక కంచెను ఏర్పాటు చేస్తున్నారు.

తరచూ జనావాసాల్లోకి వన్యమృగాలు : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చిరుతల సంఖ్య పెరగడంతో తరచూ జనావాసాల్లోకి వస్తున్నాయి. వాటిని చూసిన ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రహదారులపై సంచరిస్తున్న క్రమంలో వాహనాలు ఢీకొని వన్యప్రాణులు ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇలాంటి ఘటనలు జిల్లాలో తరచూ జరుగుతూనే ఉన్నాయి. జాతీయ రహదారి నిర్మించిన తర్వాత 15 ఏళ్లలో దాదాపు నాలుగు చిరుతలు చనిపోగా, మరికొన్ని గాయపడ్డాయి. ఈ ప్రమాదాలను అరికట్టేందుకు ఇందల్​వాయి రేంజ్ పరిధిలో జాతీయ రహదారి పక్కన రక్షణ కంచె ఏర్పాటుకు పూనుకున్నారు. దీని నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.

అడవిని విడిచి జాతీయ రహదారిపైకి రాకుండా : నిజామాబాద్, ఆర్మూర్ డివిజన్లలో 86 వేల హెక్టార్లలో అడవి విస్తరించి ఉంది. ఇందులో నిజామాబాద్ ఉత్తరం, దక్షిణం, ఇందల్​వాయి, ఆర్మూర్, కమ్మర్‌పల్లి, సిరికొండ, వర్ని రేంజ్‌లున్నాయి. 44వ జాతీయ రహదారిపై చిరుతల సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో వన్యప్రాణులు అడవిని విడిచి, జాతీయ రహదారిపైకి రాకుండా ఉండేందుకు అధికారులు ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందల్​వాయి రేంజ్ పరిధిలో దట్టమైన అడవి ప్రాంతం ఉన్న జాతీయ రహదారికి ఇరువైపులా ఆరు అడుగుల ఎత్తుతో కంచె ఏర్పాటు చేస్తున్నారు. వన్య ప్రాణులకు హాని జరుగకుండా కంచె ఏర్పాటు చేస్తుండటంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వేగ నియంత్రణ పాటించాలి : తమ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకొని, నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఫెన్సింగ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టడం అభినందనీయమని అటవీ శాఖ అధికారులు అంటున్నారు. వాహనదారులు సైతం అటవీ ప్రాంతాల్లో నిర్దేశించిన వేగ నియంత్రణ పాటించాలని సూచిస్తున్నారు. ఎన్​హెచ్​ఏఐ, అటవీ శాఖ అధికారులు వన్యప్రాణుల సంరక్షణకు సమన్వయంతో ముందుకెళ్లడం శుభసూచకమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

10 కిలోమీటర్లు ఫెన్సింగ్ : ఎన్​హెచ్​ఏఐతో మాట్లాడి అండర్ పాస్​లు, ఫెన్సింగ్​లు వేయాలని సూచించామని ఫారెస్ట్ రేంజ్ అధికారి రవి మోహన్‌ భట్‌ అన్నారు. రోడ్డుకు ఇరువైపులా 5 కిలోమీటర్ల చొప్పున మొత్తం 10 కిలోమీటర్లు ఫెన్సింగ్ వేస్తారని తెలిపారు. గత ఆరేళ్లలో 5 చిరుతలు, ఒక ఎలుగు బంటి చనిపోయాయని వెల్లడించారు. వాహనదారుల మితిమీరిన వేగం కారణంగా ప్రమాదాలు జరిగి, వన్యమృగాలు చనిపోతున్నాయని పేర్కొన్నారు. ఇవి జరగకుండా సైన్​బోర్డులు, వేగ నియంత్రణ సూచనలు, రేడియం స్టిక్కర్లు వేశామని అన్నారు. అయినా సరే రాత్రులు వేగంగా వచ్చి వాటిని ఢీకొంటున్నారని, ఈ కారణంగానే ఫెన్సింగ్ వేస్తున్నామని తెలిపారు.

"ఎన్​హెచ్​ఏఐతో మాట్లాడి అండర్ పాస్​లు, ఫెన్సింగ్​లు వేయాలని సూచించాం. రోడ్డుకు ఇరువైపులా 5 కిలోమీటర్ల చొప్పున మొత్తం 10 కిలోమీటర్లు ఫెన్సింగ్ వేస్తారు. గత ఆరేళ్లలో 5 చిరుతలు, ఒక ఎలుగు బంటి చనిపోయాయి. వాహనదారుల మితిమీరిన వేగం కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. వన్య మృగాలు చనిపోతున్నాయి. ఇవి జరగకుండా సైన్​బోర్డులు, వేగ నియంత్రణ సూచనలు, రేడియం స్టిక్కర్లు వేశాం. అయినా సరే రాత్రులు వేగంగా వచ్చి వాటిని ఢీకొంటున్నారు. ఈ కారణంగానే ఫెన్సింగ్ వేస్తున్నాం." - రవి మోహన్‌ భట్‌, ఫారెస్ట్ రేంజ్ అధికారి

కస్తూరి జింక అవశేషాల పట్టివేత! - పోలీసుల అదుపులో నిందితుడు

వన్యప్రాణుల దాడిలో గాయపడితే రూ.70 వేల ఆర్థికసాయం - మరణిస్తే ఎంతో తెలుసా?