ETV Bharat / state

భార్యను దూషించాడని తోటి కార్మికుడి హత్య - బయటపడకుండా మృతదేహం చుట్టూ గోడ నిర్మాణం

అద్దె గదిలోనే హత్య చేసి మృతదేహాన్ని కప్పుతూ గోడ కట్టిన నిందితుడు - తాళం వేసి అక్కడ్నుంచి పరారీ - గదిని వేరే వారికి ఇచ్చిన యజమాని - దుర్వాసన రావడంతో విషయం వెలుగులోకి

Murder And Hide Body By Wall Construction
Murder And Hide Body By Wall Construction (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 6, 2026 at 4:09 PM IST

3 Min Read
Choose ETV Bharat

Murder And Hide Body By Wall Construction : ఓ కుటుంబ సభ్యులు హైదరాబాద్​లోని నేరేడ్​మెట్​లో కొత్తగా ఓ అద్దె గదిలోకి దిగారు. ఇళ్లంతా చిందరవందరగా ఉండటంతో కాస్త శుభ్రం చేద్దామని నడుం బిగించారు. ఒక్కొక్కటిగా సామాను తీసేస్తున్న క్రమంలో ముక్కుపుటాలదిరేలా దుర్గంధం వచ్చింది. ఏంటా వాసన? ఎక్కడ్నుంచి వస్తుందా అని పరిశీలించారు. గదిలోని ఓ మూలలో కట్టిన గోడ దగ్గర్నుంచి అని తెలిసింది. ఇంటి యజమానికి ఈ విషయం చెప్పారు. ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి గోడను బద్ధలు కొట్టేసరికి ఓ విస్తుపోయే దారుణం బయటపడింది.

కుళ్లి పోయిన స్థితిలో : పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేటకు చెందిన మల్లేశం ప్లంబర్‌గా పనిచేస్తున్నాడు. హైదరాబాద్‌ నేరేడ్‌మెట్ ప్రాంతంలోని జీకే కాలనీలో ఒక గదిని అద్దెకు తీసుకుని నివసిస్తున్నాడు. అయితే, మల్లేశం నాలుగు నెలల నుంచి కనిపించకుండా పోయాడు. ఇంటి యజమాని కాల్‌ చేసినా స్పందించడం మానేశాడు. దీంతో విసిగిపోయిన యజమాని ఆ గదిని వేరే వారికి అద్దెకు ఇచ్చాడు. కొత్తగా దిగిన అద్దెవాసులు వంటగదిని శుభ్రం చేస్తుండగా, గదిలో నిర్మించిన ఓ గోడ నుంచి విపరీతమైన దుర్వాసన రావడాన్ని గుర్తించారు. యజమాని ఫిర్యాదుతో పోలీసులు అక్కడికి చేరుకుని, గోడను తొలగించి చూడగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని చూసి నిర్ఘాంతపోయారు. దీంతో చనిపోయింది మల్లేశం అయి ఉంటాడని భావించారు. ఆ మేరకు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు మల్లేశం బతికే ఉన్నాడని చనిపోయిందని తోటి కార్మికుడు వెంకటరాములు అని తెలుసుకున్నారు.

తలపై విచక్షణారహితంగా దాడి : మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వెంకటరాములు మౌలాలిలో ఉంటూ దినసరి కూలీగా జీవనం సాగిస్తున్నాడు. పని కోసం వెళ్లే కూలీల అడ్డా వద్ద వీరికి పరిచయం ఏర్పడింది. గత ఏడాది డిసెంబర్లో ఒకరోజు మల్లేశం, వెంకటరాములు ఇద్దరూ పని కోసం అడ్డా వద్ద కలిశారు. అయితే ఆ రోజు వీరికి ఏ పనీ దొరకలేదు. దీంతో ఇద్దరూ కలిసి మద్యం తాగాలని నిర్ణయించుకున్నారు. తొలుత వైన్ షాపు వద్ద మద్యం సేవించారు. అనంతరం, మరికాస్త మద్యం కొనుగోలు చేసి నేరేడ్‌మెట్‌లోని మల్లేశం అద్దె గదికి చేరుకున్నారు. గదిలో ఇద్దరూ కలిసి మద్యం సేవిస్తున్న క్రమంలో మాటమాట పెరిగింది. మల్లేషం భార్య గురించి వెంకటరాములు తీవ్ర అభ్యంతరకరంగా మాట్లాడాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన మల్లేశం ఇంట్లోని ఓ కర్రతో వెంకటరాములు తలపై విచక్షణారహితంగా బాదాడు. ఆ దెబ్బలకు వెంకటరాములు రక్తపు మడుగులో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.

"నిందితుడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. వారు మాట్లాడటానికి ఇష్టపడలేదు. తండ్రి చేష్టలు నచ్చక హాస్టల్లో ఉంటూ వారి చదువేదో వారు చదువుకుంటున్నారు. వీరిది సొంతూరు సిద్ధిపేట, కొండపాక మండలంలోని సిరసనగండ్ల. నిందితుడికి అన్నదమ్ములు కూడా ఉన్నారు. ప్లంబర్​గా పని చేస్తున్నాడని తెలుసుకుని, ఎక్కడెక్కడ పని చేశాడో ఆరా తీశాం. ఆయా ప్రాంతాల్లో పలువురి కార్మికులను అడిగాం. ఈ క్రమంలో అతడితోపాటు ఉన్నది వెంకటరాములు అని తెలిసింది" - శ్రీధర్, మల్కాజ్ గిరి జోన్ డీసీపీ

దొరికిపోకుండా ఉండేందుకు : హత్య చేసిన తర్వాత మల్లేశం ఏమాత్రం భయపడకుండా, సాక్ష్యాలను మాయం చేసేందుకు బయట నుంచి సిమెంట్ ఇటుకలు, ఇసుకను తెచ్చుకున్నాడు. తను ఉంటున్న గదిలోని ఒక మూలన మృతదేహాన్ని ఉంచి, దాని చుట్టూ ఇటుకలతో ఒక గోడను నిర్మించాడు. ఆ గోడలో శవం ఎవరికీ కనిపించకుండా భద్రపరిచాడు. అనంతరం ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు. మృతుడు వెంకటరాములుకు కుటుంబంతో పెద్దగా సంబంధాలు లేకపోవడంతో అతను కనిపించకుండా పోయిన విషయం ఎవరూ గమనించలేదు.

"మృతుడు వెంకటరాములుకు సొంతిళ్లు లేదు. ఇతడికి ఒక కుమారుడున్నాడు. ప్రస్తుతం క్యాటరింగ్ పని చేస్తున్నాడు. తండ్రి తాగుతూ, తిరిగుతూ ఉంటాడని తండ్రికి దూరంగా ఉంటున్నాడు. వెంకటరాములుకు రెండు పెళ్లిళ్లయ్యాయి. మొదటి భార్య వదిలేసి వెళ్లిపోయింది. రెండో భార్య కూడా వేరే వారిని పెళ్లి చేసుకుంది. ఇతడు ప్రత్యేకంగా అద్దె గది తీసుకోకుండా ఎక్కడైనా నిర్మాణ పనులు జరుగుతుంటే, వారిని అడిగి అక్కడే ఉండేవాడని తెలిసింది" - శ్రీధర్, మల్కాజ్ గిరి జోన్ డీసీపీ

భార్యను దూషించినందుకే : ఇంటి యాజయాని ఫిర్యాదుతో నేరేడ్‌మెట్ పోలీసులు కేసును సవాల్‌గా తీసుకున్నారు. నిందితుడి సెల్‌ఫోన్ డేటా ఆధారంగా మల్లేశం కదలికలను ట్రాక్ చేశారు. నాలుగు నెలల తర్వాత జూబ్లీ బస్టాండ్ వద్ద మల్లేశంను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో మల్లేశం తన నేరాన్ని అంగీకరించాడు. భార్యను దూషించినందుకే హత్య చేశానని ఒప్పుకున్నాడు.

బాయ్​ఫ్రెండ్స్​ ఉన్నా సర్దుకుపోదామనుకున్నాడు - కానీ ఆ వీడియోతో ప్రాణాలు తీసుకున్నాడు

కూకట్​పల్లిలో విషాదం - ఆత్మహత్యకు పాల్పడిన నవ జంట